Quinton De Kock - blm: మోకాలిపై కూర్చుంటా.. మళ్లీ ఆడతా

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డికాక్‌ వివాదానికి తెరదించాడు. క్షమాపణలు చెప్పిన అతను.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ (బీఎల్‌ఎమ్‌)’ ఉద్యమానికి మద్దతుగా మోకాలిపై కూర్చుంటానన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆడే మిగతా

Updated : 29 Oct 2021 09:11 IST

డికాక్‌ క్షమాపణలు

షార్జా

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డికాక్‌ వివాదానికి తెరదించాడు. క్షమాపణలు చెప్పిన అతను.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ (బీఎల్‌ఎమ్‌)’ ఉద్యమానికి మద్దతుగా మోకాలిపై కూర్చుంటానన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆడే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మోకాళ్లపై కూర్చుని బీఎల్‌ఎమ్‌ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ఆ రోజు ఉదయమే తమ ఆటగాళ్లను దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) ఆదేశించింది. కానీ సీఎస్‌ఏ తీరు నచ్చని డికాక్‌ ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మ్యాచ్‌లోనూ అతను బీఎల్‌ఎమ్‌ ఉద్యమానికి మద్దతు తెలపకుండా నిలబడ్డాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన క్రికెట్‌ భవితవ్యం కూడా సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో దేశ క్రికెట్‌ బోర్డుతో తాజాగా మాట్లాడిన డికాక్‌.. ‘‘నా కారణంగా కలిగిన బాధకు, కోపానికి, గందరగోళ పరిస్థితులకు మనస్ఫూర్తికి క్షమాపణ కోరుతున్నా. ఇప్పటివరకూ నిశ్శబ్దంగా ఉన్నా. కానీ ఇప్పుడు నా వివరణ ఇచ్చుకోవాలని అనుకుంటున్నా. ప్రపంచకప్‌లకు మేం వెళ్లిన ప్రతిసారి ఏదో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుంటున్నట్లే అనిపిస్తోంది. అది సరి కాదు. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన తోటి జట్టు సభ్యులకు, ముఖ్యంగా కెప్టెన్‌ బవుమాకు ధన్యవాదాలు. అతనితో పాటు జట్టు, దక్షిణాఫ్రికా కోరుకుంటే నేను దేశం తరపున మళ్లీ ఆడేందుకు ఎంతో ఇష్టంతో ఉన్నా. నేను మోకాలిపై కూర్చోవడం వల్ల ఇతరులకు అవగాహన కలుగుతుంది, వాళ్ల జీవితాలు మెరుగవుతాయంటే అలా చేయడం నాకెంతో సంతోషమే. విండీస్‌తో కీలకమైన మ్యాచ్‌కు ముందు బోర్డు నుంచి అలాంటి ఆదేశాలు అందడంతో షాక్‌కు గురయ్యా. నా హక్కులను హరిస్తున్నట్లుగా భావించా. ఆటగాళ్లతో బోర్దు ముందే చర్చించి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. తెలియని వాళ్లకు చెప్తున్నా.. నేను కూడా రెండు వర్ణాలు కలిసిన కుటుంబం నుంచే వచ్చా. నా సవతి తల్లి నల్లజాతీయురాలు. ఇప్పుడేదో అంతర్జాతీయ ఉద్యమం వల్ల మాత్రమే కాదు.. నాకైతే పుట్టినప్పటి నుంచే నల్లజాతీయుల జీవితాలు ముఖ్యమైనవి. ప్రతి రోజు అందరితో ప్రేమగానే ఉంటున్నా. అలాంటప్పుడు కేవలం ఒక సంజ్ఞతో దాన్ని నిరూపించుకోవడమేంటో నాకర్థం కావడం లేదు. నాతో పెరిగిన వాళ్లకు, కలిసి ఆడినవాళ్లకు నేనేంటో తెలుసు. నన్ను తప్పుగా అర్థం చేసుకుని జాత్యహంకారి అని పిలవడం చాలా బాధ కలిగించింది. నేను జాత్యహంకారిని కాదు’’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని