Updated : 30 Oct 2021 07:06 IST

T20 World Cup: దంచేశాడు మళ్లీ..

అసిఫ్‌ సిక్సర్ల మోత

పోరాడి ఓడిన అఫ్గాన్‌

ఉత్కంఠ పోరులో పాక్‌ విజయం

ఔరా అఫ్గానిస్థాన్‌ అని అందరూ ఆ జట్టు విజయాన్ని కొనియాడాల్సింది. కానీ చివరికి అయ్యో అఫ్గానిస్థాన్‌ అనుకోవాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా గొప్పగా పుంజుకుని విజయావకాశాలు సృష్టించుకున్న ఆ జట్టుకు ఆఖర్లో నిరాశ తప్పలేదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మెరుపు షాట్లతో పాకిస్థాన్‌ను గెలిపించిన విధ్వంసక ఆటగాడు అసిఫ్‌ అలీ.. ఈ మ్యాచ్‌లో మరింతగా చెలరేగి జట్టుకు మరో విజయాన్నందించాడు. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లతో అతను అఫ్గాన్‌ కథ ముగించాడు. హ్యాట్రిక్‌ విజయంతో పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు మరింత చేరువైంది.

దుబాయ్‌

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ దూసుకెళ్తోంది. ఇప్పటికే భారత్‌,  న్యూజిలాండ్‌లను ఓడించిన ఆ జట్టు.. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై నెగ్గింది. అయితే పేరుకు చిన్న జట్టయినా పెద్ద జట్లకు చెమటలు పట్టించే  అఫ్గానిస్థాన్‌.. పాక్‌కు కూడా అంత తేలిగ్గా లొంగలేదు. ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించినప్పటికీ.. 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన  ఆ జట్టు.. ఛేదనలో పాక్‌ను బాగానే ఒత్తిడికి గురి చేసింది. అయితే కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (51; 47 బంతుల్లో 4×4) పట్టుదలకు అసిఫ్‌ అలీ (25 నాటౌట్‌; 7 బంతుల్లో 4×6) మెరుపులు తోడవడంతో పాక్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ (2/26), ముజీబ్‌ రెహ్మాన్‌ (1/14) గొప్పగా బౌలింగ్‌ చేశారు. మొదట అఫ్గాన్‌ 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. నబి (35 నాటౌట్‌; 32 బంతుల్లో 5×4), నైబ్‌ (35 నాటౌట్‌; 25 బంతుల్లో 4×4, 1×6) జట్టుకు పోరాడే స్కోరునందించారు. ఇమాద్‌ వసీమ్‌ (2/25), షహీన్‌ అఫ్రిది (1/22), షాదాబ్‌ (1/22) ఆ జట్టును కట్టడి చేశారు

ఇటు అటు..: ఛేదనలో పాక్‌కు అఫ్గాన్‌ బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశమే ఇవ్వలేదు. దూకుడుగా ఆడే రిజ్వాన్‌ (8)ను ముజీబ్‌ ఆరంభంలోనే పెవిలియన్‌ చేర్చడంతో పాక్‌ ఆత్మరక్షణలో పడింది.బాబర్‌ మరీ నెమ్మదిగా ఆడటంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. ఫకార్‌ జమాన్‌ (30; 25 బంతుల్లో 2×4, 1×6) కాస్త స్కోరు బోర్డును కదిలించాడు. 8 ఓవర్లకు 49/1తో ఇబ్బంది పడ్డ పాక్‌.. తర్వాతి రెండు ఓవర్లలో 23 రాబట్టి మెరుగైన స్థితికి చేరుకుంది. అయితే 11వ ఓవర్లో బంతి అందుకున్న రషీద్‌.. పాక్‌ మీద ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాడు. అంతలోనే జమాన్‌ను నబి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. హఫీజ్‌ (10), బాబర్‌లను రషీద్‌ ఔట్‌ చేయడంతో అఫ్గాన్‌ అవకాశాలు మెరుగయ్యాయి. నవీన్‌ ఉల్‌హక్‌ 18వ ఓవర్లో కేవలం 2 పరుగులే ఇచ్చి మాలిక్‌ (19)ను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ పాక్‌ చేజారుతున్నట్లే కనిపించింది. 2 ఓవర్లలో 24 పరుగులతో సమీకరణం కష్టంగా మారింది. కానీ అప్పటికే అఫ్గాన్‌ ఉత్తమ బౌలర్లు రషీద్‌, ముజీబ్‌ల కోటా పూర్తి కావడం ఆ జట్టుకు చేటు చేసింది. నవీన్‌ చివరి ఓవర్‌ కోసం అందుబాటులో ఉన్నా.. మరో ప్రత్యామ్నాయం లేక 19వ ఓవర్‌ కరీమ్‌కు ఇచ్చారు. అతను పేలవంగా బంతులేశాడు. 1, 3, 5, 6 బంతులకు సిక్సర్ల మోత మోగించిన అసిఫ్‌.. నవీన్‌ మళ్లీ బౌలింగ్‌కు రావాల్సిన అవసరం లేకుండా చేశాడు.

పేలవంగా మొదలై..: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌.. ఇన్నింగ్స్‌ ఆరంభించిన తీరు చూస్తే వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. 3 ఓవర్లకు ఓపెనర్లు జజాయ్‌ (0), షెజాద్‌ (8) వికెట్ల కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసిన ఆ జట్టు.. 5.1 ఓవర్లకు 39/4తో నిలిచింది. బంతి అందుకున్న ప్రతి పాకిస్థాన్‌ బౌలరూ వికెట్‌ పడగొడుతుండటంతో అఫ్గాన్‌కు కష్టమే అనిపించింది. అయితే కరీమ్‌ (15)తో కలిసి నజీబుల్లా (22) పోరాడటంతో అఫ్గాన్‌ కాస్త పుంజుకుంది. అయితే వీళ్లిద్దరూ వెనుదిరిగాక 13 ఓవర్లకు 76/6తో నిలిచిన ఆ జట్టు.. 120 దాటితే గొప్ప అన్నట్లే కనిపించింది. కానీ చివరి 7 ఓవర్లలో నబి, నైబ్‌ పాక్‌ బౌలర్లను అనూహ్యంగా ప్రతిఘటించారు. చక్కటి షాట్లు ఆడుతూ ఇంకో వికెట్‌ ఇవ్వకుండా జట్టు స్కోరును 150కి చేరువ చేశారు. చివరి 7 ఓవర్లలో ఆ జట్టు 71 పరుగులు సాధించింది.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: జజాయ్‌ (సి) రవూఫ్‌ (బి) ఇమాద్‌ 0; షెజాద్‌ (సి) బాబర్‌ (బి) షహీన్‌ 8; గుర్బాజ్‌ (సి) బాబర్‌ (బి) హసన్‌ 10; అస్ఘర్‌ (సి) అండ్‌ (బి) రవూఫ్‌ 10; కరీమ్‌ (సి) ఫకార్‌ (బి) ఇమాద్‌ 15; నజీబుల్లా (సి) రిజ్వాన్‌ (బి) షాదాబ్‌ 22; నబి నాటౌట్‌ 35; నైబ్‌ నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 147; వికెట్ల పతనం: 1-7, 2-13, 3-33, 4-39, 5-64, 6-76; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 4-0-22-1; ఇమాద్‌ వసీమ్‌ 4-0-25-2; రవూఫ్‌ 4-0-37-1; హసన్‌ అలీ 4-1-38-1; షాదాబ్‌ 4-0-22-1

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) నవీన్‌ (బి) ముజీబ్‌ 8; బాబర్‌ అజామ్‌ (బి) రషీద్‌ 51; జమాన్‌ ఎల్బీ (బి) నబి 30; హఫీజ్‌ (సి) నైబ్‌ (బి) రషీద్‌ 10; మాలిక్‌ (సి) షాజాద్‌ (బి) నవీన్‌ 19; అసిఫ్‌ అలీ నాటౌట్‌ 25; షాదాబ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 148 వికెట్ల పతనం: 1-12, 2-75, 3-97, 4-122, 5-124 బౌలింగ్‌: ముజీబ్‌ రెహ్మాన్‌ 4-0-14-1; నబి 4-0-36-1; నవీన్‌ 3-0-22-1; కరీమ్‌ 4-0-48-0; రషీద్‌ఖాన్‌ 4-0-26-2

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని