Published : 20/10/2021 03:56 IST

సఫారీ సేన.. ఈ సారైనా?

ఒక్క ప్రపంచకప్‌ గెలవని దక్షిణాఫ్రికా
పొట్టి కప్పు నెగ్గాలని లక్ష్యం

ఈనాడు క్రీడావిభాగం

నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్‌లు.. రెండేళ్లకోసారి టీ20 ప్రపంచకప్‌లు వచ్చి వెళ్తుంటాయి. కానీ.. ఒక్కసారైనా తమ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడితే చూడాలనే దక్షిణాఫ్రికా దేశ ప్రజల దశాబ్దాల కల మాత్రం తీరట్లేదు. ఇప్పటివరకూ ప్రపంచకప్‌ బోణీ కొట్టని సఫారీ సేన.. అయిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ పొట్టి ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించి ఆ నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. గతంలో రెండు సార్లు సెమీస్‌ వరకూ వచ్చిన ఆ జట్టు.. ఈసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఒకప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడిన దక్షిణాఫ్రికా జట్టు.. ఒక్కొక్కరుగా ఆ క్రికెటర్లు వీడ్కోలు పలకడంతో మునుపటి ప్రభ కోల్పోయింది. ప్రస్తుత జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నప్పటికీ ఆ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మాత్రం కల్పించలేకపోతున్నారు. పైగా ఈ టీ20 ప్రపంచకప్‌నకు అనుభవజ్ఞులైన డుప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, క్రిస్‌ మోరిస్‌ దూరమవడం ఆ జట్టును దెబ్బతీసేదే. ఐపీఎల్‌లో సీఎస్కే తరపున గొప్పగా రాణించిన డుప్లెసిస్‌ను ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మీద దృష్టి సారించడం కోసమే అతను ఈ ఏడాది ఆరంభంలో టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. అయినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది. ఇక తాహిర్‌ను కూడా సెలక్షన్‌ పరిగణలోకి తీసుకోలేదు. ఆల్‌రౌండర్‌ మోరిస్‌ ఇతర కారణాల వల్ల అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుత జట్టులో కెప్టెన్‌ బవుమా, డికాక్‌, మర్‌క్రమ్‌, మిల్లర్‌, డసన్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్‌తో జోరు అందుకున్న మర్‌క్రమ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక పేస్‌ ద్వయం నార్జ్‌, రబాడ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఎలాంటి ప్రదర్శన చేశారో తెలిసిందే. తమ వేగంతో, కచ్చితత్వంతో వీళ్లు ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరగలరు. ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌గా ఉన్న స్పిన్నర్‌ షంసీతో ప్రత్యర్థులకు ప్రమాదం పొంచి ఉంది. మిడిలార్డర్‌లో నిలకడ లేమి.. బ్యాటర్లు కచ్చితంగా రాణిస్తారనే నమ్మకం లేకపోవడం    ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఇంగ్లాండ్‌,      ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ లాంటి బలమైన జట్లతో పాటు గ్రూప్‌- 1లో ఉన్న సఫారీ జట్టు.. సెమీస్‌ చేరాలంటే శక్తికి మించి శ్రమించాల్సిందే. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం  చూస్తే ఈ టోర్నీలోనూ ఆ జట్టుకు నిరాశే తప్పదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

కీలక ఆటగాళ్లు: బవుమా, డికాక్‌, మర్‌క్రమ్‌, నార్జ్‌, రబాడ, షంసి
ఉత్తమ ప్రదర్శన: సెమీస్‌ (2009, 2014)
దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్‌), కేశవ్‌ మహారాజ్‌, డికాక్‌, ఫోర్టుయిన్‌, హెండ్రిక్స్‌, క్లాసెన్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌, ముల్డర్‌, ఎంగిడి, నార్జ్‌, ప్రిటోరియస్‌, రబాడ, షంసీ, వాండడసెన్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని