BCCI: బీసీసీఐకి జాక్‌పాట్‌.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో భారీ ఆదాయం

ఐపీఎల్‌లో చేరనున్న రెండు కొత్త జట్లు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించనున్నాయి. రెండు ఫ్రాంఛైజీల కోసం దిగ్గజ పారిశ్రామికవేత్తలు బరిలో నిలవడంతో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని బీసీసీఐ నమ్మకంతో ఉంది.

Updated : 25 Oct 2021 09:04 IST

దుబాయ్‌: ఐపీఎల్‌లో చేరనున్న రెండు కొత్త జట్లు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించనున్నాయి. రెండు ఫ్రాంఛైజీల కోసం దిగ్గజ పారిశ్రామికవేత్తలు బరిలో నిలవడంతో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని బీసీసీఐ నమ్మకంతో ఉంది. ఒక్కో జట్టు రూ.7,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు అమ్ముడవుతుందని బోర్డు భావిస్తోంది. సోమవారం బిడ్‌ల సాంకేతిక మూల్యాంకన ప్రక్రియ మొదలుకానుంది. మూల్యాంకనం తర్వాత సోమవారమే జట్లను ప్రకటిస్తారా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ ఒక్కో ఫ్రాంఛైజీకి కనీస ధర రూ.2,000 కోట్లుగా నిర్ణయించింది. రూ.10 లక్షల విలువ చేసే టెండర్‌ పత్రాల్ని 22 సంస్థలు కొనుగోలు చేశాయి. వీరిలో అదాని గ్రూపు, ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా, కోటక్‌ టొరెంట్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, లాన్సర్‌ క్యాపిటల్‌ (మాంచెస్టర్‌ యునైటెడ్‌ యజమాని), నవీన్‌ జిందాల్‌ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. బాలీవుడ్‌ జంట దీపిక పదుకొనె, రణ్‌వీర్‌సింగ్‌లు కొత్త జట్టులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కొత్త ఫ్రాంఛైజీలో చిన్న భాగస్వామిగా లేదా బ్రాండ్‌ అంబాసిడర్లుగా దీపిక- రణ్‌వీర్‌ వ్యవహరిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఒక వ్యక్తి లేదా గరిష్టంగా మూడు కంపెనీలు కలిసి కన్సార్టియంగా ఏర్పడి జట్టును కొనుక్కునేందుకు బీసీసీఐ అనుమతిచ్చింది. నిబంధనల ప్రకారం ఒక్కరు బిడ్‌ చేస్తే సదరు వ్యక్తి వార్షిక టర్నోవర్‌ రూ.3,000 కోట్లు ఉండాలి. మూడు సంస్థలు కలిసి బిడ్‌ చేస్తే ఒక్కో కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.2,500 కోట్లు తప్పనిసరి. అదాని గ్రూపు అధినేత గౌతమ్‌ అదాని, గోయెంకా గ్రూపు యజమాని సంజీవ్‌ గోయెంకాలు కొత్త జట్లు సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఒక్కో ఫ్రాంఛైజీకి కనీసం రూ.3,000 కోట్లు బిడ్‌ కోట్‌ చేస్తారని బీసీసీఐ అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని