
Rahul Dravid - Rohit Sharma: అన్నీ మంచి శకునములే..
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఘోర వైఫల్యంతో అభిమానుల వేదన అంతా ఇంతా కాదు. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించడం జీర్ణించుకోలేని విషయం. ఇంకో ఏడాది లోపే మళ్లీ టీ20 ప్రపంచకప్ వస్తుండటంతో ఆ టోర్నీ దిశగా అయినా సరైన అడుగులు వేయాలని అభిమానులు ఆశించారు. వారి ఆకాంక్షలకు తగ్గట్లే తొలి సిరీస్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది భారత్. కొత్తగా టీ20 జట్టు పగ్గాలందుకున్న రోహిత్ శర్మ, కోచ్‌గా పగ్గాలందుకున్న రాహుల్ ద్రవిడ్ కలిసి తమ అరంగేట్ర సిరీస్‌లో బలమైన ముద్రే వేశారు. ప్రపంచకప్ రన్నరప్ జట్టుపై మూడుకు మూడు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించడంతో పాటు యువ ఆటగాళ్లు ఎక్కువమందికి అవకాశాలు దక్కడం, వారిలో దాదాపుగా అందరూ సత్తా చాటుకోవడం సానుకూలాంశం. హర్షల్ పటేల్ తొలి సిరీస్‌లోనే అదరగొట్టేశాడు. వెంకటేశ్ అయ్యర్ చివరి టీ20లో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. అతడు బౌలింగ్‌లో కూడా సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో కివీస్ కొంత పోటీ ఇచ్చింది కానీ.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగై చివరి టీ20కి వచ్చేసరికి ప్రత్యర్థిని పోటీలోనే లేకుండా చేసింది రోహిత్ సేన. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే రోహిత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు ఆకట్టుకున్నాయి. కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇక బ్యాటింగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ రాణించి జట్టును ముందుండి నడిపించాడు. అతడికి తోడు తొలి టీ20లో సూర్యకుమార్, రెండో మ్యాచ్‌లో రాహుల్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలింగ్‌లో అశ్విన్, అక్షర్ పటేల్ తిరిగి ఫామ్ చాటారు. భువనేశ్వర్ ఆశించినంతగా రాణించకపోవడం ఒక్కటే కాస్త ఆందోళన కలిగించే విషయం. మొత్తానికి 2022 ప్రపంచకప్ దిశగా భారత్ సన్నాహం ఆశాజనకంగానే మొదలైంది.