T20 World Cup: పొట్టి కప్పులో చిట్టి మ్యాచ్‌లు

ఐపీఎల్‌ను ఆస్వాదించిన అభిమానులకు అంతకుమించిన వినోదాన్ని అందించడానికి టీ20 ప్రపంచకప్‌ వచ్చేసింది! 16 దేశాలు.. 45 మ్యాచ్‌లు.. నెల రోజుల పాటు.. ఇక పండగే! హోరాహోరీ సమరాల సందడే! అయితే అసలు పోరాటానికి ముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌ షురూ కాబోతోంది.

Updated : 17 Oct 2021 07:02 IST

టీ20 ప్రపంచకప్‌ నేటి నుంచే

క్వాలిఫయింగ్‌ రౌండ్‌తో మొదలు

ఐపీఎల్‌ను ఆస్వాదించిన అభిమానులకు అంతకుమించిన వినోదాన్ని అందించడానికి టీ20 ప్రపంచకప్‌ వచ్చేసింది! 16 దేశాలు.. 45 మ్యాచ్‌లు.. నెల రోజుల పాటు.. ఇక పండగే! హోరాహోరీ సమరాల సందడే! అయితే అసలు పోరాటానికి ముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌ షురూ కాబోతోంది. నేరుగా టోర్నీకి అర్హత సాధించలేకపోయిన చిన్న జట్లు సూపర్‌-12 బెర్తుల కోసం తలపడబోతున్నాయి. టోర్నీని నిర్వహించేది బీసీసీఐనే అయినా.. కరోనా నేపథ్యంలో ఆతిథ్యమిచ్చేది మాత్రం యూఏఈ, ఒమన్‌.

అల్‌ అమెరాట్‌: టీ20 ప్రపంచకప్‌కు వేళైంది. ఇక మెరుపులు మొదలు. అక్టోబర్‌ 23న ఆరంభమయ్యే సూపర్‌-12 దశకు ముందు ఆదివారం క్వాలిఫయింగ్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో పపువా న్యూగినియాతో ఆతిథ్య ఒమన్‌.. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్‌ పోటీపడనున్నాయి. క్వాలిఫయింగ్‌ దశలో గ్రూప్‌-ఏలో శ్రీలంక, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, స్కాట్‌లాండ్‌, పపువా న్యూగినియా, ఒమన్‌ తలపడనున్నాయి.

ఫార్మాట్‌ ఇలా..: ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడుతున్నాయి. అయితే అసలు టోర్నీకి ముందు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. క్వాలిఫయింగ్‌లో ఎనిమిది జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-12 దశకు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే అర్హత సాధించిన టీ20 టాప్‌-8 ర్యాంక్‌ జట్లతో ఈ నాలుగు జట్లు చేరతాయి. సూపర్‌-12 దశలో పన్నెండు జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్‌-1లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, గ్రూప్‌-2లో భారత్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ ఆడనున్నాయి. సూపర్‌-12లో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌లో టాప్‌ రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 24న జరిగే గ్రూప్‌-2 తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో భారత్‌ పోటీని ఆరంభించనుంది.

తొలిసారి డీఆర్‌ఎస్‌: పురుషుల టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి నిర్ణయ సమీక్ష విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఒక ఇన్నింగ్స్‌లో ప్రతి జట్టుకు రెండుసార్లు సమీక్ష చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మహిళల టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే డీఆర్‌ఎస్‌ ఉపయోగించారు. వర్షం పడిన సందర్భాల్లో గ్రూప్‌ దశలో మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉండదు. సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వ్‌ డే ఉంటుంది. గ్రూప్‌ దశలో వర్షం వల్ల ఓవర్లు నష్టపోతే.. కనీసం ఇన్నింగ్స్‌కు 5 ఓవర్లు అయినా ఆడించి ఫలితం తేలుస్తారు. సెమీస్‌, ఫైనల్‌లో అయితే ఇన్నింగ్స్‌కు 10 ఓవర్ల చొప్పున ఆడిస్తారు.
విజేతకు రూ.12 కోట్లు: టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు రూ.12 కోట్లు నగదు బహుమానంగా అందుకోనుంది. రన్నరప్‌కు రూ.6 కోట్లు బహుమతి దక్కుతుంది. సెమీఫైనల్లో ఓడిన ఒక్కో జట్టుకు రూ.3 కోట్లు లభిస్తాయి.


టీ20 ప్రపంచకప్‌లో ఈనాడు

ఒమన్‌ × పపువా న్యూగినియా (మధ్యాహ్నం 3.30 నుంచి)
బంగ్లాదేశ్‌ × స్కాట్‌లాండ్‌ (రా.7.30 నుంచి)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని