Updated : 18 Nov 2021 20:18 IST

కష్టపడ్డా..మనదే

కివీస్‌తో తొలి టీ20లో భారత్‌ గెలుపు
చెలరేగిన సూర్య, రోహిత్‌
జైపూర్‌

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఎంతగా తడబడిందో అభిమానులకు ఇంకా గుర్తే. పరుగులు చేయలేక, వికెట్లు పడగొట్టలేక మనవాళ్లు తేలిపోయారు. ఆ ఓటమితో సెమీస్‌ అవకాశాలు గల్లంతై, భారత్‌ సూపర్‌-12లోనే ఇంటిముఖం పట్టక తప్పలేదు. అయితే యూఏఈలో తమకు అనుకూలించని పరిస్థితుల్లో న్యూజిలాండ్‌కు తలవంచిన టీమ్‌ఇండియా.. సొంతగడ్డపై ఆ జట్టును సులువుగానే ఓడించింది. మూడు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లపై భారత బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం చలాయించారు. చివర్లో కాస్త ఉత్కంఠ రేగినా.. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా, సిరీస్‌లో శుభారంభం చేసింది. భారత జట్టుకు పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌, కొత్త కెప్టెన్‌ తమ ప్రస్థానాన్ని విజయంతో ఆరంభించారు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్‌గా నియమితులయ్యాక ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. బుధవారం తొలి టీ20లో భారత్‌ 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (62; 40 బంతుల్లో 6×4, 3×6), రోహిత్‌ (48; 36 బంతుల్లో 5×4, 2×6) మెరుపులు మెరిపించారు. మొదట మార్టిన్‌ గప్తిల్‌ (70; 42 బంతుల్లో 3×4, 4×6), మార్క్‌ చాప్‌మన్‌ (63; 50 బంతుల్లో 6×4, 2×6) సత్తా చాటడంతో కివీస్‌ 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌  (2/23), భువనేశ్వర్‌ (2/24) రాణించారు.

తేలిగ్గా అనుకుంటే..: భారత్‌ ఛేదనను ఆరంభించిన తీరు, 15 ఓవర్ల వరకు ఇన్నింగ్స్‌ సాగిన వైనం చూస్తే మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకు వెళ్తుందనే అనిపించలేదు. కొత్త కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆరంభంలోనే చెలరేగిపోవడంతో ఛేదన ధాటిగా ఆరంభమైంది. 5 ఓవర్లకు 50/0తో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. కివీస్‌ ఉత్తమ బౌలర్‌ బౌల్ట్‌ వేసిన అయిదో ఓవర్లో రాహుల్‌ ఓ సిక్స్‌ కొడితే.. తర్వాత రోహిత్‌ వరుసగా 4, 4, 6 బాదేశాడు. ఈ ఓవర్లో ఏకంగా 21 పరుగులొచ్చాయి. తర్వాతి ఓవర్లో రాహుల్‌ (15)ను శాంట్నర్‌ ఔట్‌ చేసినా.. భారత్‌కు ఇబ్బంది లేకపోయింది. రోహిత్‌కు జత కలిసిన సూర్య వచ్చీ రాగానే షాట్లకు దిగాడు. రోహత్‌ కూడా తగ్గకపోవడంతో 13 ఓవర్లకు భారత్‌ 109/1తో పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఈ దశలో రోహిత్‌ ఔటైనా సూర్య జోరు కొనసాగించాడు. 4 ఓవర్లలో 23 పరుగులతో సమీకరణం తేలిగ్గా మారింది. అయితే కివీస్‌ మ్యాచ్‌పై ఆశలు వదులుకోలేదు. చివరి ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. బౌల్ట్‌ బౌలింగ్‌లో స్కూప్‌ ఆడబోయి సూర్య బౌల్డ్‌ కావడం.. శ్రేయస్‌ అయ్యర్‌ (5) ధాటిగా ఆడలేకపోవడంతో చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈలోపే శ్రేయస్‌ ఔటైపోయాడు. ప్రధాన పేసర్లు ముగ్గురికీ ఓవర్లు అయిపోవడంతో మిచెల్‌ చివరి ఓవర్‌ వేశాడు. తొలి బంతికి వైడ్‌ పడింది. వెంటనే అరంగేట్ర ఆటగాడు వెంకటేశ్‌ మిడ్‌వికెట్లో చక్కటి ఫోర్‌ కొట్టాడు. తర్వాతి బంతికి అతను ఔటైపోవడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. నాలుగో బంతికి రిషబ్‌ పంత్‌ (17 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4) లాంగాఫ్‌లో ఫోర్‌ కొట్టి ప్రేక్షకులతో పూర్తిగా నిండిపోయిన సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియాన్ని సంబరాల్లో ముంచెత్తాడు.

కివీస్‌.. పడి.. లేచి.. పడి: అంతకుముందు టాస్‌ ఓడిన బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలినా, పుంజుకుని భారీ స్కోరే చేసింది. ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న మిచెల్‌ (0)ను భువనేశ్వర్‌ తొలి ఓవర్లోనే బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభాన్నందించాడు. 5 ఓవర్లకు 26/1తో కివీస్‌ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో భారత్‌పై తొలి టీ20 ఆడుతున్న చాప్‌మన్‌ ప్రతిఘటించాడు. అతను షాట్లకు దిగడంతో స్కోరు బోర్డు ముందుకు  కదిలింది. పవర్‌ ప్లే తర్వాత స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో 10 ఓవర్లకు కివీస్‌ 65 పరుగులే చేయగలిగింది. అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతూ వచ్చిన గప్తిల్‌.. ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో బ్యాటుకు పని చెప్పాడు. చాప్‌మన్‌ కూడా జోరు పెంచడంతో 13వ ఓవర్లోనే కివీస్‌ 100 దాటేసింది. ఈ దశలో అశ్విన్‌ ఒకే ఓవర్లో చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ (0)లను ఔట్‌ చేసి కివీస్‌ను గట్టి దెబ్బ తీశాడు. చాప్‌మన్‌ను బౌల్డ్‌ చేసిన అశ్విన్‌.. ఫిలిప్స్‌ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నాడు. ఈ ఓవర్‌ ప్రభావం జట్టుపై మీద పడనివ్వకుండా చూశాడు గప్తిల్‌. అతను మరింత ధాటిగా ఆడటంతో 17.1  ఓవర్లకు 150/3తో కివీస్‌ తిరుగులేని స్థితికి చేరుకుంది. చాహర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన గప్తిల్‌.. తర్వాతి బంతికి మరో షాట్‌ ఆడబోయి శ్రేయస్‌కు చిక్కాడు. ఇక్కడి నుంచి భారత బౌలర్లు పుంజుకున్నారు. చివరి 17 బంతుల్లో ప్రత్యర్థి జట్టు 3 వికెట్లు కోల్పోయి 14 పరుగులే చేయగలిగింది.


‘‘మేం ఊహించినంత సులభంగా విజయం దక్కలేదు. కుర్రాళ్లకు ఈ మ్యాచ్‌ చక్కటి పాఠం. కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి వారు జట్టుకు విజయాన్ని అందించినందుకు  కెప్టెన్‌గా ఆనందంగా ఉంది. ఒక దశలో కివీస్‌ 180కిపైగా స్కోరు చేస్తుందనిపించింది. అయితే బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’’

- రోహిత్‌ శర్మ


న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) శ్రేయస్‌ (బి) దీపక్‌ చాహర్‌ 70; మిచెల్‌ (బి) భువనేశ్వర్‌ 0; చాప్‌మన్‌ (బి) అశ్విన్‌ 63; ఫిలిప్స్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 0; సీఫర్ట్‌ (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 12; రవీంద్ర (బి) సిరాజ్‌ 7; శాంట్నర్‌ నాటౌట్‌ 4; సౌథీ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164;

వికెట్ల పతనం: 1-1, 2-110, 3-110, 4-150, 5-153, 6-162;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-24-2; దీపక్‌ చాహర్‌ 4-0-42-1; సిరాజ్‌ 4-0-39-1; అశ్విన్‌ 4-0-23-2; అక్షర్‌ పటేల్‌ 4-0-31-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) చాప్‌మన్‌ (బి) శాంట్నర్‌ 15; రోహిత్‌ (సి) రవీంద్ర (బి) బౌల్ట్‌ 48; సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 62; పంత్‌ నాటౌట్‌ 17; శ్రేయస్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌథీ 5; వెంకటేశ్‌ (సి) రవీంద్ర (బి) మిచెల్‌ 4; అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14

మొత్తం: (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 166;

వికెట్ల పతనం: 1-50, 2-109, 3-144, 4-155, 5-160;

బౌలింగ్‌: సౌథీ 4-0-40-1; బౌల్ట్‌ 4-0-31-2; ఫెర్గూసన్‌ 4-0-24-0; శాంట్నర్‌ 4-0-19-1; టాడ్‌ ఆస్టల్‌ 3-0-34-0; మిచెల్‌ 0.4-0-11-1

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్