IND vs NZ: టెస్టు సవాలుకు సై

కెప్టెన్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి, శార్దూల్‌.. ఇవి న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో తలపడే భారత జట్టులోని ఆటగాళ్ల పేర్లు కాదు. ఈ మ్యాచ్‌కు దూరమైన క్రికెటర్ల జాబితా

Updated : 25 Nov 2021 09:07 IST

కివీస్‌తో భారత్‌ తొలి పోరు నేడే

కుర్రాళ్లకు పరీక్ష

కీలక ఆటగాళ్లు దూరం

ఉదయం 9.30 నుంచి

కెప్టెన్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి, శార్దూల్‌.. ఇవి న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో తలపడే భారత జట్టులోని ఆటగాళ్ల పేర్లు కాదు. ఈ మ్యాచ్‌కు దూరమైన క్రికెటర్ల జాబితా ఇది. ఇంత మంది కీలక ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ.. జట్టులో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. సొంతగడ్డే బలంగా, కుర్రాళ్లపై నమ్మకంతో ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. రహానె సారథ్యంలో అదరగొట్టేందుకు యువ ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్ల మధ్య తొలి టెస్టుకు గురువారమే ఆరంభం. ఇన్ని రోజులు టీ20 క్రికెట్‌ వినోదంలో మునిగిపోయిన అభిమానులూ.. ఇక సంప్రదాయ టెస్టు మజాను ఆస్వాదించేందుకు సిద్ధమైపోండి!

కాన్పూర్‌

కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో ద్వితీయ శ్రేణి జట్టులా కనిపిస్తున్న టీమ్‌ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌తో సవాలుకు సై అంటోంది. తొలి మ్యాచ్‌లో విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై స్పిన్నే ప్రధాన ఆయుధంగా బరిలో దిగుతోన్న జట్టు.. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓడించిన కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ధ్యేయంతో ఉంది. 2021-22 బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. కీలక ఆటగాళ్లు దూరమైన ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాలనే లక్ష్యంతో భారత ఆటగాళ్లున్నారు. మరోవైపు టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ అయినంత మాత్రాన న్యూజిలాండ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా టెస్టుల్లో ఈ విలియమ్సన్‌ సేన నిలకడగా రాణిస్తోంది.

కళ్లన్నీ అతనిపైనే..: ఈ మ్యాచ్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానేపైనే అందరి కళ్లు ఉంటాయనడంలో సందేహం లేదు. సారథిగా జట్టును విజయం వైపు నడిపించే బాధ్యతతో పాటు అతను బ్యాట్‌తోనూ రాణించాల్సి ఉంది. ఈ సిరీస్‌లో కానీ అతను విఫలమైతే ఇక తిరిగి జట్టులోకి రావడం కష్టమే. ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఈ సీజన్‌లో అతను 11 టెస్టుల్లో కేవలం 19 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌తో ఫామ్‌ అందుకోవడం అతనికి అత్యవసరం. వ్యక్తిగతంగా పాటు జట్టుకూ అది కీలకం. ఎందుకంటే జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్లో అతనితో పాటు పుజారా, మయాంక్‌ మాత్రమే పదికి పైగా టెస్టులాడారు. దీంతో అతను బ్యాట్‌తో మెరిసి జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. ఇక భయాన్ని వదిలేశానని చెప్పిన పుజారా ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. అతను చాలా కాలంగా భారీ ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. ఈ ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు వెన్నెముకలా మారాల్సిన అవసరం ఉంది. ఇక మయాంక్‌, శుభ్‌మన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరోవైపు వికెట్‌ కీపర్‌ సాహా భవిష్యత్‌ను కూడా ఈ సిరీస్‌ నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు. అతను బ్యాట్‌తో మెప్పించకపోతే ఇక మళ్లీ జట్టులో కనిపించే అవకాశం దాదాపుగా రాదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పంత్‌ పాతుకుపోయాడు. ఇక మరో ప్రత్యామ్నాయ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ రేసులో ఉన్నాడు.

ముగ్గురితోనా?: స్పిన్‌ ఆడడంలో కివీస్‌ బలహీనతపైనే దెబ్బకొట్టాలని టీమ్‌ఇండియా చూస్తోంది. అందు కోసం ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. అశ్విన్‌, జడేజాల చోటు ఖాయమవగా.. మూడో స్పిన్నర్‌గా ఎవరిని ఆడిస్తారన్నదానిపైనే స్పష్టత లేదు. అక్షర్‌ పటేల్‌, జయంత్‌ యాదవ్‌ ఆ స్థానం కోసం రేసులో ఉన్నారు. అయితే పని భారం పరిగణలోకి తీసుకోకపోతే ఈ ఏడాది సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్‌కే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఒకవేళ పని భారం ఎక్కువవుతుందన్న ఉద్దేశంతో అతణ్ని తప్పిస్తే జయంత్‌ జట్టులోకి వచ్చే ఆస్కారముంది. సీనియర్‌ స్పిన్‌ ద్వయం.. అశ్విన్‌, జడేజా తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. స్పిన్‌గా చక్కగా అనుకూలించే పిచ్‌పై వాళ్లు ప్రత్యర్థిని ఓ పని పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. విలియమ్సన్‌, అశ్విన్‌ మధ్య పోరు ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఓ పేసర్‌గా ఉమేశ్‌ యాదవ్‌ ఆడనుండగా.. మరో పేసర్‌ స్థానం కోసం ఇషాంత్‌, సిరాజ్‌లు పోటీపడుతున్నారు. ఫామ్‌ ప్రకారం చూస్తే ఇషాంత్‌ కంటే కూడా సిరాజ్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ.

సొమ్ము చేసుకోవాలని..: కీలక ఆటగాళ్లు లేని టీమ్‌ఇండియా అనుభవ లేమిని సొమ్ము చేసుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. కానీ కాన్వే, బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌ దూరమవడం ఆ జట్టుకు దెబ్బే అని చెప్పాలి. అయినప్పటికీ కెప్టెన్‌ విలియమ్సన్‌, లేథమ్‌, రాస్‌ టేలర్‌, నికోల్స్‌, సౌథీ, వాగ్నర్‌లతో ఆ జట్టు బలంగానే ఉంది. ముఖ్యంగా విలియమ్సన్‌, టేలర్‌, నికోల్స్‌లకు భారత పిచ్‌లపై స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాలున్నాయి. పైగా విలియమ్సన్‌ కొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. నాయకత్వ పఠిమతో మెప్పించడమే కాకుండా బ్యాట్‌తోనూ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో అతను కీలకంగా మారాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రూపంలో దేశానికి తొలి ఐసీసీ టైటిల్‌ అందించిన అతను ఇప్పుడు భారత్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు. టేలర్‌కు ఇక్కడ ఆడిన అనుభవం ఎంతో ఉంది. పేసర్లు సౌథీ, వాగ్నర్‌లు పెద్దగా అనుభవం లేని భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఆసియాలో గొప్ప రికార్డు ఉన్న సౌథీతో ప్రమాదమే. కానీ బౌలింగ్‌ కూర్పుపై ఆ జట్టుకు కొన్ని ప్రశ్నలున్నాయి. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరికే పరిమితం కావాలా? ఒకవేళ ఇద్దరినే ఆడిస్తే వాళ్లు ఎవరు? అనే దానిపై ఇంకా జట్టు స్పష్టతకు రాలేదు. మరి స్పిన్నర్లు శాంట్నర్‌, అజాజ్‌ పటేల్‌, విల్‌ సోమర్‌విల్లేలో ఎవరు ఆడతారో చూడాలి. ఇక ఇద్దరు పేసర్లనే ఆడిస్తే ఫామ్‌లో ఉన్న జేమీసన్‌ను పక్కన పెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు భారత్‌లో రికార్డు కూడా ఆ జట్టుకు అనుకూలంగా లేదు. 1989 తర్వాత భారత్‌ ఇక్కడ ఒక్క టెస్టూ గెలవలేదు. మొత్తంగా చూసుకుంటే 34 టెస్టుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది.

పిచ్‌ ఎలా ఉంది?

కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌ పిచ్‌పై స్పిన్నర్ల ఆధిపత్యమే కొనసాగుతుందనడంలో సందేహం లేదు. చివరగా ఈ రెండు జట్ల మధ్య 2016లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌, జడేజా కలిసి 16 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత ఇక్కడ జరిగే తొలి టెస్టు ఇదే. ఇప్పటివరకూ ఇక్కడ కివీస్‌తో ఆడిన మూడు టెస్టుల్లో రెండు నెగ్గిన భారత్‌.. ఓ మ్యాచ్‌ డ్రా చేసుకుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కఠినంగా మారే అవకాశం ఉంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపే ఆస్కారముంది.


2

భారత్‌లో ఇప్పటివరకూ 34 టెస్టులాడిన కివీస్‌ రెండు సార్లు మాత్రమే గెలిచింది.


4

సొంతగడ్డపై టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన అయిదో భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేసేందుకు ఉమేశ్‌కు కావాల్సిన వికెట్లు.


5

అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత ఆఫ్‌స్పిన్నర్‌గా హార్భజన్‌ను అధిగమించేందుకు అశ్విన్‌కు కావాల్సిన వికెట్లు.


జట్లు (అంచనా)

భారత్‌: మయాంక్‌, శుభ్‌మన్‌, పుజార, రహానె, శ్రేయస్‌, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌, సిరాజ్‌/ఇషాంత్‌, ఉమేశ్‌.
న్యూజిలాండ్‌: లేథమ్‌, విల్‌ యంగ్‌, విలియమ్సన్‌, టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, శాంట్నర్‌/జేమీసన్‌, సౌథీ, వాగ్నర్‌, విల్‌, అజాజ్‌ పటేల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని