Pakistan: పాక్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ పక్కా: ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే

2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లో పక్కాగా జరుగుతుందని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే నమ్మకం వెలిబుచ్చాడు. 1996 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం పాక్‌కు ఇప్పుడు దక్కింది. కానీ భద్రతా కారణాల

Updated : 23 Nov 2021 06:51 IST

దుబాయ్‌: 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌లో పక్కాగా జరుగుతుందని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే నమ్మకం వెలిబుచ్చాడు. 1996 ప్రపంచకప్‌ తర్వాత తొలిసారి ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం పాక్‌కు ఇప్పుడు దక్కింది. కానీ భద్రతా కారణాల రీత్యా అక్కడ టోర్నీ సజావుగా సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలో జరిగే టోర్నీలో టీమ్‌ఇండియా పాల్గొనడంపై ఇటీవల కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బార్క్‌లే మాట్లాడుతూ.. ‘‘మా దృక్కోణం నుంచి చూస్తే కచ్చితంగా పాక్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. కొన్ని వారాల క్రితం జరిగింది పక్కనపెడితే కొన్నేళ్లుగా ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ కొనసాగుతోంది. నిర్వహించే సామర్థ్యం లేదనుకుంటే ఆతిథ్య హక్కులు ఇచ్చేవాళ్లం కాదు. సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి ఓ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు ఆ దేశానికి ఇదో మంచి అవకాశమని భావించాం. మెరుగైన భద్రత ఏర్పాట్లు చేసి ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. పాక్‌, భారత్‌ మధ్య ఉన్న సమస్య సవాలుతో కూడుకున్నది. కానీ క్రికెట్‌ కారణంగా రెండు దేశాల మధ్య సంబంధం మెరుగుపడుతుందనే నమ్మకంతో ఉన్నా’’ అని బార్క్‌లే చెప్పాడు. మరోవైపు అఫ్గానిస్థాన్‌లో  క్రికెట్‌ పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతానికి ఆ జట్టుకు తమ మద్దతు ఉంటుందని అతను తెలిపాడు. ఏ ఆటలోనైనా వివక్ష ఉండకూడదని స్పష్టం చేశాడు. రెండేళ్లకోసారి టీ20 ప్రపంచకప్‌ నిర్వహించడం వల్ల క్రికెట్‌కు  ఆదరణ పెరుగుతుందని ఐసీసీ సీఈవో జెఫ్‌ అలార్డైస్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని