Published : 19/08/2021 03:09 IST

వేదనలోంచి ఓ విజేత

బాధతో కుంగిపోయే వాళ్లు కొందరు. కానీ ఆ బాధలోంచి పట్టుదల పెరిగి విజేతలుగా నిలిచేవాళ్లు ఇంకొందరు. రెండో కోవకే చెందుతాడు హైదరాబాదీ యువ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి వడివడిగా టీమ్‌ఇండియా వైపు అడుగులు వేసినా.. అత్యున్నత వేదికలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేక ఇబ్బంది పడ్డ బౌలర్‌ అతను. ఈ వైఫల్యాల బాధ కొనసాగుతుండగానే తండ్రి మరణం అతడికో పెద్ద ఎదురు దెబ్బ. అలాంటి సమయంలో సిరాజ్‌ కుంగిపోకుండా ఎలా నిలబడ్డాడో.. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలా విజేతగా నిలిచాడో భారత క్రికెట్లో గొప్ప ఉదంతాలతో కూడిన ‘మిషన్‌ డామినేషన్‌: యాన్‌ అన్‌ఫినిష్డ్‌ క్వెస్ట్‌’ పుస్తకంలో వివరించారు. ఆ కథేంటో చూద్దాం పదండి.

ఈనాడు క్రీడావిభాగం

యూఏఈలో ఐపీఎల్‌ ముగించుకుని అట్నుంచి అటే  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్‌.. టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు పిడుగులాంటి వార్త విన్నాడు. తననెంతో కష్టపడి పెంచి, క్రికెటర్‌ను చేసిన తండ్రి అనారోగ్యంతో మృతి చెందితే కొవిడ్‌ నిబంధనల కారణంగా స్వదేశానికి వెళ్లలేని స్థితి సిరాజ్‌ది. సిరాజ్‌ స్వదేశానికి వెళ్తే మళ్లీ ఆస్ట్రేలియాకు రావడం కష్టం. క్వారంటైన్‌ నిబంధనల వల్ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోతాడు. ఈ స్థితిలో సిరాజ్‌ తప్పనిసరై ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తండ్రి చనిపోతే కడసారి చూపునకు నోచుకోలేదు. పైగా ఆ బాధాకర సమయంలో తన పక్కన ఎవ్వరూ లేరు. అప్పుడు సిరాజ్‌ అనుభవించిన మానసిక వేదన గురించి ‘మిషన్‌ డామినేషన్‌’లో బోరియా మజుందర్‌, కుషాన్‌ వివరించారు. ‘‘నవంబరులో ఆస్ట్రేలియాలో సిరాజ్‌ 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న సమయంలో తన తండ్రిని కోల్పోయాడు. అప్పుడు ఆటగాళ్లందరూ ఎవరికి వాళ్లు ఒంటరిగా గదుల్లో గడపాల్సిన పరిస్థితి. ఆటగాళ్లు పరస్పరం కలవకుండా గదుల బయట రక్షణ సిబ్బంది ఉండేవారు. దీంతో సిరాజ్‌ తన బాధను పంచుకోవడానికి కూడా పక్కన ఒకరు లేని పరిస్థితి. వీడియో కాల్స్‌ ద్వారా తనను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. ఒక్క ఫిజియో నితిన్‌ పటేల్‌కు మాత్రమే ఆటగాళ్ల గదుల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండేది. అతనే సిరాజ్‌ను కాస్త ఓదార్చాడు. ఆ సమయంలో నిరాశలోకి జారుకోలేదు. భారత జట్టు తరఫున సత్తా చాటాలన్న తన తండ్రి కలను నెరవేర్చాలనుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో వైఫల్యం అతడిని వెంటాడుతూనే ఉంది. కానీ ఇండియా-ఎ తరఫున ఆస్ట్రేలియాలో పర్యటించినపుడు హెడ్‌, లబుషేన్‌లపై తాను పైచేయి సాధించిన విషయాన్ని గుర్తు చేసుకుని.. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఆ ఇద్దరినీ ఎందుకు ఔట్‌ చేయలేనని తనను తాను ప్రశ్నించుకున్నాడు. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్‌ డే టెస్టు ఆడే అవకాశం రాగానే చెలరేగాడు. మొత్తం 13 వికెట్లతో సిరీస్‌లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా నిలిచాడు’’ అని ఈ పుస్తకంలో సిరాజ్‌ ప్రయాణాన్ని వివరించారు. నాటి జోరును కొనసాగిస్తూ తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో 8 వికెట్లతో మరో చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడీ హైదరాబాదీ.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్