Updated : 17/10/2021 06:45 IST

Rahul Dravid: ద్రవిడ్‌ వచ్చేస్తున్నాడు

టీమ్‌ఇండియా కోచ్‌గా ఖరారైనట్లే

వద్దన్నా.. ఒప్పించిన బీసీసీఐ పెద్దలు

దిల్లీ

అయిదారేళ్లుగా దేశంలో యువ ప్రతిభావంతుల్ని సానబట్టి భారత క్రికెట్‌కు అందిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌.. త్వరలోనే భారత జట్టు కోచ్‌ కాబోతున్నాడు! ఈ పదవి చేపట్టాలని కొన్నేళ్లుగా బీసీసీఐ నుంచి విజ్ఞప్తులు వస్తున్నా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన ఈ దిగ్గజ ఆటగాడు.. ఎట్టకేలకు టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించినట్లు సమాచారం. ద్రవిడ్‌ను ఒప్పించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడు, అందరికీ ఇష్టుడు, ఆమోద యోగ్యుడు, వివాద రహితుడు అయిన రాహుల్‌ ద్రవిడ్‌.. టీమ్‌ఇండియా కోచ్‌ కాబోతున్నాడు. ఈ మేరకు బీసీసీఐ నుంచి మీడియాకు సమాచారం అందింది. నాలుగేళ్లుగా భారత కోచ్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి టీ20 ప్రపంచకప్‌ ముగిశాక, వచ్చే నెలలో పదవి నుంచి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. అతడి స్థానాన్ని ద్రవిడ్‌ భర్తీ చేయడం లాంఛనమే అన్నది బోర్డు వర్గాల మాట. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా.. తాజాగా ద్రవిడ్‌తో సమావేశమై కోచ్‌ పదవికి అతణ్ని ఒప్పించినట్లు సమాచారం. ఇటీవలే ద్రవిడ్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా రెండో పర్యాయం బాధ్యతలు స్వీకరించాడు. టీమ్‌ఇండియా కోచ్‌గా ఉండాలని ముందు నుంచి వస్తున్న విజ్ఞప్తులను తిరస్కరిస్తూ వచ్చిన రాహుల్‌.. రెండోసారి ఎన్‌సీఏ బాధ్యతలను చేపట్టడంతో రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. దీంతో బీసీసీఐ తీసుకొచ్చే కొత్త కోచ్‌ ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. అయితే కొన్ని రోజుల్లో కథ మాత్రం మారిపోయింది. గంగూలీ స్వయంగా రంగంలోకి దిగి ద్రవిడ్‌తో చర్చలు జరపడం, భారత క్రికెట్‌ ప్రయోజనాల దృష్ట్యా కోచ్‌ పదవి చేపట్టాలని గట్టిగా కోరడంతో అతడి మాజీ సహచరుడు సరే అన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్నేళ్లలో సీనియర్లు ఒక్కొక్కరుగా నిష్క్రమించే అవకాశముండటంతో సంధి దశలో టీమ్‌ఇండియా ఇబ్బంది పడకుండా.. యువ ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే ద్రవిడ్‌ను బాధ్యతలప్పగిస్తున్నట్లు భావిస్తున్నారు. రాహుల్‌ శిక్షణలో ఎదిగిన చాలామంది కుర్రాళ్లు ప్రస్తుతం టీమ్‌ఇండియాలో ఉండటం, మరింతమంది జట్టులోకి వచ్చే అవకాశం ఉండటంతో వారితో కలిసి పని చేయడం ద్రవిడ్‌కు ఇబ్బంది కాకపోవచ్చు. ఈ కుర్రాళ్లతో పాటు కోహ్లి, రోహిత్‌ లాంటి సీనియర్లకూ ద్రవిడ్‌తో ఇబ్బంది తలెత్తకపోవచ్చు. పూర్తి స్థాయిలో, రెండేళ్ల పాటు కోచ్‌గా ఉంటాడని, 2023 వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా అతను జట్టును నడిపిస్తాడని సమాచారం. ‘‘అవును.. ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటానికి ఒప్పుకున్నాడు. 2023 ప్రపంచకప్‌ వరకు అతను కొనసాగుతాడు. మొదట రాహుల్‌ విముఖత వ్యక్తం చేసినప్పటికీ గంగూలీ, షా అతడితో సమావేశమై ఈ బాధ్యతలకు ఒప్పించారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 48 ఏళ్ల ద్రవిడ్‌ ఆట నుంచి రిటైరైన కొంత కాలానికే ద్రవిడ్‌ భారత అండర్‌-19, ఇండియా-ఎ జట్ల కోచ్‌గా మారాడు. రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌ లాంటి యువ ప్రతిభావంతులు చాలామంది ద్రవిడ్‌ శిక్షణలోనే ఎదిగారు. ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నపుడే భారత జట్టు 2017లో అండర్‌-19 ప్రపంచకప్‌ కూడా గెలిచింది. రెండేళ్ల నుంచి ద్రవిడ్‌ ఎన్‌సీఏ బాధ్యతలు చూస్తున్నాడు. అక్కడ యువ ఆటగాళ్లను సానబట్టడమే కాక.. టీమ్‌ఇండియా ఆటగాళ్లకూ తోడ్పాటు అందిస్తున్నాడు. ద్రవిడ్‌ నేతృత్వంలోని కోచింగ్‌ బృందంలో బౌలింగ్‌ శిక్షకుడిగా పరాస్‌ మాంబ్రే చేరతాడని తెలుస్తోంది. ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అలాగే కొనసాగే అవకాశముంది. ద్రవిడ్‌ నియామకం ఖాయమే అయినప్పటికీ.. కోచింగ్‌ ప్రక్రియను పద్ధతి ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోధా కమిటీ సూచనల ప్రకారం కోచ్‌ ఎంపిక క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)నే చేపట్టాలి. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా, ఇంటర్వ్యూలకు ఎవరు వచ్చినా.. ద్రవిడ్‌ ఎంపిక లాంఛనమే అన్నది బోర్డు వర్గాల సమాచారం. ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్‌ అయ్యాక అండర్‌-19, ఇండియా-ఎ జట్లకు  కొత్త కోచ్‌లను నియమించే అవకాశముంది.     ఎన్‌సీఏ బాధ్యతలను కూడా మరొకరికి అప్పగించొచ్చు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని