Published : 15 Aug 2021 03:58 IST

ఆటల దేశంగా మారుద్దాం

‘ఆటలను ప్రేమిస్తేనే సరిపోదు.. ఆడాలి’ అంటున్నాడు సచిన్‌ తెందుల్కర్‌. మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యమైన క్రీడలను ఇంకెంత మాత్రం విస్మరించకూడదని చెబుతున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనాడుకు ప్రత్యేకంగా రాసిన వ్యాసంతో మాస్టర్‌ బ్లాస్టర్‌ ఆటల అవశ్యత గురించి నొక్కి చెప్పాడు. సచిన్‌ ఏమన్నాడంటే..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఇది చాలా ముఖ్యమైన రోజు. స్వతంత్ర భారత్‌ 75వ ఏట అడుగు పెడుతోంది. స్వేచ్ఛ గురించి, మనకు అదెంత ముఖ్యం అన్నదాని గురించి ఆలోచించుకోవడానికి ఇది సరైన సమయం. గత రెండేళ్ల్లుగా ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇళ్లకే పరిమితం కావడంతో.. స్వేచ్చగా సంచరించడం, ఊపిరిపీల్చడం వంటి చిన్న చిన్న విషయాలను ఇన్నాళ్లు మనం ఎంత తేలిగ్గా తీసుకున్నామో అర్థమైంది. బహుశా ఇందువల్లే కావొచ్చు, నిరుడు ప్రొఫెషనల్‌ క్రీడలు తిరిగి ఆరంభమైనప్పుడు, ఎట్టకేలకు ఈ ఏడాది ఒలింపిక్స్‌ జరిగినప్పుడు మనందరికీ ఏదో విముక్తి పొందిన భావన కలిగింది.

దురదృష్టవశాత్తు.. ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువను గుర్తించడం మానవ లక్షణం. మనందరం మన ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకున్నాం. భారత్‌.. అత్యంత యువ దేశాల్లో ఒకటి, కానీ అత్యంత ఫిట్టయిన దేశం కాదు. దేశంలో క్రీడా సంస్కృతి లేకపోవడాన్ని కూడా ఇది సూచిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ సందర్భంగా జనం పొద్దున్నే లేచి భారత్‌కు మద్దతుగా ఉత్సాహంగా స్పందించడం సంతోషాన్నిచ్చింది. అయితే ఆటగాళ్ల నుంచి ప్రేరణ పొంది జనం ఆటలు ఆడడం మొదలు పెడితే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనది క్రీడలను ప్రేమించే దేశం.. కానీ క్రీడలు ఆడే దేశంగా ఎదగాలి. ఆట కేవలం ఒక భౌతిక కార్యకలాపమే కాదు, అది వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. నాయకత్వ లక్షణాలు అబ్బేలా చేస్తుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండేందుకు ఆట దోహదపడుతుంది.
ప్రతి ఒక్కరి, ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని మనం విస్మరించకూడదు. పాఠశాలలు దశలవారిగా తెరుచుకుంటున్న నేపథ్యంలో.. ఇప్పటికే నష్టపోయిన తరగతి విద్య కోసం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పీరియడ్లను విస్మరిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మనం ఇకనైనా ఆటలను ముఖ్యంగా తీసుకోవడం మొదలుపెట్టాలి. వారానికి ఏ ఒక్కసారో కాకుండా ప్రతి రోజూ ఆటల క్లాస్‌ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం.

పతకాలు గెలిచిన భారత ఒలింపియన్ల వీరోచిత ప్రదర్శనలు  ఆటలను ఎంచుకునే మన పిల్లలను ప్రేరేపిస్తాయని ఆశిస్తున్నా. అయితే క్రీడలు మన దైనందిన జీవితంలో భాగమైతే ఇంకా గొప్పగా ఉంటుంది. ఇతర దేశాల్లో అనేక మంది ఒలింపియన్లకు సమాంతరంగా విజయవంతమైన కెరీర్లు ఉన్నాయి. భారత్‌లో మాత్రం ఎక్కువ మందికి కెరీర్‌నో, ఆటలనో ఎంచుకోవాల్సి వస్తోంది. మన పిల్లలు ఆటలను ఎంచుకుంటే వాళ్లందరూ  క్రీడాకారులు కాకపోవచ్చు. కానీ తప్పకుండా ఆరోగ్యవంతులైన ఇంజినీర్లు, వైద్యులు, న్యాయవాదులుగా ఎదుగుతారు. ‘విద్యా హక్కు’ లాగే.. ‘ఆడే స్వేచ్ఛ’ కూడా చాలా ముఖ్యం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. భారత్‌ను ఆటలను ప్రేమించే దేశం నుంచి ఆటలను ఆడే దేశంగా మారుస్తామని మనమంతా ప్రతినబూనుదాం. మన  దేశ ఆరోగ్యం పట్ల మనందరికీ బాధ్యత ఉంది.

జైహింద్‌!

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని