IPL 2021: దిల్లీ నెత్తిన సిక్స్‌ ఫైనల్‌కు కోల్‌కతా

బంతులు 25.. చేయాల్సిన  పరుగులు 13.. చేతిలో ఉన్న వికెట్లు 8. సమీకరణం ఎంతో తేలిగ్గా ఉంది. కోల్‌కతా చాలా ధీమాగా ఉంది. స్టేడియం ప్రశాంతంగా ఉంది. ఫలితం తేలిపోయిందని ప్రేక్షకులు టీవీలు కట్టేసే పనిలో ఉన్నారు. అప్పుడే నితీశ్‌ రాణా ఔటయ్యాడు. ఎవరిలోనూ చలనం లేదు.

Updated : 14 Oct 2021 08:44 IST

 ఆశల్లేని మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ అద్భుత పోరాటం

త్రిపాఠి సిక్స్‌తో గట్టెక్కిన నైట్‌రైడర్స్‌

షార్జా

బంతులు 25.. చేయాల్సిన  పరుగులు 13.. చేతిలో ఉన్న వికెట్లు 8. సమీకరణం ఎంతో తేలిగ్గా ఉంది. కోల్‌కతా చాలా ధీమాగా ఉంది. స్టేడియం ప్రశాంతంగా ఉంది. ఫలితం తేలిపోయిందని ప్రేక్షకులు టీవీలు కట్టేసే పనిలో ఉన్నారు. అప్పుడే నితీశ్‌ రాణా ఔటయ్యాడు. ఎవరిలోనూ చలనం లేదు. తర్వాతి ఓవర్లో   2 పరుగులే వచ్చాయి. క్రీజులో బాగా కుదురుకున్న గిల్‌ ఔటయ్యాడు. అయినా   ఏమవుతుందిలే అని కోల్‌కతా అభిమానుల్లో ధీమా! ఆ తర్వాతి ఓవర్లో వచ్చింది     ఒక్క పరుగే. దినేశ్‌ కార్తీక్‌ పెవియలియన్‌కు. ఏమైనా అద్భుతం జరుగుతుందా అన్న అనుమానం! ఇంకో ఓవర్లో మూడే పరుగులొచ్చాయి. మోర్గాన్‌ ఔట్‌. ఏదో సంచలనం జరగబోతోందని అందరిలోనూ ఒక్కసారిగా ఉత్కంఠ! 6 బంతుల్లో 7 పరుగులు చేయాలి. నాలుగు బంతుల్లో వచ్చింది ఒక్క పరుగే. పైగా రెండు వికెట్లు పడ్డాయి. ఇక దిల్లీ అసాధారణ, అద్భుత విజయానికి అంతా సిద్ధమైపోయారు. కానీ అయిదో బంతికి కథ మొత్తం మారిపోయింది.  స్టాండ్స్‌లో బంతి.. ఫెనల్‌కు కోల్‌కతా.. ఇంటికి దిల్లీ! ఈ మ్యాచ్‌ ఓడితే ఓడింది కానీ.. దిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం మాత్రం అద్భుతహ!

పీఎల్‌లో మరోసారి పాత ఛాంపియన్‌నే చూడబోతున్నాం. మూడుసార్లు టైటిల్‌ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. రెండుసార్లు విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫైనల్లో తలపడబోతోంది. తొలి క్వాలిఫయర్‌లో నెగ్గి ఇప్పటికే చెన్నై తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో క్వాలిఫయర్‌లో దిల్లీని ఓడించి కోల్‌కతా ఫైనల్లో అడుగు పెట్టింది. బుధవారం ఆఖర్లో అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా గట్టెక్కింది. ఆ జట్టు 3 వికెట్ల తేడాతో దిల్లీని ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 5 వికెట్లకు 135 పరుగులే చేసింది. ధావన్‌ (36; 39 బంతుల్లో 1×4, 2×6), శ్రేయస్‌ అయ్యర్‌ (30; 27 బంతుల్లో 1×4, 1×6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వరుణ్‌ చక్రవర్తి (2/26) సహా కోల్‌కతా బౌలర్లందరూ రాణించారు. అనంతరం ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (55; 41 బంతుల్లో 4×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (46; 46 బంతుల్లో 1×4, 1×6) సత్తా చాటడంతో నైట్‌రైడర్స్‌ తేలిగ్గానే గెలిచేలా కనిపించినా.. ఆఖరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న దిల్లీ బౌలర్లు ఆ జట్టును కట్టి పడేశారు. కానీ రాహుల్‌ త్రిపాఠి (12 నాటౌట్‌; 11 బంతుల్లో 1×6) ఒత్తిడిలో సిక్సర్‌ బాది క్యాపిటల్స్‌కు నిరాశను మిగిల్చాడు. దిల్లీ బౌలర్లలో రబాడ (2/23), నార్జ్‌ (2/31), అశ్విన్‌ (2/27) రాణించారు. వెంకటేశ్‌ అయ్యర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఫైనల్‌ శుక్రవారం జరుగుతుంది.

అక్కడిదాకా మామూలుగా..: ఈ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారుతుందన్న అంచనానే కలగకుండా కోల్‌కతా ఛేదనలో దూసుకెళ్లింది. ఐపీఎల్‌ రెండో అంచెలో నైట్‌రైడర్స్‌ రాత మారడంలో కీలక పాత్ర పోషించిన యువ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ కీలక మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పరుగుల కోసం ఆపసోపాలు పడ్డ పిచ్‌ మీద అతను అలవోకగా షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో గిల్‌ నుంచి అతడికి చక్కటి సహకారం అందింది. పవర్‌ప్లే అయ్యేసరికి 51/0తో తిరుగులేని స్థితిలో నిలిచిన కోల్‌కతా.. 12 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. 38 బంతుల్లోనే అర్ధశతకం సాధించి వెంకటేశ్‌ ఊపుమీదున్నాడు. కోల్‌కతా ఒక్క వికెట్టయినా కోల్పోతుందా.. ఎన్ని బంతులు మిగిలుండగా ఆ జట్టు గెలుస్తుంది అనే చర్చల్లా ఉన్నారంతా. అప్పుడే వెంకటేశ్‌ను రబాడ ఔట్‌ చేశాడు. అయినా కోల్‌కతాకు ఇబ్బంది లేనట్లే కనిపించింది. రాణా (13) ఓ సిక్స్‌ బాది ఊపుమీద అగుపించాడు. గిల్‌ సైతం ఓ సిక్స్‌ అందుకున్నాడు. అయితే నార్జ్‌ వేసిన 16వ ఓవర్‌ చివరి బంతికి రాణా ఔట్‌ కావడంతో మ్యాచ్‌ గమనం మారిపోయింది. 4 ఓవర్లలో 13 పరుగులే చేయాల్సిన స్థితిలోనూ దిల్లీ బౌలర్లు ఆశలు వదులుకోకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి జట్టును పోటీలోకి తెచ్చారు. తర్వాతి మూడు ఓవర్లలో అవేష్‌, రబాడ, నార్జ్‌ కలిసి ఆరు పరుగులే ఇచ్చారు. ఒక్కో ఓవర్లో ఒక్కొక్కరు చొప్పున గిల్‌, కార్తీక్‌ (0), మోర్గాన్‌ (0) ఔటైపోయారు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే పేసర్ల కోటా పూర్తి కావడంతో చివరి ఓవర్‌ అశ్విన్‌ వేయాల్సి వచ్చింది. అతను తొలి నాలుగు బంతుల్ని గొప్పగానే వేశాడు. తొలి 2 బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చాడు. మూడో బంతికి షకిబ్‌ను వికెట్ల ముందు బలిగొన్నాడు. నాలుగో బంతికి నరైన్‌ భారీ షాట్‌ ఆడబోయి లాంగాఫ్‌లో అక్షర్‌కు దొరికిపోయాడు. దీంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో దిల్లీనే గెలిచేలా కనిపించింది. కానీ అయిదో బంతిని అశ్విన్‌ మరీ షార్ట్‌గా వేయడంతో త్రిపాఠి శక్తినంతా ఉపయోగించి లాంగాఫ్‌లోకి లేపి కొట్టాడు. బంతి స్టాండ్స్‌లో పడింది. కోల్‌కతా సంబరాల్లో, దిల్లీ విషాదంలో మునిగిపోయాయి.

దిల్లీ.. అతి కష్టంపై: షార్జా పిచ్‌పై గత మ్యాచ్‌ల ఫలితాల్ని దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకుంది. ఇదే వేదికలో జరిగిన ఎలిమినేటర్‌లో బెంగళూరును నియంత్రించినట్లే.. దిల్లీని కూడా కోల్‌కతా బౌలర్లు కట్టి పడేశారు. బెంగళూరు 137 పరుగులు చేస్తే.. దిల్లీ 135 పరుగులకే పరిమితమైంది. ఒక దశలో ఆ జట్టు ఆట చూస్తే.. స్కోరు 120కి మించదేమో అనిపించింది. పృథ్వీ, ధావన్‌ ధాటిగా ఆడటంతో 4 ఓవర్లకు 32/0తో దిల్లీ ఎంతో మెరుగ్గానే కనిపించింది. కానీ వరుణ్‌ తన ఓవర్లో తొలి బంతికే పృథ్వీని వికెట్ల ముందు దొరకబుచ్చుకుని దిల్లీని తొలి దెబ్బ కొట్టాడు. ఇక అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. ధావన్‌, స్టాయినస్‌ (18) కుదురుగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు కానీ.. రన్‌రేట్‌ను పెంచలేకపోయారు. 11 ఓవర్లకు స్కోరు 70/1. వికెట్లు చేతిలో ఉండటంతో ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడి స్కోరు పెంచుతారనుకుంటే.. ఒకరి తర్వాత ఒకరు వెనుదిరగడంతో రన్‌రేట్‌ మరింత పడిపోయింది. 12వ ఓవర్లో స్టాయినిస్‌ను మావి (1/27) బౌల్డ్‌ చేయగా.. 15వ ఓవర్లో ధావన్‌ను వరుణ్‌ పెవిలియన్‌ చేర్చాడు. అప్పటికి స్కోరు 83 పరుగులే. పంత్‌ (6) ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో దిల్లీ కష్టాలు మరింత పెరిగాయి. బంతి బ్యాట్‌ మీదికి రాకపోవడంతో అయ్యర్‌ కూడా షాట్లు ఆడలేకపోయాడు. 17 ఓవర్లకు కూడా స్కోరు 99 పరుగులే. హెట్‌మైయర్‌ తర్వాతి ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టి స్కోరు బోర్డులో కొంచెం కదలిక తెచ్చాడు. కానీ వెంటనే ఔటైపోయాడు. చివరి ఓవర్లో అయ్యర్‌ ఒక ఫోర్‌, సిక్స్‌ బాదడంతో మొత్తం 15 పరుగులొచ్చాయి. కోల్‌కతా ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది.

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ ఎల్బీ (బి) వరుణ్‌ 18; ధావన్‌ (సి) షకిబ్‌ (బి) వరుణ్‌ 36; స్టాయినిస్‌ (బి) మావి 18; శ్రేయస్‌ నాటౌట్‌ 30; పంత్‌ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్‌ 6; హెట్‌మైయర్‌ రనౌట్‌ 17; అక్షర్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 135; వికెట్ల పతనం: 1-32, 2-71, 3-83, 4-90, 5-117; బౌలింగ్‌: షకిబ్‌ 4-0-28-0; ఫెర్గూసన్‌ 4-0-26-1; నరైన్‌ 4-0-27-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-26-2; మావి 4-0-27-1

కోల్‌కతా ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) పంత్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 46;  వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) స్మిత్‌ (బి) రబాడ 55; నితీష్‌ రాణా (సి) హెట్‌మయర్‌ (బి) నార్జ్‌ 13; రాహుల్‌ త్రిపాఠి నాటౌట్‌ 12; దినేశ్‌ కార్తీక్‌ (బి) రబాడ 0; మోర్గాన్‌ (బి) నార్జ్‌ 0; షకిబ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 0; నరైన్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 0; ఫెర్గూసన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 136; వికెట్ల పతనం: 1-96, 2-123, 3-125, 4-126, 5-129, 6-130,  7-130; బౌలింగ్‌: నార్జ్‌ 4-0-31-2; అశ్విన్‌ 3.5-0-27-2; అవేష్‌ ఖాన్‌ 4-0-22-1; అక్షర్‌ పటేల్‌ 4-0-32-0; రబాడ 4-0-23-2


2

చెన్నై, కోల్‌కతా ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 2012లో చెన్నైని ఓడించి కోల్‌కతా ట్రోఫీ అందుకుంది.


3

కోల్‌కతా ఐపీఎల్‌ తుది పోరుకు అర్హత సాధించడం ఇది మూడోసారి. 2012, 2014లో ఫైనల్‌ చేరిన ఆ జట్టు విజేతగా నిలిచింది.


7

ఈ ఐపీఎల్‌ రెండో దశలో కోల్‌కతాకు ఇది ఏడో గెలుపు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది.


దిల్లీ నిష్క్రమణతో ఐపీఎల్‌లో ఈసారి కొత్త ఛాంపియన్‌కు అవకాశం లేకుండా పోయింది. చివరగా 2016లో ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్‌ ఆవిర్భవించింది. ఆ సీజన్లో సన్‌రైజర్స్‌ టైటిల్‌ నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని