
IND vs NZ: మిడిల్ ఆర్డర్‌లో శుభ్‌మన్?
కాన్పూర్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. మొదటి టెస్టులో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సివుంటుందని అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. కోహ్లీకి విశ్రాంతినిచ్చినందున తొలి టెస్టులో టీమ్ ఇండియాకు రహానె నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ కూడా లేని నేపథ్యంలో మిడిల్ ఆర్డర్‌లో గిల్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి టీమ్ మేనేజ్‌మెంట్‌కు చక్కని అవకాశం లభించనట్లయింది. దీర్ఘకాలంలో అతడు అక్కడ ఉపయోగపడతాడా లేదా అన్నది పరిశీలించనున్నారు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయం. ఓపెనర్‌గా అతడు ఇంగ్లాండ్ పర్యటనలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అతడికి జోడీగా మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న విషయం మాత్రం మిడిల్ ఆర్డర్‌లో గిల్ ఎలా ఆడతాడన్నదే. గిల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే నష్టమేమీ లేదని మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపె అభిప్రాయపడ్డాడు. ‘‘లైనప్ విషయంలో మరీ కచ్చితంగా ఉండడం అంత మంచిది కాదు. నిజానికి గిల్‌ను మిడిలార్డర్లో పంపితే జట్టుకు ప్రయోజనం కలుగుతుందన్నది నా ఉద్దేశం. సరళత జట్టుకు మేలు చేస్తుంది’’ అని అన్నాడు.
గిల్ అక్కడ ఎందుకంటే..: కోహ్లి కాకుండా ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగే మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అవసరమని సెలక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విహారిని ఈ సిరీస్‌కు ఎంపిక చేసుంటే.. పుజారా, రహానె, విహారి రూపంలో ఒక తరహాలో బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ముగ్గురయ్యేవాళ్లు. అదీ చాలదన్నట్లు.. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా కూడా స్వేచ్ఛగా ఆడలేడు. పంత్ విరామంలో ఉన్నాడు. రోహిత్, కోహ్లి, పంత్ గైర్హాజరీలో బ్యాట్ ఝుళిపించడానికి వెనుకాడని బ్యాట్స్‌మన్ భారత్‌కు అవసరమయ్యాడు. ఫలితమే గిల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలన్న ఆలోచన. అతడు భిన్న రకాలు షాట్లు ఆడగలడు. ఓపెనర్‌గా కొత్త బంతిని ఎదుర్కొన్న అనుభవమున్న అతడు.. రెండో కొత్త బంతిని కూడా సమర్థంగా ఎదుర్కోగలడు. మరోవైపు సెలక్టర్లు శ్రేయస్ అయ్యర్‌ను స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ అరంగేట్రం కోసం అతడు ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పకపోవచ్చు. ‘‘ముందో వెనకో పుజారా, రహానె జట్టుకు దూరమవుతారు. విహారి, గిల్, శ్రేయస్‌ల్లో ఇద్దరు ఆ రెండు స్థానాలను చేజిక్కించుకుంటారు. శ్రేయస్‌కు ఈ సిరీస్‌లో అవకాశం రాకపోయినా అతడు మరీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ముందు ముందు అతడికి కచ్చితంగా ఆడే అవకాశం లభిస్తుంది’’ అని పరాంజపె అన్నాడు.