Updated : 15/11/2021 07:22 IST

Dravid - Laxman: ఆ జోడీ.. మరోసారి

ఈనాడు క్రీడావిభాగం

వీవీఎస్‌ లక్ష్మణ్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఆస్ట్రేలియాతో 2001 కోల్‌కతా టెస్టు.. ఆ మ్యాచ్‌లో 281 పరుగుల ఇన్నింగ్సే. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో అదొకటి. భారత టెస్టు క్రికెట్‌ గురించి మాట్లాడితే కోల్‌కతా మ్యాచ్‌కు ముందు.. తర్వాత అనేలా ముద్ర వేసిన ఇన్నింగ్స్‌ అది. ఆస్ట్రేలియా విసిరిన 445 పరుగుల సవాల్‌ను ఎదుర్కోలేక తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే టీమ్‌ఇండియా కుప్పకూలింది. 274 పరుగులు వెనుకబడి.. ఫాలోఆన్‌ ఉచ్చులో చిక్కుకున్న టీమ్‌ఇండియా తరఫున అద్వితీయ పోరాట పటిమ కనబరిచాడు లక్ష్మణ్‌. 281 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అద్భుతమైన ద్విశతకంతో ఆసీస్‌పై 171 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని అందించి భారత క్రికెట్‌ దృక్పథాన్నే మార్చేశాడు. అయితే ఇన్నింగ్స్‌ ఆసాంతం లక్ష్మణుడికి అండగా నిలిచిన మరో ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ (180). వీరిద్దరు కలిసి అయిదో వికెట్‌కు 376 పరుగులు జోడించడంతో ఆసీస్‌ ఓటమి దిశగా పయనించింది. అవతలి ఎండ్‌లో ద్రవిడ్‌ లేకపోయుంటే లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌ సాధ్యమయ్యేది కాదేమో! జ్వరంతో ఇబ్బంది పడుతూనే లక్ష్మణ్‌తో కలిసి అడుగులో అడుగేసి.. పరుగుల వరద పారించిన ద్రవిడ్‌ ఘనత తక్కువేమీ కాదు. వారిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా.. క్రీజులో నిలబడకపోయినా విజయం దక్కేదే కాదు! ఇన్నేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్‌ను మార్చిన జోడీ మళ్లీ జట్టుకట్టనుంది. టీమ్‌ఇండియా కోసం వాళ్లిద్దరూ కలిసి పనిచేయనున్నారు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్‌ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లన్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ సౌరభ్‌ గంగూలీనే ‘కెప్టెన్‌’ కావడం విశేషం. అప్పట్లో టీమ్‌ఇండియా సారథిగా.. ఇప్పుడు యావత్‌ భారత క్రికెట్‌ (బీసీసీఐ)కు నాయకుడిగా చక్రం తిప్పుతుంది గంగూలీనే. ఆనాడు లక్ష్మణ్‌- ద్రవిడ్‌లపై నమ్మకం ఉంచిన గంగూలీ.. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా నంబర్‌వన్‌ జోడీపైనే విశ్వాసం ప్రదర్శించాడు. సీనియర్‌ జట్టును ద్రవిడ్‌ చేతిలో పెట్టి.. యువ ఆటగాళ్లను సానబెట్టే బాధ్యతను లక్ష్మణ్‌కు అప్పగించాడు. నిజానికి ఈ బాధ్యతలు స్వీకరించేందుకు మొదట్లో వీరిద్దరు సుముఖంగా లేరన్న ఊహాగానాలు వినిపించాయి. అప్పుడు యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న గంగూలీ ఇప్పుడూ అదే పనిచేశాడు. పట్టుబట్టి మరీ ద్రవిడ్‌, లక్ష్మణ్‌లను ఒప్పించాడు. ఇక భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత లక్ష్మణ్‌- ద్రవిడ్‌ జోడీదే. ఆటగాడిగా, భారత అండర్‌-19 జట్టు కోచ్‌గా, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా విజయవంతమైన ద్రవిడ్‌.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా సక్సెస్‌ అవుతాడనడంలో సందేహం లేదు. బ్యాట్స్‌మన్‌గా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌గా ఆటపై తనదైన ముద్ర వేసిన లక్ష్మణ్‌ కొత్త బాధ్యతల్లో రాణించడమూ ఖాయమే. యువ ఆటగాళ్లను సానబెట్టడం.. టీమ్‌ఇండియాకు ఎగుమతి చేయడంపై ద్రవిడ్‌ ఒక రోడ్‌మ్యాప్‌ను తయారు చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, మహ్మద్‌ సిరాజ్‌, అవేష్‌ఖాన్‌లు ద్రవిడ్‌ కార్ఖానా నుంచి వచ్చినవాళ్లే. ఇప్పుడు వీళ్లంతా టీమ్‌ఇండియా బాధ్యతల్ని భుజాన మోసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడిక కుర్రాళ్లను టీమ్‌ఇండియాకు ఎగుమతి చేసే బాధ్యత లక్ష్మణ్‌ది.

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా.. ఇండియా-ఎ, అండర్‌-19 జట్ల పర్యవేక్షకుడిగా లక్ష్మణ్‌పై పెద్ద బాధ్యతే ఉందిప్పుడు. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌తో ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు.ఆటగాడిగా అత్యంత క్లిష్టమైన సమయాల్లో టీమ్‌ఇండియాకు అండగా నిలిచి, అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన లక్ష్మణ్‌కు కొత్త బాధ్యత కష్టంకాకపోవచ్చు. లక్ష్మణ్‌ విజయవంతం కావాలని.. టీమ్‌ఇండియాకు మరింత మంది ప్రతిభావంతులు అందించాలన్నది ప్రతి ఒక్క అభిమాని ఆకాంక్ష.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని