
T20 World Cup: క్వాలిఫయర్స్‌లో విండీస్, శ్రీలంక
2022 టీ20 ప్రపంచకప్
దుబాయ్: ఈ టీ20 ప్రపంచకప్‌లో పేలవ రీతిలో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన రెండు సార్లు ఛాంపియన్ వెస్టిండీస్.. వచ్చే ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్‌లో ఆడే స్థాయికి పడిపోయింది. 2022లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, శ్రీలంక అర్హత రౌండ్లో ఆడి సూపర్-12కు అర్హత సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ మాత్రం నేరుగా సూపర్ 12 మ్యాచ్‌ల్లో బరిలో దిగుతాయి. ఈ ఏడాది టోర్నీలో ఛాంపియన్, రన్నరప్‌గా నిలిచే రెండు జట్లతో పాటు ర్యాంకింగ్స్‌లో మెరుగ్గా ఉండే మరో ఆరు జట్లు నేరుగా సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే శ్రీలంక, వెస్టిండీస్ వరుసగా 9, 10 స్థానాల్లో ఉన్నాయి. అఫ్గాన్ 7వ, బంగ్లాదేశ్ 8వ ర్యాంకులో కొనసాగుతున్నాయి. ఈ నెల 15 లోపు ఉన్న ర్యాంకింగ్స్ ప్రకారం వచ్చే ప్రపంచకప్ కోసం జట్లను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. దీంతో స్కాట్లాండ్, నమీబియా లాంటి జట్లతో మాజీ ఛాంపియన్లు విండీస్, శ్రీలంక క్వాలిఫయర్స్‌లో ఆడాల్సిందే. ఈ సారి కూడా శ్రీలంక అర్హత రౌండ్లో ఆడి సూపర్-12లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.