Published : 30 Aug 2021 04:05 IST

తగ్గేదేలే

పారాలింపిక్స్‌లో భారత్‌కుఒకేరోజు 3 పతకాలు

భవీనా, నిషాద్‌లకు రజతాలు

వినోద్‌కు కాంస్యం.. ఫలితంపై నేడు స్పష్టత

పోలియో కారణంగా ఒకరు కుర్చీకే పరిమితమయ్యారు.. ప్రమాదం కారణంగా ఇంకొకరు చేయి కోల్పోయారు.. శిక్షణలో గాయపడి సైన్యంలో సేవకు దూరమయ్యారు మరొకరు. అలాగని వీళ్లంతా ఖాళీగా కూర్చోలేదు! మన రాత ఇంతే అనుకోలేదు! అచంచల విశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో విశ్వ వేదిక ఎక్కారు.. అంచనాలకు మించి రాణించి భారత జెండాను ఎగరేశారు. ఒక్క రోజులోనే మన దేశానికి మూడు పతకాలు కట్టబెట్టారు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన భవీనా పటేల్‌, నిషాద్‌ కుమార్‌, వినోద్‌ కుమార్‌ల గురించే ఇదంతా. టేబుల్‌ టెన్నిస్‌లో చరిత్ర సృష్టిస్తూ భవీనా రజతం గెలవగా.. హైజంప్‌లో నిషాద్‌ కూడా రజతం సొంతం చేసుకున్నాడు. ఇక డిస్కస్‌త్రోలో వినోద్‌ కాంస్యంతో మెరిశాడు. అతడి వర్గీకరణపై ఫిర్యాదు అందడంతో ఫలితంపై నిర్వాహకులు సమీక్ష చేపట్టారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజు (ఆగస్టు 29)న పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు రావడం విశేషం.

టోక్యో

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన భవీనాబెన్‌ పటేల్‌ రజతంతో మెరిసింది. టేబుల్‌ టెన్నిస్‌లో దేశానికి తొలి పతకం అందించిన ఆమె పసిడి పోరులో ఓటమి ఎదుర్కొంది. ఆదివారం భారత్‌ ఖాతాలో చేరిన తొలి పతకం ఆమెదే. క్లాస్‌-4  మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భవీనా 7-11, 5-11, 6-11తో ప్రపంచ నంబర్‌వన్‌ యింగ్‌ జావో చేతిలో ఓడింది. 19 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో అక్కడక్కడా భవీనా మెరుపులు మెరిపించినా.. తనకన్నా మెరుగైన ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. తొలి గేమ్‌లో ఒక దశలో ఆమె 5-7తో నిలిచినా.. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన యింగ్‌ ఈ గేమ్‌ను గెలుచుకుంది. రెండు, మూడో గేమ్‌ల్లోనూ భవీనా ప్రత్యర్థి జోరును అడ్డుకోలేకపోయింది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన యింగ్‌ స్వర్ణం సొంతం చేసుకుంది. ‘‘రజతం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ స్వర్ణం నెగ్గకపోవడం నిరాశ కలిగిస్తోంది. అమ్మాయిలందరికి నా విజయం స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. వైకల్యం ఉందని తర్వాత తరం వాళ్లు ఎవరూ బాధపడకూడదు. పతకం గెలవడం ద్వారా అయినా అవకాశాలు వస్తాయని.. అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తానని భావిస్తున్నా’’ అని భవీనా చెప్పింది.

నిషాద్‌ అదుర్స్‌: యువకుడు 21 ఏళ్ల నిషాద్‌ సత్తా చాటాడు. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యం నెగ్గిన ఈ కుర్రాడు టోక్యోలో అంతకంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. టి47 హైజంప్‌లో 2.06 మీటర్ల ఎత్తు ఎగిరిన అతడు రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గాడు. అమెరికా ఆటగాడు డల్లాస్‌ వైస్‌ కూడా నిషాద్‌లాగే 2.06 మీటర్లు ఎగిరాడు. వీళ్లిద్దరికి రజత పతకాలు బహుకరించారు. అమెరికాకే చెందిన రొడ్రిక్‌ టౌన్‌సెండ్‌ 2.15 మీటర్లతో ప్రపంచ రికార్డు నమోదు చేయడంతో పాటు స్వర్ణం ఎగరేసుకుపోయాడు.

వినోద్‌ మెరిశాడు కానీ..: డిస్కస్‌త్రో ఎఫ్‌ 52  విభాగంలో వినోద్‌ కుమార్‌ పతక ప్రదర్శన చేశాడు. 19.91 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరిన వినోద్‌ మూడో స్థానంలో నిలిచాడు. పోలెండ్‌ అథ్లెట్‌ పయిటర్‌ కోస్‌విజ్‌ (20.02 మీటర్లు) స్వర్ణం నెగ్గగా.. క్రొయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండోర్‌ (19.98 మీటర్లు) రజతం గెలిచాడు. ప్రస్తుతానికి ఈ విభాగంలో కాంస్య పతక విజేత వినోద్‌ కుమార్‌.. అయితే అతడి వర్గీకరణపై ఫిర్యాదు అందడంతో నిర్వాహకులు ఫలితాన్ని సమీక్షిస్తున్నారు. సోమవారం తుది నిర్ణయం వెలువడుతుంది. బలహీన కండరాల శక్తి, పరిమిత కదలిక, అవయవ లోపం లేదా కాళ్ల పొడవులో వ్యత్యాసం ఉన్నవాళ్లు ఎఫ్‌52 వర్గీకరణ కింద పోటీపడొచ్చు. ఆగస్టు 22న నిర్వాహకులు ఈ వర్గీకరణ చేపట్టి పోటీపడే అథ్లెట్ల తుది జాబితా రూపొందించారు. ‘‘పారాలింపిక్స్‌ ఆరంభానికి ముందు వర్గీకరణ చేపట్టారు. అయితే వినోద్‌ వర్గీకరణపై నిర్వాహకులకు ఫిర్యాదు అందింది. అది ఎందుకు అన్నదానిపై స్పష్టత లేదు. వినోద్‌ పోటీపడిన విభాగం ఫలితంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. నిర్వాహకులు సమీక్ష చేపట్టాక సోమవారం తుది నిర్ణయం వెలువడుతుంది. ఆ తర్వాత    పతకాలను బహుకరిస్తారు’’ అని భారత చెఫ్‌ డి మిషన్‌ గుర్‌శరణ్‌ సింగ్‌ తెలిపాడు.


రైతు కుటుంబం నుంచి

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లా అంబ్‌ గ్రామానికి చెందిన నిషాద్‌ కుమార్‌ రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు   రశ్‌పాల్‌ సింగ్‌, పుష్ప కుమారి    పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఎనిమిదేళ్ల వయసులో తమ కుటుంబం పని చేసే పొలంలో ఆడుకుంటుండగా గడ్డి కోసే యంత్రంలో పడి అతడి కుడి చేయి తెగిపోయింది. అయితే చేయి లేకపోయినా నిషాద్‌ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. అన్నింట్లోనూ చాలా చురుగ్గా ఉండేవాడు. సరస్వతి విద్యామందిర్‌ పాఠశాల మైదానంలో కోచ్‌ రమేశ్‌ ప్రోత్సాహంతో అథ్లెటిక్స్‌లోకి వచ్చాడు. మొదట 200 మీ, 400 మీ పరుగులో సాధన చేసేవాడు. ఆ తర్వాత హైజంప్‌కు ఆకర్షితుడయ్యాడు. ఒక చేయి లేకుండా హైజంప్‌ చేయడం చాలా కష్టం. కానీ నిషాద్‌ మాత్రం పెద్దగా ఇబ్బందిపడకుండానే జంప్‌ చేయగలిగేవాడు. ఇదే  అతడిని పోటీలకు వెళ్లేలా  ప్రేరేపించింది. 2013లో పటియాలలో జరిగిన జాతీయ పాఠశాల క్రీడల్లో సబ్‌ జూనియర్‌ విభాగంలో రజతం గెలిచిన నిషాద్‌.. 2017లో జరిగిన జాతీయ పాఠశాల క్రీడల్లో సాధారణ క్రీడాకారులతో పోటీపడి 1.75 మీటర్ల ఎత్తు ఎగిరి పదో స్థానంలో నిలిచాడు. పంచకులలోని తౌదేవి లాల్‌ స్టేడియంలో కోచింగ్‌కు చేరడం నిషాద్‌ ఆటను ఎంతో మెరుగుపరిచింది. జాతీయ పోటీల్లో రాణించే విశ్వాసాన్ని ఇచ్చింది.

రెండుసార్లు కొవిడ్‌ వచ్చినా..: 2019లో దుబాయ్‌లో జరిగిన పారా గ్రాండ్‌ప్రి టోర్నీలో టీ47 హైజంప్‌ విభాగంలో 1.92 మీటర్లతో నిషాద్‌ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది దుబాయ్‌లోనే జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడు కాంస్య పతకంతో మెరిశాడు. అంతేకాదు టోక్యో పారాలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. ఆ తర్వాత రెండుసార్లు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినా నిషాద్‌ కుంగిపోలేదు. ప్రాక్టీస్‌ ఆపలేదు. ఈ ఏడాది దిల్లీలో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో 2.07 మీటర్లతో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేశాడు. మంచి ఎత్తు ఉండడం ఈ ఆటలో ఈ కుర్రాడికి కలిసొచ్చింది. వేగంగా నేర్చుకునే తత్వం అతడిని మిగిలిన అథ్లెట్ల కన్నా భిన్నంగా నిలబెట్టింది. టీవీలో హైజంప్‌ మ్యాచ్‌లు చూడడం ద్వారా అతడు ఫాస్‌బరీ ఫ్లాఫ్‌ టెక్నిక్‌ను నేర్చుకోవడం విశేషం. వారంలో నాలుగు రోజులు 50-60 జంప్స్‌ చేస్తూ నిషాద్‌ ఈ టెక్నిక్‌ను బాగా మెరుగుపరుచుకున్నాడు. రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తంగవేలు మరియప్పన్‌కు ట్రైనింగ్‌ ఇచ్చిన సత్యనారాయణ్‌ దగ్గర శిక్షణ పొందడం కూడా అతడికి కలిసొచ్చింది.  


భవీనా రజత మెరుపులు
- భవీనా
సచిన్‌ స్ఫూర్తినిచ్చాడు

దిల్లీ: దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాడని టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భవీనాబెన్‌ పటేల్‌ తెలిపింది. మరింత ప్రేరణ కోసం సచిన్‌ను కలుస్తానని.. తను సాధించిన పతకం చూపిస్తానని చెప్పింది. ‘‘నేనెప్పుడూ సచిన్‌ నుంచి స్ఫూర్తి పొందుతుంటా. నా కళ్లారా అతడిని చూడాలనుకుంటున్నా. సచిన్‌ స్ఫూర్తిమంతమైన మాటల నుంచి మరింత ప్రేరణ పొందాలని భావిస్తున్నా. నేను సాధించిన పతకం   సచిన్‌కు చూపిస్తా’’ అని భవీనా పేర్కొంది.


2

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన రెండో క్రీడాకారిణి భవీనా. దీప మలిక్‌ 2016 రియో పారాలింపిక్స్‌ షాట్‌పుట్‌లో రజతం నెగ్గింది.


సైనికుడు అవుదామనుకుని..

రియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన వినోద్‌కుమార్‌ది చాలా భిన్నమైన నేపథ్యం. ఆర్మీ కుటుంబంలో పుట్టిన అతడు చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలనే కలగన్నాడు. వినోద్‌ తండ్రి 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొని గాయపడ్డాడు. అయితే అతడు ఇచ్చిన స్ఫూర్తితో వినోద్‌ చదువు పూర్తయిన తర్వాత సరిహద్దు భద్రతా దళంలో పని చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నాడు. కానీ అతడి సంకల్పానికి విధి సహకరించలేదు. 2002లో లేహ్‌లో సైనిక శిక్షణ సందర్భంగా జారి పడడంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పదేళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యాడు. ఈ సమయంలోనే తల్లిదండ్రులు మరణించడం వినోద్‌ను తీవ్రంగా కుంగదీసింది. సైనికుడు కావాలన్న అతడి కల చెదరడంతో 2012లో రోహ్‌తక్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో వినోద్‌ ఒక చిన్న షాపు తెరిచాడు. ఆ తర్వాత రెండేళ్లకు పెళ్లి చేసుకున్న  అతడికి ఇద్దరు పిల్లలు పుట్టారు. దేశానికి సేవ చేయాలి.. పేరు తెచ్చుకోవాలన్న అతడి ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. క్రీడల రూపంలో అతడికి ఆ అవకాశం మళ్లీ దక్కింది.

రియో స్ఫూర్తితో..: 2016 పారాలింపిక్స్‌ వినోద్‌లో స్ఫూర్తి నింపాయి. అసలు పారా క్రీడలు అనేవి ఒకటుంటాయని అతడికి అప్పుడే తెలిసింది. ఈ క్రీడల్లో ఆడి దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నాడు. రోహ్‌తక్‌లోని సాయ్‌ కేంద్రంలో చేరి పారా డిస్కస్‌ త్రోలో శిక్షణ తీసుకున్నాడు. 2017, 18 జాతీయ టోర్నీల్లో కాంస్యం గెలవడంతో వినోద్‌ ఆత్మవిశ్వాసం  పెరిగింది. 2019లో తొలిసారి పారిస్‌ గ్రాండ్‌ప్రి రూపంలో ఓ అంతర్జాతీయ టోర్నీలో ఆడిన వినోద్‌.. అదే ఏడాది దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా టోక్యో పారాలింపిక్స్‌ బెర్తు కూడా పట్టాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని