T20 World Cup: బట్లర్‌ సూపర్‌.. ప్రపంచకప్‌లో తొలి సెంచరీ

టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్లే! టీ20 ప్రపంచకప్‌ ట్రెండ్‌ ఇలాగే ఉంది! శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ ఓడింది. లంక బౌలర్లు విజృంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 36/3. పది ఓవర్లకు చేసింది 47 పరుగులే. ఇంతటి ప్రతికూల పరిస్థితులు...

Updated : 02 Nov 2021 06:54 IST

సెమీస్‌లో ఇంగ్లాండ్‌!
శ్రీలంక సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం

షార్జా

టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్లే! టీ20 ప్రపంచకప్‌ ట్రెండ్‌ ఇలాగే ఉంది! శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ ఓడింది. లంక బౌలర్లు విజృంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 36/3. పది ఓవర్లకు చేసింది 47 పరుగులే. ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఇంగ్లాండ్‌ ప్రత్యర్థి ముందు 164 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అందుక్కారణం జోస్‌ బట్లర్‌. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గొప్పగా బ్యాటింగ్‌ చేసిన అతను అద్భుత సెంచరీతో జట్టుకు మంచి స్కోరునందించాడు. మిగతా పని బౌలర్లు పూర్తి చేయడంతో వరుసగా నాలుగో విజయంతో ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఈ ఓటమితో శ్రీలంక కథ ముగిసినట్లే.

ఇంగ్లాండ్‌ది అదే జోరు. అజేయ రికార్డును కొనసాగించిన ఆ జట్టు సోమవారం 26 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. బట్లర్‌ (101 నాటౌట్‌; 67 బంతుల్లో 6×4, 6×6) చెలరేగడంతో మొదట ఇంగ్లాండ్‌ 4 వికెట్లకు 163 పరుగులు సాధించింది. కెప్టెన్‌ మోర్గాన్‌ (40; 36 బంతుల్లో 1×4, 3×6) రాణించాడు. హసరంగ (3/21), తీక్షణ (0/13) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. హసరంగ (34; 21 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. రషీద్‌ (2/19), జోర్డాన్‌ (2/24), మొయిన్‌ అలీ (2/15) లంకను దెబ్బతీశారు. బట్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

లంక ఆశలు రేపినా..: ఛేదనలో శ్రీలంక తడబడింది. 8.3 ఓవర్లలో 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిపోయింది. నిశాంక (1), అసలంక (21), కుశాల్‌ పెరీరా (7), అవిష్క ఫెర్నాండో (13) పెవిలియన్‌ చేరారు. 11వ ఓవర్లో స్కోరు 76 వద్ద రాజపక్స (26) కూడా నిష్క్రమించడంతో లంక ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ హసరంగ, శనక (26) పోరాటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. 16 ఓవర్లలో 123/5తో లంకలో ఆశలు చిగురించాయి. గెలవాలంటే చివరి 4 ఓవర్లలో 41 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ 17వ ఓవర్లో హసరంగను లివింగ్‌స్టోన్‌ ఔట్‌ చేయడంతో లంక ఆశలకు తెరపడ్డట్లయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పట్టుబిగించేసింది. చకచకా వికెట్లు తీస్తూ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం లేకుండా చేసింది.

మెరిసిన బట్లర్‌: ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ ఆటే హైలైట్‌. మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్లు పరుగుల కోసం అపసోపాలు పడుతున్న ఈ టోర్నీలో ఆ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగిందంటే ప్రధాన కారణం బట్లరే. 6 ఓవర్లలో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టు, 10 ఓవర్లలో 47/3తో నిలిచిన జట్టు అంత మెరుగైన స్కోరు సాధించేదే కాదు. టోర్నీలో ఇతర జట్ల లాగే ఇబ్బందుల్లో పడేదే. ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో బట్లర్‌ చెలరేగిపోయాడు. అప్పటిదాకా కట్టడి చేసిన బౌలర్లందరి బంతులనూ చితకబాదాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి సిక్స్‌ కొట్టడం ద్వారా శతకాన్ని అందుకున్నాడు. 45 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు.. మరో 22 బంతుల్లోనే సెంచరీకి చేరుకోవడం విశేషం. మోర్గాన్‌తో నాలుగో వికెట్‌కు బట్లర్‌ 122 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్‌ చివరి 10 ఓవర్లలో 116 పరుగులు రాబట్టింది.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (బి) హసరంగ 9; బట్లర్‌ నాటౌట్‌ 101; మలన్‌ (బి) చమీర 6; బెయిర్‌స్టో ఎల్బీ (బి) హసరంగ 0; మోర్గాన్‌ (బి) హసరంగ 40; మొయిన్‌ అలీ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 163

వికెట్ల పతనం: 1-13, 2-34, 3-35, 4-147

బౌలింగ్‌: చమీర 4-0-43-1; హసరంగ 4-0-21-3; కుమార 4-0-44-0; తీక్షణ 4-0-13-0; చమిక కరుణరత్నె 2-0-17-0; శనక 2-0-24-0

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక రనౌట్‌ 1; కుశాల్‌ పెరీరా (సి) మోర్గాన్‌ (బి) రషీద్‌ 7; అసలంక (సి) అలీ (బి) రషీద్‌ 21; అవిష్క ఫెర్నాండో ఎల్బీ (బి) జోర్డాన్‌ 13; భానుక రాజపక్స (సి) రాయ్‌ (బి) వోక్స్‌ 26; శనక రనౌట్‌ 26; హసరంగ (సి) బిల్లింగ్స్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 34; కరుణరత్నె (సి) రాయ్‌ (బి) అలీ 0; చమీర (సి) మలన్‌ (బి) జోర్డాన్‌ 4; తీక్షణ (సి) జోర్డాన్‌ (బి) అలీ 2; లహిరు కుమార నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (19 ఓవర్లలో ఆలౌట్‌) 137
వికెట్ల పతనం: 1-1, 2-24, 3-34, 4-57, 5-76, 6-129, 7-130, 8-134, 9-134
బౌలింగ్‌: మొయిన్‌ అలీ 3-0-15-2; వోక్స్‌ 2.3-0-25-1; రషీద్‌ 4-0-19-2; జోర్డాన్‌ 4-0-24-2; లివింగ్‌స్టోన్‌ 4-0-34-1; మిల్స్‌ 1.3-0-19-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని