IND vs NZ: టీమ్‌ఇండియా సిరీస్‌ పట్టేయాలని

కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌తో.. సరికొత్తగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్‌లో పరాభవాన్ని మర్చిపోయేలా న్యూజిలాండ్‌పై తొలి టీ20లో విజయంతో తిరిగి

Updated : 19 Nov 2021 06:49 IST

కివీస్‌తో రెండో టీ20 నేడే

రాత్రి 7 గంటల నుంచి

కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌తో.. సరికొత్తగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్‌లో పరాభవాన్ని మర్చిపోయేలా న్యూజిలాండ్‌పై తొలి టీ20లో విజయంతో తిరిగి జోరందుకున్న భారత్‌.. ఇక సిరీస్‌పై కన్నేసింది. శుక్రవారం రెండో మ్యాచ్‌లోనే నెగ్గి.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకోవాలని చూస్తోంది. సారథి రోహిత్‌.. కోచ్‌ ద్రవిడ్‌ ఈ మ్యాచ్‌తోనే తొలి సిరీస్‌ గెలుపును ఖాతాలో వేసుకుంటారా? అన్నది చూడాలి.

రాంచి

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఛేదనలో చివర్లో  తడబడ్డా విజయం భారత్‌కే దక్కింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ప్రదర్శన అంతా బాగానే ఉంది. కానీ జట్టులో పరిష్కారం కావాల్సిన    సమస్యలు ఇంకా ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. కోహ్లి గైర్హాజరీతో గత మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం   చేసుకుంటూ జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే మిడిలార్డర్‌ ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ గత మ్యాచ్‌లో క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. భారీ షాట్ల సంగతి పక్కనపెడితే బంతికో పరుగు తీసేందుకూ ఇబ్బంది పడ్డాడు. పంత్‌ కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. అతను దూకుడు పెంచాలి. ఇక కొత్త ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ సత్తా చాటేందుకు మరిన్ని బంతులు ఆడాల్సి ఉంది. టాప్‌ఆర్డర్‌లాగే మిడిలార్డర్‌ కూడా ఉత్తమంగా ఆడితే జట్టుకు తిరుగుండదు.

అరంగేట్రం చేసేదెవరో?: గత మ్యాచ్‌లో సీనియర్‌ బౌలర్లు భువనేశ్వర్‌, అశ్విన్‌ రాణించడం శుభపరిణామం. కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమవుతున్న భువీ ఎట్టకేలకు స్వింగ్‌తో సత్తాచాటాడు. అశ్విన్‌ కూడా తన ఆఫ్‌స్పిన్‌తో అదరగొడుతున్నాడు. మరోవైపు ఆ మ్యాచ్‌లో దీపక్‌, సిరాజ్‌, అక్షర్‌ భారీగా పరుగులిచ్చినప్పటికీ ఆరో బౌలర్‌గా వెంకటేశ్‌కు రోహిత్‌ బంతినివ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంతమంది మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అతనికి బౌలింగ్‌ చేసే అవకాశం వస్తుందేమో చూడాలి. ఇక బంతిని ఆపే ప్రయత్నంలో చేతికి గాయం చేసుకున్న సిరాజ్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. టీ20 మ్యాచ్‌ల తర్వాత కివీస్‌తోనే జరిగే టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని అతనికి పూర్తిగా కోలుకునేందుకు విశ్రాంతి ఇవ్వనున్నారు. దీంతో అతని స్థానంలో.. హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌లో ఒకరు టీమ్‌ఇండియా తరపున అరంగేట్రం చేయనున్నారు. ఈ ఇద్దరూ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శన చేశారు. కానీ మ్యాచ్‌ జరిగే రాంచీలో పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా పేస్‌లో మార్పులు చేస్తూ బౌలింగ్‌ చేసే హర్షల్‌ను ఆడించాలనే  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గెలుపే లక్ష్యంగా..: రెగ్యులర్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ విశ్రాంతి తీసుకోవడంతో ఈ టీ20 సిరీస్‌లో కివీస్‌కు సారథ్యం వహిస్తున్న సౌథీపై ఇప్పుడు పెద్ద బాధ్యతే పడింది. సిరీస్‌ ఆశలు  సజీవంగా ఉండాలంటే రెండో మ్యాచ్‌లో అతను జట్టును విజయం దిశగా నడిపించాల్సి ఉంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు గప్తిల్‌, మిచెల్‌ శుభారంభాన్ని అందించాల్సి ఉంది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న గప్తిల్‌ తొలి మ్యాచ్‌లోనూ దాన్ని కొనసాగించాడు. ఇక చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన చాప్‌మన్‌ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కానీ చివరి ఓవర్లలో వేగంగా ఆడలేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఆ సమస్యను అధిగమించాలని జట్టు  భావిస్తోంది. మరోవైపు బౌలింగ్‌లోనూ ప్రపంచ స్థాయి పేస్‌ ద్వయం సౌథీ, బౌల్ట్‌ గత మ్యాచ్‌లో తేలిపోయారు. వాళ్లు రాణించి జట్టు బౌలింగ్‌ దళంలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ఉందని జట్టు కోరుకుంటోంది. ఇక బౌలర్లను కూడా పరిస్థితులకు అనుగుణంగా వాడడంతో సౌథీ మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. తొలి టీ20లో చివరి ఓవర్‌ మిచెల్‌తో వేయించాల్సి రావడమే అందుకు కారణం. ఈ మ్యాచ్‌ కోసం కివీస్‌ రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ఆస్టల్‌, రవీంద్ర స్థానాల్లో వరుసగా సోధి, నీషమ్‌ జట్టులోకి రావొచ్చు. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో  భారత్‌పై గెలిచి సిరీస్‌ సమం చేయాలంటే ఆ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిందే.

తుది జట్లు (అంచనా): భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌, సూర్యకుమార్‌, రిషబ్‌, శ్రేయస్‌, వెంకటేశ్‌, అక్షర్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌/అవేశ్‌ ఖాన్‌.; న్యూజిలాండ్‌: గప్తిల్‌, మిచెల్‌, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, సీఫర్ట్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, సోధి, ఫెర్గూసన్‌, బౌల్ట్‌.


పిచ్‌ ఎలా ఉంది..

జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ పిచ్‌ స్పిన్నర్లకూ సహకరిస్తుంది. మ్యాచ్‌పై మంచు ప్రభావం చూపొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపుతుందనడంలో సందేహం లేదు.


2

ఈ మైదానంలో ఇప్పటివరకూ ఆడిన రెండు టీ20ల్లోనూ భారత్‌ గెలిచింది. 2016లో శ్రీలంకపై 69 పరుగుల తేడాతో, 2017లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో విజయాలు సాధించింది.


* ఈ మ్యాచ్‌కు స్టేడియం పూర్తిగా నిండిపోనుంది. వంద శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు జార్ఖండ్‌ రాష్ట్ర క్రికెట్‌ సంఘం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని