Updated : 24 Oct 2021 09:13 IST

IND vs PAK: ఆ రోజు రానే వచ్చింది..!

దాయాదుల పోరుకు రంగం సిద్ధం

టీ20 ప్రపంచకప్‌లో నేడు పాక్‌తో భారత్‌ ఢీ

రాత్రి 7.30 నుంచి

ఆ ఒక్క మ్యాచ్‌ కోసం పదుల కోట్లమంది ఎదురు చూస్తున్నారంటే.. రెండు దేశాలే కాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల దృష్టి ఆ మ్యాచ్‌పై పడిందంటే.. అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి!

ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహంతో ఇళ్లలో బద్దలయ్యే టీవీలు.. ఓటమి బాధతో కొన్నిసార్లు ఊపిరే ఆగిపోయే సందర్భాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయంటే.. అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి!

ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. అదొక ఒక పండుగలా మారి దేశమంతా సంబరాలు చేసుకుంటుందంటే.. ఆ పండుగ వాతావరణాన్ని సృష్టించే ఇది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి!

అలాంటి అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసే ఆ రోజు రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో క్రికెట్‌ మైదానంలో భారత జట్టు యుద్ధం ఆదివారమే. అందుకు టీ20 ప్రపంచకప్‌ వేదికైంది. టైటిల్‌ అందుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న భారత్‌.. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి టోర్నీని గొప్పగా ఆరంభించాలని చూస్తోంది.

దుబాయ్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్‌,   పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికే పూనకం వచ్చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో ఐసీసీ టోర్నీల్లోనే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతోంది. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాక.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేననే ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిందే లేదు. తలపడ్డ 12సార్లూ టీమ్‌ఇండియాదే విజయం. ఈ ఘనమైన రికార్డుకు తోడు బలమైన జట్టుతో బరిలో దిగుతున్న భారత్‌.. పాక్‌పై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది.5 - 0

టీ20 ప్రపంచకప్‌ల్లో గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన అయిదు మ్యాచ్‌ల్లో భారత్‌దే విజయం. ఈసారి కూడా భారత్‌ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా చూస్తే జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్యకుమార్‌, కిషాన్‌ల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక బౌలింగ్‌ వేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యను కేవలం స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఆడిస్తారా? లేక రెండు విధాలా ఉపయోగపడే శార్దూల్‌ జట్టులోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరం. ఇక జడేజాతో కలిసి అశ్విన్‌ స్పిన్‌ భారాన్ని పంచుకోవచ్చు. అశ్విన్‌ వద్దనుకుంటే వరుణ్‌, రాహుల్‌ చాహర్‌ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ కీలకం కానున్నారు. టీ20ల్లో పాక్‌పై కోహ్లీకి మంచి రికార్డుంది. ఆరు మ్యాచ్‌ల్లో 84.66 సగటుతో 254 పరుగులు చేశాడు. ఇక పేస్‌ పదునుతో పాక్‌ బ్యాటర్లను కట్టడి చేసేందుకు బుమ్రా, షమి, భువి త్రయం సిద్ధమైంది.


పిచ్‌ ఎలా

దుబాయ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పరిస్థితుల ప్రకారం టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపాలి. కానీ ఛేదనలో తడబడే పాక్‌.. ఆ సాహసం చేయకపోవచ్చు. భారత్‌ కూడా టాస్‌ గెలిస్తే బ్యాటింగే చేయొచ్చు. ఇక్కడ టీ20 తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 144.

తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లి, సూర్య, పంత్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌, అశ్విన్‌/వరుణ్‌, భువనేశ్వర్‌/షమి, బుమ్రా.

పాకిస్థాన్‌: బాబర్‌, రిజ్వాన్‌, ఫకార్‌, హఫీజ్‌/హైదర్‌ అలీ, మాలిక్‌, అసిఫ్‌, ఇమాద్‌ వసీమ్‌, షాదాబ్‌, హసన్‌ అలీ, హారిస్‌, షహీన్‌.


టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్‌ × పాక్‌

1. 2007 ప్రపంచకప్‌ గ్రూప్‌- డి మ్యాచ్‌లో భారత్‌, పాక్‌ తొలిసారి తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 141/9 స్కోరు చేయగా.. పాక్‌ కూడా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి అన్నే పరుగులు చేయడంతో టై అయింది. దీంతో బౌలౌట్‌ నిర్వహించగా.. టీమ్‌ఇండియా గెలిచింది.

2. 2007 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ అయిదు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 157/5 స్కోరు చేసింది. గంభీర్‌ (75) గొప్పగా పోరాడాడు. ఛేదనలో విజయానికి చేరువగా వచ్చిన పాక్‌ 152 పరుగులకు ఆలౌటైంది. జోగిందర్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ మూడో బంతికి మిస్బా క్యాచ్‌ను శ్రీశాంత్‌ పట్టుకున్న దృశ్యం ఇప్పటికీ తాజాగానే ఉంది.

3. 2012లో సూపర్‌ 8 దశ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను మన బౌలర్లు 128కే ఆలౌట్‌ చేశారు. ఛేదనలో కోహ్లి 78 పరుగులతో అజేయంగా నిలవడంతో 17 ఓవర్లలో జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.  

4. 2014లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 130/7కే పరిమితం కాగా.. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారత్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

5. 2016లో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. నిర్ణీత ఓవర్లలో పాక్‌ 118/5 స్కోరు చేసింది. ఛేదనలో కోహ్లి (55 నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్