Shreyas Iyer: అలా మొదలైంది

ఏడేళ్ల క్రితం మాట.. ఆ ఏడాది రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది ముంబయి! టోర్నీలో ఆశలు ఉండాలంటే కాన్పూర్‌లో జరిగే పోరులో ఉత్తర్‌ప్రదేశ్‌పై మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి! దీనికి తోడు

Updated : 26 Nov 2021 06:53 IST

ఏడేళ్ల క్రితం మాట.. ఆ ఏడాది రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది ముంబయి! టోర్నీలో ఆశలు ఉండాలంటే కాన్పూర్‌లో జరిగే పోరులో ఉత్తర్‌ప్రదేశ్‌పై మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి! దీనికి తోడు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగాడా కుర్రాడు. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన అతడికి ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటకపోతే జట్టులో స్థానం గల్లంతైనట్టే! ఇంతటి స్థితిలో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌ ఆడాడా టీనేజర్‌. అంతేకాదు ముంబయిని గెలిపించాడు. తానూ గెలిచాడు! అతడి ఎర్రబంతి కెరీర్‌ టేకాఫ్‌ అయింది అక్కడే! ఆ కుర్రాడే శ్రేయస్‌ అయ్యర్‌! తన కెరీర్‌ ఎక్కడ మలుపు తిరిగిందో అదే కాన్పూర్‌లో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే అదిరే ఆటతో ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు.

శ్రేయస్‌ ఆట చూస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్టులా కనిపిస్తాడు. ఆ అంచనాలను నిజం చేస్తూనే అతడు ఐపీఎల్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున సత్తా చాటాడు కూడా. అయితే శ్రేయస్‌కు ఉన్న సహనం, వికెట్‌కు అతడిచ్చే విలువ.. ఆటలో మమేకమయ్యే తీరు గురించి తెలిసింది కొందరికే. 2014లో రంజీ సీజన్‌ ద్వారా పరిచయమైన ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌.. ఆ తర్వాత ఎర్రబంతి క్రికెట్లో తన ముద్ర వేశాడు. తన తొలి సీజన్లోనే 809 పరుగులు చేసిన అతడు.. ఆ తర్వాత సీజన్లో ఏకంగా 1321 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఒక రంజీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ రికార్డుకు అతడు 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రే మార్గదర్శనంలో ఎదిగిన శ్రేయస్‌.. సుదీర్ఘ ఫార్మాట్లో బలమైన పునాది వేసుకున్నాడు. ఒకవైపు ఓర్పుగా ఆడుతూనే గేర్లు మారుస్తూ స్కోరు చేయడం, ఎలాంటి బౌలింగ్‌నైనా వెరవకుండా ఎదుర్కోవడం శ్రేయస్‌ శైలి. అతడు 82 స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. కఠిన పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలో మరింత పట్టుదలగా ఆడటం అతడి నైజం. కెరీర్‌ ఆరంభం నుంచి అతడిది అదే తీరు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన కాన్పూర్‌ రంజీ మ్యాచ్‌లో.. పూర్తిగా పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ప్రవీణ్‌కుమార్‌ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు 75 విలువైన పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. సగం బ్యాటర్లు నిష్క్రమించిన స్థితిలో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌..  తొలి 10 బంతుల్లోనే 6 బౌండరీలు కొట్టాడంటేనే అతడి దూకుడును అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత అతడు కివీస్‌ బౌలర్లను ఎదుర్కొన్న తీరు చూడాల్సిందే. ఇంకాసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా కూడా తొలి రోజు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో సిక్స్‌ బాదడం అతడి దూకుడుకు చిహ్నం.

ఆసుపత్రి నుంచి..

శ్రేయస్‌ టెస్టు క్యాప్‌ అందుకోవడానికి ముందు గాయం కారణంగా చాలా ఇబ్బందులే పడ్డాడు. ఈ మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా భుజం స్థానభ్రంశం కావడంతో అతడు మైదానానికి దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌లో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్‌లో జరిగిన ఈ సీజన్‌ ఐపీఎల్‌ తొలి అంచె టోర్నీకి దూరమయ్యాడు. పునరావాసం తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌ రెండో అంచె టోర్నీలో ఆడిన అతడు.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. అయితే సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్‌.. తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. నిజానికి శ్రేయస్‌కు టెస్టు అరంగేట్రం చేసే ఛాన్స్‌ 2017లోనే తలుపు తట్టింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ధర్మశాలలో ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో విరాట్‌ కోహ్లికి ప్రత్యామ్నాయంగా అయ్యర్‌ను ఎంపిక చేశారు. కానీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ సిరీస్‌లో భారత్‌ గెలిచింది. అప్పటి నుంచి అతడు తన తొలి టెస్టు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అందుకున్న టెస్టు క్యాప్‌ శ్రేయస్‌కు ఎంతో అమూల్యం. ఎందుకంటే ఎంతో కాలం ఎదురు చూడగా వచ్చిన అవకాశం మాత్రమే కాదు..54 ఫస్ట్‌ క్యాచ్‌ మ్యాచ్‌లు ఆడిన తర్వాత 4592 పరుగులు చేశాక అతడికి దక్కిన ఫలితమది.

ఆ డీపీ మార్చలేదు

2017 బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీతో శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్న ఫొటోనే అతడి తండ్రి సంతోష్‌ తన వాట్సప్‌ డీపీగా పెట్టుకున్నాడు. నాలుగేళ్లుగా అతడు ఆ డీపీ మార్చలేదు. దీనికి కారణం సుదీర్ఘ ఫార్మాట్లో తన తనయుడు ఆడాలని ఆశించడమే. ఈ తరుణం కోసం అతడు సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. ‘‘బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని శ్రేయస్‌ పట్టుకున్న ఫొటో నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ధర్మశాలలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లికి ప్రత్యామ్నాయంగా అయ్యర్‌ను ఎంపిక చేశారు. అందుకే ఈ సిరీస్‌ గెలిచిన తర్వాత శ్రేయస్‌ చేతుల్లో ట్రోఫీ ఉండాలని అప్పటి జట్టు సభ్యులు అనుకున్నారు. ఆ గడియ ఎంతో అమూల్యం. ఎందుకంటే అప్పుడు అతడు భారత జట్టుకు ఆడినట్లే అనిపించింది. అందుకే అప్పటి నుంచి ఆ ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకున్నాను. ఇప్పుడు న్యూజిలాండ్‌పై అతడు అరంగేట్రం చేసిన క్షణం ఎంతో విలువైంది. ఐపీఎల్‌, వన్డే వీటన్నిటికంటే ఇదెంతో అమూల్యం’’ అని శ్రేయస్‌ తండ్రి సంతోష్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని