Updated : 06 Nov 2021 10:50 IST

T20 World Cup: కుమ్మేశారు

స్కాట్లాండ్‌ను చిత్తుచేసిన భారత్‌
ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు
రోహిత్‌, రాహుల్‌ విధ్వంసం
విజృంభించిన జడేజా, షమి
దుబాయ్‌

కసితో ఉన్న టీమ్‌ఇండియా.. స్కాట్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించేసింది! రన్‌రేట్‌ భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా ఆడిన భారత్‌ ఇటు బౌలింగ్‌లోనూ అటు బ్యాటింగ్‌లోనూ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. బంతితో కట్టేసి.. బ్యాట్‌తో చితగ్గొట్టేసి స్కాట్లాండ్‌ను కకావికలం చేసేసింది కోహ్లి సేన! ప్రత్యర్థిని కనీసం మూడంకెల స్కోరు చేయకుండా ఆలౌట్‌ చేసేసి స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఏమూలో మిణుకు మిణుకుమంటున్న ఆశలకు రెక్కలు తొడుగుతూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇక భారత ఆశలన్నీ అఫ్గానిస్థాన్‌పైనే...

టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల తర్వాత తిరిగి పుంజుకున్న టీమ్‌ఇండియా వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం స్కాట్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన కోహ్లి మరో సందేహం లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు పసికూన స్కాట్లాండ్‌ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. దీంతో ఆ జట్టు 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జడేజా (3/15), షమి (3/15), బుమ్రా (2/10) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. స్వల్ప ఛేదనలో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కేఎల్‌ రాహుల్‌ (50; 19 బంతుల్లో 6×4, 3×6) ధనాధన్‌ అర్ధశతకంతో సత్తాచాటాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ (30; 16 బంతుల్లో 5×4, 1×6) రాణించాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగింది. కోహ్లీసేన తన చివరి గ్రూపు మ్యాచ్‌లో సోమవారం నమీబియాతో తలపడుతుంది.


1

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా అగ్రస్థానానికి చేరుకున్నాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు  తీసిన బుమ్రా.. 64 వికెట్లతో చాహల్‌ (63)ను అధిగమించాడు. బుమ్రా 54 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. చాహల్‌ అందుకు 49 మ్యాచ్‌లే తీసుకున్నాడు.


అలవోకగా..: ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ రెచ్చిపోయారు. ప్రత్యర్థి బౌలర్లను నిస్సహాయులుగా మార్చేసి.. ఫీల్డర్లకు పనే లేకుండా చేసి బౌండరీలతో చెలరేగారు. కవర్‌డ్రైవ్‌లు, పుల్‌షాట్లతో అలరించారు. బంతి ఎలా వచ్చినా.. బౌండరీకే మార్గం చూపించారు. లెంగ్త్‌లో పడ్డా.. షాట్‌ పిచ్‌ అయినా.. ఫుల్‌ డెలివరీ అయినా.. ఆ బంతులన్నీ ఫోర్లు, సిక్సర్లుగానే మారాయి. రాహుల్‌ను చూసి రోహిత్‌ షాట్ల వేటలో దూసుకెళ్లాడు. పోటాపోటీగా పరుగులు రాబట్టారు. తొలి వికెట్‌కు 30 బంతుల్లోనే 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ ఔటైనప్పటికీ రాహుల్‌ దూకుడు కొనసాగించాడు. దీంతో పవర్‌ప్లేలోనే భారత్‌ విజయాన్ని అందుకుంటుందేమో అనిపించింది. కానీ సిక్సర్‌తో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్న వెంటనే రాహుల్‌ ఔటయ్యాడు. ఏడో ఓవర్లో సూర్యకుమార్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించాడు.


2

18 బంతుల్లో అర్ధశతకం చేరుకున్న కేఎల్‌ రాహుల్‌ టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అగ్రస్థానంలో యువరాజ్‌ (2007లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో) ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో వేగవంతమైన అర్ధసెంచరీ రాహుల్‌దే.


కట్టుదిట్టంగా..: అంతకుముందు స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు గొప్పగా రాణించారు. యార్కర్లు, స్లో డెలివరీలతో బుమ్రా.. పేస్‌తో షమి.. కచ్చితమైన లెంగ్త్‌తో జడేజా ప్రత్యర్థి బ్యాటర్లను ఓ పట్టుపట్టారు. తన రెండో ఓవర్లో కొయెట్టజర్‌ (1)ను ఔట్‌ చేయడంతో బుమ్రా వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. అశ్విన్‌ (1/29) ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మున్సీ (24) ఎదురు దాడికి దిగాడు. కానీ షమి బౌలింగ్‌కు వస్తూనే మున్సీని ఔట్‌ చేయడంతో పాటు ఆ ఓవర్‌ మెయిడిన్‌ వేశాడు. అక్కడి నుంచి జడేజా మాయ మొదలైంది. పిచ్‌ నుంచి లభించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న అతను.. స్కాట్లాండ్‌ మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. తన తొలి ఓవర్లో రెండు వికెట్లు తీసిన జడేజా.. ఆ తర్వాత ప్రమాదకర లియాస్క్‌ (21)ను వెనక్కిపంపాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన లియాస్క్‌.. ఈ పోరులోనూ షమి బౌలింగ్‌లో వరుసగా సిక్సర్‌, ఫోర్‌ బాది దూకుడు ప్రదర్శించాడు. కానీ గుడ్‌ లెంగ్త్‌ బంతితో జడేజా అతనికి చెక్‌ పెట్టాడు. ఆ తర్వాతా భారత బౌలర్లు ఒత్తిడి కొనసాగించారు. 15వ ఓవర్లకు ప్రత్యర్థి 70/6తో నిలిచింది. చివరి ఓవర్లలోనైనా వేగం పెంచుదామని ప్రయత్నించిన బ్యాటర్లకు మన బౌలర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 17వ ఓవర్లో మరోసారి బంతి అందుకున్న షమి ప్రత్యర్థి  పతనాన్ని వేగవంతం చేశాడు. తొలి, మూడో బంతులకు అతను వికెట్లు సాధించాడు. మధ్యలో షరీఫ్‌ (0) రనౌటయ్యాడు. బుమ్రా యార్కర్‌తో స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగించాడు.


‘‘కేవలం ఒకట్రెండు మ్యాచ్‌ల ఆధారంగా జట్టుపై ఓ అంచనాకు రావడం సరికాదు. రెండు మూడేళ్లుగా మేము నిలకడగా రాణిస్తున్నాం. టీ20 క్రికెట్లో ఏ జట్టుకైనా ప్రతికూల ఫలితాలు రావడం సహజం. వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా.. ముందున్న అవకాశాలపై దృష్టిసారించాలి. ఈ పిచ్‌పై బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదించా. తొలి వికెట్‌ ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. స్పిన్‌ అయిన బంతికి బ్యాటర్‌ ఔటైతే చాలా ఆనందంగా ఉంటుంది’’

- రవీంద్ర జడేజా


స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌: మున్సీ (సి) హార్దిక్‌ (బి) షమి 24; కొయెట్జర్‌ (బి) బుమ్రా 1; క్రాస్‌ ఎల్బీ (బి) జడేజా 2; బెరింగ్టన్‌ (బి) జడేజా 0; మెక్‌లియాడ్‌ (బి) షమి 16; లియాస్క్‌ ఎల్బీ (బి) జడేజా 21; గ్రీవ్స్‌ (సి) హార్దిక్‌ (బి) అశ్విన్‌ 1; వాట్‌ (బి) బుమ్రా 14; షరీఫ్‌ రనౌట్‌ 0; ఎవాన్స్‌ (బి) షమి 0; వీల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 4;

మొత్తం: (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 85;

వికెట్ల పతనం: 1-13, 2-27, 3-28, 4-29, 5-58, 6-63, 7-81, 8-81, 9-81;

బౌలింగ్‌: బుమ్రా 3.4-1-10-2; వరుణ్‌ 3-0-15-0; అశ్విన్‌ 4-0-29-1; షమి 3-1-15-3; జడేజా 4-0-15-3

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మోక్‌లియాడ్‌ (బి) వాట్‌ 50; రోహిత్‌ ఎల్బీ (బి) వీల్‌ 30; కోహ్లి నాటౌట్‌ 2; సూర్యకుమార్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 1;

మొత్తం: (6.3 ఓవర్లలో 2 వికెట్లకు) 89;

వికెట్ల పతనం: 1-70, 2-82;
బౌలింగ్‌: వాట్‌ 2-0-20-1; వీల్‌ 2-0-32-1; ఎవాన్స్‌ 1-0-16-0; షరీఫ్‌ 1-0-14-0; గ్రీవ్స్‌ 0.3-0-7-0


3/15

ఈ మ్యాచ్‌లో షమి, జడేజా నమోదు చేసిన బౌలింగ్‌ గణాంకాలివి. ఈ ఇద్దరు బౌలర్లకు టీ20ల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మూడు ఓవర్లు వేసిన షమి 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా.. జడేజా నాలుగు ఓవర్లేసి అవే గణాంకాలు నమోదు చేయడం విశేషం.Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్