Updated : 20 Nov 2021 08:23 IST

IND vs NZ: న్యూజిలాండ్‌పై ఛేదంచేశారు

చెలరేగిన రాహుల్‌, రోహిత్‌
టీ20 సిరీస్‌ భారత్‌ సొంతం
రెండో మ్యాచ్‌లో కివీస్‌ చిత్తు
రాంచి

నువ్వు పుల్‌ షాట్‌ కొడితే.. నేను స్ట్రయిట్‌ సిక్స్‌ వేస్తా! నువ్వు ఆన్‌డ్రైవ్‌ ఆడితే నేను కట్‌ షాట్‌ కొడతా అన్నట్లు.. లక్ష్యాన్ని పంచుకున్నట్లు.. బౌలర్లను ఎంచుకున్నట్లు రాహుల్‌.. రోహిత్‌ చెలరేగిపోతుంటే అభిమానులకు రెండు కళ్లూ సరిపోలేదు! మామూలుగా రెచ్చిపోలేదీ ఓపెనర్లు! వారు అలవోకగా భారీ షాట్లు ఆడేస్తుంటే న్యూజిలాండ్‌ కష్టపడి చేసిన మొత్తం ఓ మూలకే రాలేదు! ఫలితం.. భారత్‌ ఘన విజయం! సిరీస్‌ మన సొంతం!

న్యూజిలాండ్‌ కష్టపడి పోగు చేసింది 153 పరుగులు.. కానీ ఈ స్కోరు భారత్‌కు సరిపోలేదు.. రోహిత్‌, రాహుల్‌ మెరుపు అర్ధసెంచరీలతో అదరగొట్టడంతో న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది. శుక్రవారం కేఎల్‌ రాహుల్‌ (65; 49 బంతుల్లో 6×4, 2×6), కెప్టెన్‌ రోహిత్‌శర్మ (55; 36 బంతుల్లో 1×4, 5×6) మెరుపు షాట్‌లతో చెలరేగిన వేళ టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే హర్షల్‌ పటేల్‌ (2/25) విజృంభించి.. కివీస్‌ 153 (6 వికెట్లకు) పరుగులకే పరిమితం కావడంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 కోల్‌కతాలో ఆదివారం జరుగుతుంది.

ఛేదనలో ధనాధన్‌: మొదట సంయమనం.. ఆ తర్వాత దూకుడు.. ఈ రెండింటి కలబోతతో ఛేదనలో అదరగొట్టే ఆరంభం ఇచ్చారు రోహిత్‌, రాహుల్‌. నెమ్మదిగా గేర్లు మారుస్తూ బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ కివీస్‌కు అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టింది. అయితే వారి తుపానుకు ముందు భారత ఇన్నింగ్స్‌ ప్రశాంతంగా మొదలైంది. 3 ఓవర్లకు భారత్‌ చేసింది 18 పరుగులే! ఈ స్థితిలో పవర్‌ ప్లే ఆఖరికి టీమ్‌ఇండియా 45/0తో నిలిచిందంటే రాహుల్‌ దూకుడే కారణం. చక్కని టైమింగ్‌తో షాట్లు ఆడిన అతడు స్కోరు పెంచాడు. కానీ స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో మళ్లీ స్కోరు వేగం తగ్గింది. భారత్‌ 9 ఓవర్లకు 63/0తో నిలిచింది. సమీకరణం 66 బంతుల్లో 91 పరుగులుగా మారింది. ఈ స్థితిలో పదో ఓవర్లో చెలరేగిన రోహిత్‌ రెండు భారీ సిక్స్‌లతో ఊపు తెచ్చాడు. తొలి మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగించిన అతడు కళ్లుచెదిరే పుల్‌ షాట్లు ఆడాడు. ఆ తర్వాత ఓవర్లో రాహుల్‌ కూడా సిక్స్‌, ఫోర్‌ బాదడంతో టీమ్‌ఇండియా స్కోరు దూసుకెళ్లింది. రన్‌రేట్‌ (54 బంతుల్లో 62) అదుపులోకి వచ్చింది.

వాళ్లిద్దరూ వెనుదిరిగినా..: అయితే రోహిత్‌-రాహులే మ్యాచ్‌ను ముగిస్తారేమో అనిపించిన స్థితిలో రాహుల్‌ను ఔట్‌ చేసి సౌథీ కివీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. దీంతో 117 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధసెంచరీ అయిన తర్వాత రోహిత్‌, ఆపై సూర్యకుమార్‌ (1) కూడా స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. అయితే లక్ష్యం సమీపంగా ఉన్నా సౌథీ (3/16), బౌల్ట్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ (12 నాటౌట్‌)తో కలిసి రిషబ్‌ పంత్‌ (12 నాటౌట్‌) మరో 16 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. 18 బంతుల్లో 11 పరుగులు అవసరమైన స్థితిలో అతడు రెండు భారీ సిక్స్‌లతో ఛేదన పూర్తి చేశాడు.
కివీస్‌కు కళ్లెం: అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఓవర్‌ నుంచే బాదుడు మొదలుపెట్టింది. రెండు ఓవర్లకు ఆ జట్టు స్కోరు 24/0. రాహుల్‌ క్యాచ్‌ వదిలిపెట్టడంతో జీవనదానం పొందిన గప్తిల్‌ (31; 15 బంతుల్లో 3×4, 2×6) చెలరేగి ఆడాడు. మిచెల్‌ (31; 28 బంతుల్లో 3×4) కలిసి అతడు స్ట్రయిట్‌ హిట్టింగ్‌తో పరుగులు రాబట్టడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. మూడో ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను దించాల్సి వచ్చింది. అయినా కూడా కివీస్‌ జోరు తగ్గలేదు. మంచు ప్రభావంతో బంతిపై పట్టుకోసం బౌలర్లు.. బంతిని పట్టుకోవడానికి ఫీల్డర్లు కష్టపడ్డారు. ఈ క్రమంలో ఒకటికి రెండు క్యాచ్‌లు మిస్‌ అయ్యాయి. అయితే దీపక్‌ చాహర్‌ కివీస్‌ను తొలి దెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్‌లో సిక్స్‌ బాది ఆ తర్వాత మరో భారీ షాట్‌కు వెళ్లిన గప్తిల్‌.. పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. పవర్‌ ప్లే అయ్యాక న్యూజిలాండ్‌ జోరు తగ్గింది. అశ్విన్‌ (1/19), అక్షర్‌ పటేల్‌ (1/26)తో పాటు హర్షల్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో 7-12 ఓవర్ల మధ్య రెండు బౌండరీలే వచ్చాయి. అయితే వికెట్లు పడుతున్నా ఫిలిప్స్‌ (34) బ్యాట్‌ ఝుళిపించి కివీస్‌ స్కోరు మరీ తగ్గకుండా చూశాడు. కానీ ప్రమాదకరంగా ఉన్న ఫిలిప్స్‌ను హర్షల్‌ ఔట్‌ చేయడంతో న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత హర్షల్‌ కివీస్‌ బ్యాటర్లను పరీక్షించాడు. అతడికి తోడు స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. పవర్‌ప్లేలో 64/1తో ఉన్న ఆ జట్టు చివరి 84 బంతుల్లో 89 పరుగులే చేయగలిగింది.


సిరాజ్‌ ఔట్‌.. హర్షల్‌ అరంగేట్రం

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. రెండో టీ20కి దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షల్‌ పటేల్‌ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో హర్షల్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా పర్పుల్‌ క్యాప్‌ అందుకున్న సంగతి తెలిసిందే.


కోహ్లి రికార్డు బద్దలు

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గప్తిల్‌ రికార్డు సృష్టించాడు. విరాట్‌ కోహ్లి (3227) రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 3248 పరుగులు ఉన్నాయి. టీ20ల్లో మూడు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్‌, కోహ్లిలతో పాటు రోహిత్‌ (3141) కూడా ఉన్నాడు.


1

వరుసగా అయిదు అర్ధశతక భాగస్వామ్యాలు నమోదు చేసిన భారత జోడీగా రోహిత్‌-రాహుల్‌ రికార్డు సృష్టించారు.


5

అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ల శతక భాగస్వామ్యాలు. బాబర్‌-రిజ్వాన్‌ పేరిట ఉన్న రికార్డు సమమైంది.


10

2016 తర్వాత స్వదేశంలో జరిగిన 13 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్‌కు ఇది పదో విజయం. రెండు సిరీస్‌లను డ్రా చేసుకున్న టీమ్‌ఇండియా ఒక దాంట్లో ఓడింది.


న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (సి) పంత్‌ (బి) దీపక్‌ చాహర్‌ 31; మిచెల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హర్షల్‌ 31; చాప్‌మన్‌ (సి) రాహుల్‌ (బి) అక్షర్‌ 21; ఫిలిప్స్‌ (సి) రుతురాజ్‌ (బి) హర్షల్‌ 34; సీఫెర్ట్‌ (సి) భువనేశ్వర్‌ (బి) అశ్విన్‌ 13; నీషమ్‌ (సి) పంత్‌ (బి) భువనేశ్వర్‌ 3; శాంట్నర్‌ నాటౌట్‌ 8; మిల్నె నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 7

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 153
వికెట్ల పతనం: 1-48, 2-79, 3-90, 4-125, 5-137, 6-140
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-39-1; దీపక్‌ చాహర్‌ 4-0-42-1; అక్షర్‌ పటేల్‌ 4-0-26-1; అశ్విన్‌ 4-0-19-1; హర్షల్‌ పటేల్‌ 4-0-25-2

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సౌథీ 65; రోహిత్‌ (సి) గప్తిల్‌ (బి) సౌథీ 55; వెంకటేశ్‌ అయ్యర్‌ నాటౌట్‌ 12; సూర్యకుమార్‌ (బి) సౌథీ 1; పంత్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 155
వికెట్ల పతనం: 1-117, 2-135, 3-137
బౌలింగ్‌: సౌథీ 4-0-16-3; బౌల్ట్‌ 4-0-36-0; శాంట్నర్‌ 4-0-33-0; మిల్నె 3-0-39-0; సోథీ 2-0-13-0; నీషమ్‌ 0.2-0-12-0

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని