IPL 2022: జట్టుకు నలుగురు!

వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో జట్ల రూపురేఖలు మారిపోనున్నాయి. 2022 నుంచి రెండు కొత్త జట్లతో కలిపి మొత్తం 10 ఫ్రాంఛైజీలు ట్రోఫీ కోసం పోటీపడతాయి. ఈ నేపథ్యంలో ఆ సీజన్‌కు ముందు నిర్వహించే మెగా వేలంపై ఇప్పటినుంచే

Updated : 29 Oct 2021 07:10 IST

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అట్టిపెట్టుకునే అవకాశం

కొత్త జట్లకూ ఆటగాళ్లను ఎంచుకునే ఛాన్స్‌

దిల్లీ

వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లో జట్ల రూపురేఖలు మారిపోనున్నాయి. 2022 నుంచి రెండు కొత్త జట్లతో కలిపి మొత్తం 10 ఫ్రాంఛైజీలు ట్రోఫీ కోసం పోటీపడతాయి. ఈ నేపథ్యంలో ఆ సీజన్‌కు ముందు నిర్వహించే మెగా వేలంపై ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది. ఏ జట్లు ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటాయి? కొత్త జట్లు ఏ క్రికెటర్ల కోసం ప్రయత్నిస్తాయి? లాంటి చర్చలు జోరందుకున్నాయి. ఇటీవల ఆర్పీఎస్‌జీ, సీవీసీ క్యాపిటల్స్‌ భారీ ధర వెచ్చించి వరుసగా లఖ్‌నవూ, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వేలానికి కంటే ముందు ప్రతి జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఓ విదేశీయుడు లేదా ఇద్దరేసి చొప్పున భారత, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. కానీ ఈ సారి ఫ్రాంఛైజీలకు రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్టీఎమ్‌) అవకాశం లేదని సమాచారం. తమ జట్టు వదులుకున్న ఆటగాడి కోసం వేలంలో మరో జట్టు అనుకున్న ధరను పాత ఫ్రాంఛైజీనే చెల్లించి ఆ క్రికెటర్‌ను తిరిగి తీసుకోవడమే ఆర్టీఎమ్‌. ఇక రెండు కొత్త జట్లు.. వేలానికి ముందే ముగ్గురేసి ఆటగాళ్ల చొప్పున తీసుకోవచ్చు. అయితే వాళ్లను జట్లు వదిలేసుకున్న ఆటగాళ్ల జాబితా నుంచి ఎంచుకోవాలా? లేదా వేలంలో పాల్గొనే క్రికెటర్ల మొత్తం గ్రూపు నుంచి తీసుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ జట్లు వదిలేసుకున్న ఆటగాళ్లలో నుంచే కొత్త ఫ్రాంఛైజీలు ఎంచుకోవాలని అంటే.. అప్పుడు డ్రాఫ్ట్‌ విధానాన్ని అమలు చేసే ఆస్కారముంది. 2016 సీజన్‌కు ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో నిషేధం పడ్డ సీఎస్కే, రాజస్థాన్‌ రాయల్స్‌ స్థానంలో లీగ్‌లోకి వచ్చిన రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్లు ఆటగాళ్లను డ్రాఫ్ట్‌ విధానంలో తీసుకున్నాయి. అప్పుడు రైజింగ్‌ పుణేకు తొలి అవకాశం రాగా.. ధోనీని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి వేలంలో ప్రతి జట్టుకు రూ.90 కోట్ల చొప్పున ఖర్చుపెట్టే సౌలభ్యం ఉంది. అయితే జట్టు అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు తమ దగ్గర ఉన్న రూ.90 కోట్లలో గరిష్ఠంగా ఎంత శాతం చెల్లించాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 2018లో జరిగిన వేలంలో ఒక్కో జట్టుకు రూ.80 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఇవ్వగా.. అందులో గరిష్ఠంగా రూ.33 కోట్లను అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు చెల్లించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు జట్టును అట్టిపెట్టుకుని ఉండాలా? వదిలేయాలా? అన్నదానిపై ఆటగాడితే తుది నిర్ణయం. అట్టిపెట్టుకున్న ఆటగాళ్లను ప్రకటించే గడువుపై ఐపీఎల్‌ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ నవంబర్‌ చివరి లోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని తెలుస్తోంది.

ఆ డబ్బుతో మహిళల ఐపీఎల్‌..: రెండు కొత్త జట్ల బిడ్ల ద్వారా వచ్చిన రూ.12,715 కోట్లలో నుంచి కొంత డబ్బును పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్‌ కోసం బీసీసీఐ ఉపయోగిస్తుందని ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఎలీసా హీలీ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని