Updated : 17/08/2021 07:01 IST

లార్డ్స్‌లో ఓ అద్భుతం

రెండో టెస్టులో కోహ్లీసేన సంచలన విజయం

ఇంగ్లాండ్‌కు షాక్‌

సిరాజ్‌ సూపర్‌ బౌలింగ్‌

బుమ్రా, షమి మెరుపులు

ఒక్కరైనా ఊహించి ఉంటారా కోహ్లీసేన గెలుస్తుందని?

ఇంగ్లాండ్‌కు పొరపాటునైనా ఈ ఫలితం వస్తుందన్న ఆలోచన వచ్చి ఉంటుందా? లార్డ్స్‌లో అద్భుతమే జరిగింది. ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాక్‌! కోహ్లీసేన సంచలనం సృష్టించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, అదిరే ప్రదర్శనతో రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

టీమ్‌ఇండియా పోరాటం అద్వితీయం. మ్యాచ్‌ను డ్రా  చేసుకున్నా గొప్పే అనుకున్న స్థితి నుంచి పట్టుదలగా పుంజుకుని, పైచేయి సాధించి.. ధీమాగా ఉన్న ఇంగ్లిష్‌ జట్టుకు షాకిచ్చిన తీరు నభూతో..!

సిరాజ్‌, షమి, బుమ్రా.. లార్డ్స్‌లో ఆఖరి రోజు హీరోలు. అనూహ్యంగా బ్యాటుతో మెరిసిన షమి, బుమ్రా జట్టుకు ఓటమి ముప్పును తప్పిస్తే... సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ డ్రా ప్రయత్నాలకు చెక్‌ పెట్టాడు. బుమ్రా,   ఇషాంత్‌తో కలిసి భారత్‌ను విజయపథంలో నడిపించాడు.

లండన్‌

ఆఖరి రోజు అదరగొట్టిన టీమ్‌ ఇండియా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డ్రానే లక్ష్యంగా, ప్రతికూల పరిస్థితుల్లో సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌..  ఎవరూ ఊహించని స్కోరు సాధించి, ఆతిథ్య జట్టు పోరాడాల్సిన పరిస్థితిని కల్పించింది. బ్యాట్‌తో షమి (56 నాటౌట్‌; 70 బంతుల్లో 6×4, 1×6), బుమ్రా (34 నాటౌట్‌; 64 బంతుల్లో 3×4) అసాధారణ పోరాటంతో భారత్‌.. 298/8 వద్ద డిక్లేర్‌ చేసింది. సిరాజ్‌ (4/32), బుమ్రా (3/33), ఇషాంత్‌ (2/13) విజృంభించడంతో ఛేదనలో ఇంగ్లాండ్‌ 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. రూట్‌ (33; 60 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఇంగ్లాండ్‌ విలవిల: 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు కంగారు తప్పలేదు. డ్రా కోసమే ఆడాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆ జట్టుకు దిమ్మదిరిగే షాక్‌ తగిలింది. రెండు ఓవర్లయినా పూర్తి కాకముందే, స్కోరు బోర్డుపై రెండు పరుగులైనా చేరకుండానే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ షాకిచ్చింది కూడా బుమ్రా, షమి జోడీనే. బౌలింగ్‌ దాడిని ఆరంభించిన బుమ్రా.. మూడో బంతికే బర్న్స్‌ను వెనక్కి పంపగా.. రెండో ఓవర్లో సిబ్లీ ఇన్నింగ్స్‌కు షమి తెరదించాడు. ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవలేదు. 10 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ మరో వికెట్‌ కోల్పోవాల్సింది. కానీ షమి బౌలింగ్‌లో హమీద్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్‌ చేజార్చాడు. ఇక రూట్‌ ఎప్పటిలా బాధ్యతాయుతంగా ఆడుతూ.. హమీద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఓ దశలో స్కోరు 44/2. కానీ ఇషాంత్‌ భారత్‌ ఆశలను అమాంతం పెంచేశాడు. హమీద్‌ (9)ను అతడు వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. కొన్ని ఓవర్ల తర్వాత బెయిర్‌స్టో (2)నూ ఇషాంత్‌ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఈసారి భారత్‌ సమీక్షలో వికెట్‌ సాధించింది. టీ సమయానికి ఇంగ్లాండ్‌ 67/4. ఇంగ్లాండ్‌ తీవ్ర ఒత్తిడిలో పడ్డ వేళ.. మ్యాచ్‌పై టీమ్‌ ఇండియా పట్టు బిగిసింది.

పోరాడిన బట్లర్‌: విజయంపై కన్నేసిన భారత్‌కు ప్రధాన అడ్డంకి రూట్‌. కానీ విరామం తర్వాత తొలి ఓవర్లోనే ఓ చక్కని డెలివరీతో అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా భారత్‌ విజయావకాశాలను మరింత వాస్తవికంగా మార్చాడు బుమ్రా. కానీ బట్లర్‌.. మొయిన్‌ అలీ (13)తో కలిసి పోరాడాడు. ఇద్దరూ సహనంగా బ్యాటింగ్‌ చేస్తూ ఓవర్లు కరిగిస్తూ పోయారు. ఇంగ్లాండ్‌లో ఆశలు రేపారు. అయితే సిరాజ్‌.. వరుస బంతుల్లో మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌ (0)ను ఔట్‌ చేసి భారత్‌కు ఉత్సాహాన్నిచ్చాడు. కానీ క్రీజులో పాతుకుపోయిన బట్లర్‌.. రాబిన్సన్‌ (35 బంతుల్లో 9) సహకారంతో పట్టుదలగా బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఆడాల్సిన ఓవర్లు తగ్గుతూ ఉంటే.. ఇంగ్లాండ్‌ డ్రా ఆశలు పెరుగుతూ పోయాయి. బ్యాట్స్‌మెన్‌ పట్టుదల చూస్తుంటే.. భారత్‌కు చక్కని అవకాశం చేజారుతుందేమో అనిపించింది. అలాంటి దశలో రాబిన్సన్‌ను ఓ స్లో బాల్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా బుమ్రా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అద్భుత బౌలింగ్‌ను కొనసాగించిన సిరాజ్‌.. తర్వాతి  ఓవర్లో బట్లర్‌, అండర్సన్‌ను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఉత్కంఠభరిత ముగింపు తప్పదనుకుంటే.. మ్యాచ్‌కు హఠాత్తుగా తెరపడింది.

బుమ్రా, షమి దంచేశారు..: నాలుగో రోజు ఆట ఆఖరుకు ఇంగ్లాండ్‌దే స్పష్టంగా పైచేయి. విజయాన్ని ఆశించే స్థితిలో ఉంది కూడా. రహానె, పుజారా పోరాడినా.. భారత్‌కు ముప్పు పొంచే ఉంది. 181/6తో నిలిచిన ఆ జట్టు ఆధిక్యం 154 పరుగులు మాత్రమే. పంత్‌ తప్ప మిగిలిన వాళ్లంతా టెయిలెండర్లే. అయిదోరోజు ఆ ఆఖరి నాలుగు వికెట్లను చకచకా పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చని ఇంగ్లాండ్‌ భావించే ఉంటుంది. అందుకు తగ్గట్లే పంత్‌ (22)ను త్వరగా (జట్టు స్కోరు 194 వద్ద) వెనక్కి పంపడం, కాసేపటికే ఇషాంత్‌ కూడా నిష్క్రమించడంతో ఆ జట్టు లక్ష్యం నెరవేరుతుందేమో అనిపించింది. కానీ ఊహించని విధంగా ఇంగ్లాండే ఒత్తిడికి గురైంది. టెయిలెండర్లు షమి, బుమ్రా ఆ జట్టుకు షాకిచ్చారు. అభేద్యమైన 9వ వికెట్‌కు ఏకంగా 89 పరుగులు జోడించి.. భారత్‌కు ప్రమాదాన్ని తప్పించడమే కాకుండా.. గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం కల్పించారు. షమి-బుమ్రా జోడీ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది.


మలుపు తిప్పింది అతడే

లార్డ్స్‌లో భారత జట్టు విజయంలో హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ది కీలకపాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ మరీ ఎక్కువ ఆధిక్యం సాధించకుండా చూసిన ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ డ్రా దిశగా మళ్లుతున్న స్థితిలో అతడి సంచలన బౌలింగే జట్టుకు విజయాన్నందించింది. మొదట మొయిన్‌ అలీ-బట్లర్‌ పట్టుదలగా ఆడుతూ క్రీజులో పాతుకుపోతున్న సమయంలో వరుస బంతుల్లో మొయిన్‌, కరన్‌లను ఔట్‌ చేసి దెబ్బ కొట్టిన సిరాజ్‌.. మ్యాచ్‌ ముగియడానికి మరి కొన్ని ఓవర్లే ఉన్న సమయంలో ఒకే ఓవర్లో బట్లర్‌, అండర్సన్‌ను పెవిలియన్‌ చేర్చి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఇన్‌స్వింగింగ్‌ యార్కర్లు, షార్ట్‌ బంతులకు మెరుపు వేగాన్ని జోడించి అతడు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేశాడు. సిరాజ్‌ ఇలాంటి ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతడు మెరుపు బౌలింగ్‌తో కంగారూల పనిపట్టాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి జట్టు సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరిదైన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన ఓ సంచలనం.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 364

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 391

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 21; పుజారా (సి) రూట్‌ (బి) వుడ్‌ 45; కోహ్లి (సి) బట్లర్‌ (బి) కరన్‌ 20; రహానె (సి) బట్లర్‌ (బి) అలీ 61; పంత్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 22; జడేజా (బి) అలీ 3; ఇషాంత్‌ ఎల్బీ (బి) రాబిన్సన్‌ 16; షమి నాటౌట్‌ 56; బుమ్రా నాటౌట్‌ 34; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (109.3 ఓవర్లలో 8 వికెట్లకు) 298 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-18, 2-27, 3-55, 4-155, 5-167, 6-175, 7-194, 8-209; బౌలింగ్‌: అండర్సన్‌ 25.3-6-53-0; రాబిన్సన్‌ 17-6-45-2; మార్క్‌ వుడ్‌ 18-4-51-3; సామ్‌ కరన్‌ 18-3-42-1; మొయిన్‌ అలీ 26-1-84-2; రూట్‌ 5-0-9-0

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్‌ (బి) షమి 0; హమీద్‌ ఎల్బీ (బి) ఇషాంత్‌ 9; రూట్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో ఎల్బీ (బి) ఇషాంత్‌ 2; బట్లర్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 13; కరన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; రాబిన్సన్‌ ఎల్బీ (బి) బుమ్రా 9; వుడ్‌ నాటౌట్‌ 0; అండర్సన్‌ (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 29 మొత్తం: (51.5 ఓవర్లలో ఆలౌట్‌) 120; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-44, 4-67, 5-67, 6-90, 7-90,   8-120, 9-120; బౌలింగ్‌: బుమ్రా 15-3-33-3; షమి 10-5-13-1; జడేజా 6-3-5-0; సిరాజ్‌ 10.5-3-32-4; ఇషాంత్‌ 10-3-13-2


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్