Team India: ఇక మారాలి.. కప్పు కొట్టేలా!

ప్చ్‌... అంతా అశించినట్లు అఫ్గానేమీ సంచలనం సృష్టించలేదు. గ్రూప్‌ దశలోనే భారత్‌ ఇంటి ముఖం పట్టక తప్పలేదు. టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా సెమీస్‌ కూడా చేరలేకపోయింది. అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్‌ గెలుపుతో కోట్లాది

Updated : 08 Nov 2021 07:57 IST

ఈనాడు క్రీడావిభాగం

ప్చ్‌... అంతా అశించినట్లు అఫ్గానేమీ సంచలనం సృష్టించలేదు. గ్రూప్‌ దశలోనే భారత్‌ ఇంటి ముఖం పట్టక తప్పలేదు. టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా సెమీస్‌ కూడా చేరలేకపోయింది. అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్‌ గెలుపుతో కోట్లాది అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి. పటిష్ఠమైన కోహ్లీసేన.. ఇలాంటి ప్రదర్శన చేయడం మింగుడుపడనిదే. కానీ మరో ఏడాదిలోపే ఇంకో పొట్టి ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా ఈ పరాభవాన్ని పక్కన పెట్టి.. వచ్చేసారైనా ఎలా విజయవంతం కావాలన్నదానిపై దృష్టి పెట్టాలి.

ప్రపంచ క్రికెట్లో భారత్‌ది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా గత రెండు మూడేళ్ల నుంచి మన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేశారు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరేట్‌గా అడుగుపెట్టింది. అంచనాలెన్నో! కానీ ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో భంగపడి .. ఆ జట్టు చేతిలో ప్రపంచకప్‌ చరిత్రలో తొలి పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కివీస్‌తో పోరులోనూ పేలవ ప్రదర్శనతో సెమీస్‌ అవకాశాలను బాగా దెబ్బతీసుకుంది.. దీంతో మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతో పటిష్ఠంగా కనిపించిన భారత జట్టుకు ఇలాంటి పరిస్థితి రావడం అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించింది. కెప్టెన్‌గా కోహ్లీకి తొలి, చివరి టీ20 ప్రపంచకప్‌ కావడంతో.. ఆటగాళ్లు రాణించి అతనికి కప్పు అందిస్తారని అందరూ ఆశించారు. పైగా జట్టు మార్గదర్శకుడిగా ధోని రావడంతో ఈ సారి జట్టుకు కప్పు పక్కా అనే ఆశలు కలిగాయి. కానీ రెండు మ్యాచ్‌లతోనే అంచనాలు తలకిందులయ్యాయి. 2007లో ఆరంభ టోర్నీలో సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోలేకపోయింది. 2014లో రన్నరప్‌గా నిలిచిన జట్టు.. గత ప్రపంచకప్‌ (2016)లో సెమీస్‌లో ఇంటి దారి పట్టింది. మధ్యలో మూడు ప్రపంచకప్‌ల్లోనూ (2009, 2010, 2012) ‘సూపర్‌’ దశ దాటలేకపోయింది.

టార్గెట్‌ 2022

నాకౌటైనా చేరకుండానే ఈ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించడం బాధాకరమే. కానీ దాని గురించి ఆలోచించడం మానేసి ముందుకు సాగక తప్పదు. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. తర్వాతి టీ20 ప్రపంచకప్‌కు ఎంతో సమయం లేదు. వచ్చే ఏడాదే. 2022 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. ఆ టోర్నీలోనైనా విజయవంతం కావాలంటే.. టీమ్‌ ఇండియా సన్నద్ధత ఇప్పుడు ఆరంభం కావాల్సిందే. ఆ దిశగా జట్టు కూర్పు.. వ్యూహాలు.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ సారి జట్టు కూర్పు భారత్‌ను దెబ్బతీసింది. పాక్‌తో మ్యాచ్‌లో ఆరో బౌలర్‌ లేని లోటు కనిపించగా.. కివీస్‌తో పోరులో ఓపెనర్‌గా రాహుల్‌తో పాటు ఇషాన్‌ను పంపించి చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. జట్టులో ఏ ఆటగాడు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి.. ఎవరు ఏ పాత్ర పోషించాలనే విషయంపై స్పష్టత ఉంటే ప్రదర్శన భిన్నంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి స్పష్టత ఎంత త్వరగా వస్తే జట్టుకు అంత మంచిది. 2019లో వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నుంచి హార్దిక్‌ పాండ్య పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయడం లేదు. భారత్‌ వీలైనంత త్వరగా మరో నికార్సైన పేస్‌ ఆల్‌రౌండర్‌ అన్వేషించాల్సిన అవసరముందని హార్దిక్‌ పరిస్థితి చెబుతోంది. వేగం, కచ్చితత్వంతో బౌలింగ్‌ చేయగలిగే ఫాస్ట్‌బౌలర్లనూ పట్టుకోవాలి. భువనేశ్వర్‌ ఫామ్‌ లేమి.. కీలక మ్యాచ్‌ల్లో షమి రాణించలేకపోవడంతో భారం మొత్తం బుమ్రా మీదే పడుతోంది. ఈ నేపథ్యంలో అతనికి తోడుగా బంతితో మెరిసే పేసర్లు కావాలి. ముఖ్యంగా బౌలింగ్‌లో వైవిధ్యంతో ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసిరే లెఫ్టార్మ్‌ పేసర్‌ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి పేసర్‌ను జట్టులోకి తీసుకు రావడంపై మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టాలి. ఇక స్పిన్నర్ల విషయంలోనూ స్పష్టత అవసరం. ఐపీఎల్‌ సందర్భంగా యూఏఈ పిచ్‌లపై మంచి పేస్‌ రాబట్టాడని చాహల్‌ను కాదని రాహుల్‌ చాహర్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. మిస్టరీ స్పిన్నర్‌గా ఎంపికైన వరుణ్‌ చక్రవర్తి ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఒక్కటంటే ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. ఈ టోర్నీలో లెగ్‌స్పిన్నర్లు ఆధిపత్యం చలాయిస్తుంటే వరుణ్‌ అసలేమాత్రం ప్రభావం చూపలేదు.

వాటిపైనా దృష్టి..

ఇక మైదానం బయట విషయాల్లో జట్టు ప్రయోజనాల కోసం బీసీసీఐ ఆలోచించాలి. ముఖ్యంగా కరోనా కారణంగా బబుల్‌లో ఆడాల్సివస్తోంది. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు కుటుంబాలకు దూరంగా ఉండడంతో ఆటగాళ్లపై ప్రభావం పడుతుంది. జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన మొదలు ఆరు నెలలుగా బబుల్‌లోనే టీమ్‌ఇండియా ఆటగాళ్లున్నారు. ప్రపంచకప్‌లో ఆటగాళ్ల వైఫల్యానికి బబుల్‌ అలసట కూడా ఓ కారణమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ప్రపంచకప్‌నకు ముందు ఆటగాళ్లు ఉత్సాహంగా, తాజాగా ఉండేలా జట్టు షెడ్యూల్‌ను రూపొందించడం ఎంతో ముఖ్యం. ఇక కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, టీ20ల్లో కొత్త కెప్టెన్‌ జట్టుతో ఎంత త్వరగా కలిసిపోతారన్నది కీలకం. ఈ ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌బై చెప్తానని ప్రకటించిన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో భారత జట్టును నడిపించే కొత్త సారథి ఎవరనే ఆసక్తి నెలకొంది. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక అండర్‌-19, భారత్‌- ఎ జట్లకు కోచ్‌గా పని చేసిన ద్రవిడ్‌.. ఈ నెల 17న కివీస్‌తో ఆరంభమయ్యే సిరీస్‌ నుంచి టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఇలాగే అవమానకర రీతిలో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన టీమ్‌ఇండియా.. 2011లో విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా మరోసారి దాన్ని పునరావృతం చేసి భారత జట్టు వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలవాలన్నది అభిమానుల కోరిక. ద్రవిడ్‌, కొత్త కెప్టెన్‌కు మరీ ఎక్కువ సమయమేమీ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని