Updated : 28 Oct 2021 07:31 IST

T20 World Cup: ఎదురులేని ఇంగ్లాండ్‌

బంగ్లాదేశ్‌ చిత్తు

చెలరేగిన జేసన్‌ రాయ్‌

ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. బౌలర్ల జోరుతో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లాండ్‌... జేసన్‌ రాయ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. ఇంగ్లాండ్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి నాకౌట్‌ అవకాశాలను బంగ్లా సంక్లిష్టం చేసుకుంది.

అబుదాబి

ఇంగ్లాండ్‌ చెలరేగిపోయింది. బుధవారం అత్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాను ఇంగ్లాండ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. మొయిన్‌  అలీ (2/18), లివింగ్‌స్టోన్‌ (2/15), మిల్స్‌ (3/27) విజృంభించడంతో బంగ్లా 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. ముష్ఫికర్‌ రహీమ్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (61; 38 బంతుల్లో 5×4, 3×6) విరుచుకుపడడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 14.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డేవిడ్‌ మలన్‌ (28 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4) రాణించాడు. రాయ్‌కి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

అలవోకగా..: బౌలర్ల విజృంభణతో స్పల్ప లక్ష్యం ఇంగ్లాండ్‌ ముందు నిలిస్తే.. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ విధ్వంసంతో అది మరింత తేలికైపోయింది. బంగ్లా బౌలర్లు అతణ్ని ఏమాత్రం నిలువరించలేకపోయారు. దూకుడుగా ఆడిన జేసన్‌.. ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత ఎడాపెడా బౌండరీలు సిక్స్‌లు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 33 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన రాయ్‌.. బట్లర్‌తో తొలి వికెట్‌కు 39, మలన్‌తో రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి 13వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికే ఇంగ్లాండ్‌ విజయం ఖాయమైపోయింది.  బెయిర్‌స్టో (8 నాటౌట్‌)తో కలిసి మలన్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు

మొయిన్‌ మొదలెట్టాడు: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను ఆరంభంలోనే మొయిన్‌ అలీ దెబ్బతీశాడు. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (9), నయీమ్‌ (5)లు ఇద్దరినీ మూడో ఓవర్లో వెనక్కి పంపాడు. పవర్‌ప్లే ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 27/3తో నిలిచింది. ఇంగ్లాండ్‌.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాపై ఒత్తిడిని కొనసాగించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించడంతో క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న బంగ్లా.. ఏ దశలోనూ బ్యాట్‌ ఝుళిపించలేకపోయింది. పరుగుల కోసం కష్టపడింది. ముష్ఫికర్‌, మహ్మదుల్లా (19) నాలుగో  వికెట్‌కు 37 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్‌ చివరి పది ఓవర్లలో 64 పరుగులే చేసి ఆరు వికెట్లు చేజార్చుకుంది.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌  (సి) లివింగ్‌స్టోన్‌ (బి) అలీ 9; నయీమ్‌ (సి) వోక్స్‌ (బి) అలీ 5; షకిబ్‌ (సి) రషీద్‌ (బి) వోక్స్‌ 4; ముష్ఫికర్‌ ఎల్బీ (బి) లివింగ్‌స్టోన్‌ 29; మహ్మదుల్లా (సి) వోక్స్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 19; అఫిఫ్‌  రనౌట్‌ 5; నురుల్‌  (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 16; మెహదీ హసన్‌ (సి) వోక్స్‌ (బి) మిల్స్‌ 11; నసుమ్‌ నాటౌట్‌ 19; ముస్తాఫిజుర్‌ (బి) మిల్స్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 124; వికెట్ల పతనం: 1-14, 2-14, 3-26, 4-63,   5-73, 6-83, 7-98, 8-124, 9-124; బౌలింగ్‌: అలీ 3-0-18-2; వోక్స్‌ 4-0-12-1; అదిల్‌ రషీద్‌ 4-0-35-0; జోర్డాన్‌ 2-0-15-0; మిల్స్‌ 4-0-27-3; లివింగ్‌స్టోన్‌ 3-0-15-2

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) నసుమ్‌ (బి) షొరిఫుల్‌ 61; బట్లర్‌ (సి) నయీమ్‌ (బి) నసుమ్‌ 18; డేవిడ్‌ మలన్‌ నాటౌట్‌ 28; బెయిర్‌స్టో నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (14.1 ఓవర్లలో 2 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-39, 2-112; బౌలింగ్‌: షకిబ్‌ 3-0-24-0; ముస్తాఫిజుర్‌ 3-0-23-0; షొరిఫుల్‌ 3.1-0-26-1; నసుమ్‌ 3-0-26-1; మెహదీ హసన్‌ 2-0-21-0

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని