Updated : 26 Nov 2021 06:54 IST

IND vs NZ: అయ్యర్‌ అదిరెన్‌

అరంగేట్రంలో ఆకట్టుకున్న శ్రేయస్‌

జడేజా, గిల్‌ అర్ధశతకాలు

భారత్‌ 258/4

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు

శ్రేయస్‌ అరంగేట్రం అదిరిపోయింది. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఈ యువ బ్యాట్స్‌మన్‌.. దూకుడైన ఆటతో టెస్టు కెరీర్‌కు బలమైన పునాది వేసుకున్నాడు. అతడికి తోడు జడేజా, శుభ్‌మన్‌ గిల్‌ సత్తాచాటిన వేళ.. స్టార్లు లేకున్నా కివీస్‌తో మొదటి టెస్టులో టీమ్‌ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్‌కు అంత తేలిగ్గా ఏమీ లేని పిచ్‌పై తొలి రోజు పైచేయి సాధించిన ఆతిథ్య జట్టు.. భారీ స్కోరుపై కన్నేసింది.

కాన్పూర్‌

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియాకు చక్కని ఆరంభం. శ్రేయస్‌ అయ్యర్‌ (75 బ్యాటింగ్‌; 136 బంతుల్లో 7×4, 2×6) విలువైన ఇన్నింగ్స్‌ ఆడడంతో తొలి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (52; 93 బంతుల్లో 5×4, 1×6), జడేజా (50 బ్యాటింగ్‌; 100 బంతుల్లో 6×4) అర్ధశతకాలతో రాణించారు. జేమీసన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇబ్బందుల్లో పడ్డ భారత్‌ను ఆదుకున్న శ్రేయస్‌, జడేజా రెండో రోజు ఇంకెన్ని పరుగులు చేస్తారన్నది కీలకం.

శ్రేయస్‌ అదరహో..: 145/4. కేవలం అయిదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగిన భారత జట్టు పరిస్థితి ఓ దశలో ఇది. శుభ్‌మన్‌ గిల్‌ చక్కని అర్ధశతకం సాధించినా.. జట్టుకు ఇబ్బంది తప్పలేదు. ఆ దశలో మరో వికెట్‌ పడుంటే తొలి రోజును టీమ్‌ఇండియా భిన్నంగా ముగించేదేమో! కానీ కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ అదరగొట్టాడు. సంయమనంతో కూడిన దూకుడును ప్రదర్శించిన అతడు.. జడేజాతో కలిసి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. పుజారా (26) ఔటయ్యాక, జట్టు స్కోరు 106/3 వద్ద క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌.. కాసేపు కెప్టెన్‌ రహానేతో కలిసి బ్యాటింగ్‌ చేశాడు. ఆరంభంలో అతడు తడబడ్డాడు. సాధికారికంగా ఆడలేకపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డాడు. ఓ పేలవమైన లాఫ్టెడ్‌ షాట్‌తో ఖాతా తెరిచిన శ్రేయస్‌.. టీ విరామానికి 55 బంతుల్లో కేవలం 17 పరుగులు చేశాడు. అప్పటికి జడేజా క్రీజులోకి వచ్చాడు. టీ తర్వాత శ్రేయస్‌ ఆటే మారిపోయింది. స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన అతడు.. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. చక్కని స్క్వేర్‌ కట్‌, లేట్‌ కట్‌లతో అలరించాడు. పుల్‌ షాట్లు, డ్రైవ్‌లతో మురిపించాడు. ముందుకొచ్చి షాట్లు ఆడేందుకు కూడా అతడు వెనుకాడలేదు. అరంగేట్ర స్పిన్నర్‌ రచిన్‌ రవీంద్ర టీ తర్వాత కేవలం నాలుగు ఓవర్లలోనే 26 పరుగులు సమర్పించుకున్నాడు. సౌథీ బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ డ్రైవ్‌ సింగిల్‌తో శ్రేయస్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. అతడు 17 నుంచి 50కి చేరుకోవడానికి 39 బంతులే ఆడడం విశేషం. జోరు కొనసాగించిన శ్రేయస్‌.. మరో స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో అలవోకగా సిక్స్‌ కొట్టాడు. అయితే పేసర్లు జేమీసన్‌, సౌథీలను జాగ్రత్తగా ఎదుర్కొన్నాడు. కివీస్‌ స్పిన్నర్లలో సొమర్‌విలే పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కానీ అతడి బౌలింగ్‌లోనూ ఆఖర్లో శ్రేయస్‌.. మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టాడు. జడేజాతో అభేద్యమైన అయిదో వికెట్‌కు శ్రేయస్‌ 113 పరుగులు జోడించాడు. నిజానికి పిచ్‌ ఏమీ బ్యాటింగ్‌ అంత తేలిగ్గా లేదు. బౌన్స్‌ అస్థిరంగా ఉంది. బంతి అప్పుడప్పుడు అనూహ్యంగా తిరిగి సర్రున మీదికి దూసుకొచ్చింది. పేసర్లకు రెండు కొత్త బంతులతో స్వింగ్‌ కూడా లభించింది. ఈ నేపథ్యంలో జడేజా గొప్ప పరిణతితో బ్యాటింగ్‌ చేశాడు. చక్కగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ శ్రేయస్‌కు సహకరించిన అతడు.. ఏమాత్రం అవకాశం దక్కినా బంతిని బౌండరీ దాటించాడు. జేమీసన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలతో టెస్టుల్లో 17వ అర్ధశతకం సాధించాడు.


సన్నీ చేతుల మీదుగా..

శ్రేయస్‌ అయ్యర్‌ భారత టెస్టు జట్టుకు ఆడిన 303వ ఆటగాడిగా నిలిచాడు. గురువారం న్యూజిలాండ్‌తో ఆరంభమైన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌.. దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ నుంచి టోపీ అందుకున్నాడు. ఒకప్పుడు టెస్టు అరంగేట్రం చేసే క్రికెటర్లకు దిగ్గజ ఆటగాళ్లు టోపీ బహుకరించేవాళ్లు. ఇటీవల కాలంలో కొత్తగా జట్టులోకి ఎవరు వచ్చినా కెప్టెన్‌, కోచ్‌ లేదంటే జట్టులో సీనియర్‌ ఆటగాడు క్యాప్‌ ఇవ్వడం అలవాటుగా మారింది. కానీ కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సునీల్‌ గావస్కర్‌ ద్వారా శ్రేయస్‌కు క్యాప్‌ అందించాడు. ఈ సందర్భంగా గావస్కర్‌ మాటలను శ్రద్ధగా విన్న శ్రేయస్‌.. ఉద్వేగానికి గురయ్యాడు. టోపీని ముద్దుపెట్టుకుని సహచరులను కౌగిలించుకున్నాడు.

రాణించిన గిల్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తొలి గంటలో ఇబ్బంది పడింది. ముఖ్యంగా జేమీసన్‌ కొత్త బంతితో బ్యాట్స్‌మెన్‌ పరీక్షించాడు. జట్టు స్కోరు 21 వద్ద ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (13)ను ఔట్‌ చేయడం ద్వారా భారత్‌ను తొలి దెబ్బతీశాడు. శరీరానికి దూరంగా షాట్‌ ఆడిన మయాంక్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌కు దొరికిపోయాడు. అయితే మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ తొలి ఓవర్లో న్యూజిలాండ్‌ సమీక్ష కోరకపోవడంతో బతికిపోయిన గిల్‌. ముచ్చటైన షాట్లతో అలరించాడు. అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. అజాజ్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో లాఫ్టెడ్‌ షాట్‌తో కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. మరోవైపు పుజారా ఎప్పటిలాగే సహనంతో బ్యాటింగ్‌ చేశాడు. లంచ్‌ సమయానికి భారత్‌ 82/1తో నిలిచింది. క్రీజులో కుదురుకుని చాలా సౌకర్యంగా కనపించిన గిల్‌.. పెద్దగా ఇన్నింగ్స్‌ ఆడతాడనిపించింది. కానీ లంచ్‌ తర్వాత తొలి ఓవర్లోనే జేమీసన్‌ బౌలింగ్‌లో అతడు బౌల్డ్‌ కావడంతో 61 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని డిఫెండ్‌ చేయబోయిన గిల్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో బౌల్డయ్యాడు. కాసేపటి తర్వాత సౌథీ వేసిన ఓ చక్కని బంతికి పుజారా వెనుదిరిగాడు. డిఫెన్స్‌ ఆడబోయిన పుజారా.. ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ బ్లండెల్‌కు చిక్కాడు. మరోవైపు రహానె (35) కూడా ఉన్నంతసేపూ మెరుగ్గానే బ్యాటింగ్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌లతో అలరించాడు. కానీ క్రీజులో కుదురుకున్నాక కీలక సమయంలో నిష్క్రమించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని రహానె వికెట్ల మీదికి ఆడుకుని నిరాశగా వెనుదిరిగాడు. శ్రేయస్‌తో నాలుగో వికెట్‌కు అతడు 39 పరుగులు జోడించాడు. కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ టేల్‌ తొలి రోజు 21 ఓవర్లలో 78 పరుగులిచ్చాడు.గిల్‌..  అతడి బౌలింగ్‌లో 28 బంతుల్లో 29 పరుగులు రాబట్టడం విశేషం.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) బ్లండెల్‌ (బి) జేమీసన్‌ 13; శుభ్‌మన్‌ గిల్‌ (బి) జేమీసన్‌ 52; పుజారా (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 26; రహానె (బి) జేమీసన్‌ 35; శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ 75; జడేజా బ్యాటింగ్‌ 50; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (84 ఓవర్లలో 4 వికెట్లకు) 258; వికెట్ల పతనం: 1-21, 2-82, 3-106, 4-145; బౌలింగ్‌:   సౌథీ 16.4-3-43-1; జేమీసన్‌ 15.2-6-47-3; అజాజ్‌ పటేల్‌ 21-6-78-0; సోమర్‌విలే 24-2-60-0; రచిన్‌ రవీంద్ర 7-1-28-0

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని