Updated : 27/11/2021 09:43 IST

IND vs NZ: పడగొట్టాలిక..

బౌలర్ల విఫలం.. న్యూజిలాండ్‌ 129/0

సౌథీ విజృంభణ.. 345కే భారత్‌ ఆలౌట్‌

అరంగేట్రంలోనే శ్రేయస్‌ సెంచరీ

145 పరుగులకే 4 వికెట్లు పడ్డ స్థితి నుంచి.. గొప్పగా పుంజుకుని మరో వికెట్‌ పడకుండా తొలి రోజు ఆటను ముగించి తొలి టెస్టుపై పట్టు బిగిస్తున్నట్లు కనిపించిన టీమ్‌ఇండియా.. రెండో రోజు తీవ్ర నిరాశకు గురి చేసింది. భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయి ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావడమే కాదు.. 57 ఓవర్ల ఆటలో ఒక్కటంటే ఒక్క వికెట్‌ పడగొట్టలేక ప్రత్యర్థిని గొప్పగా పుంజుకునే అవకాశం కల్పించింది. బంతితో, బ్యాటుతో పూర్తి పైచేయి సాధించిన కివీస్‌.. రెండో రోజు ఆటను శాసించింది. శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్రంలోనే శతకం సాధించడం ఒక్కటే శుక్రవారం ఆటలో భారత్‌ను సంతోషపెట్టిన విషయం. మూడో రోజు బౌలర్లు పుంజుకోకుంటే మ్యాచ్‌ మీద ఆశలు వదులుకోవాల్సిందే.

కాన్పూర్‌

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుపై పట్టు సాధించే అవకాశాన్ని టీమ్‌ఇండియా కోల్పోయింది. రెండో రోజు ఆటలో భారత జట్టుకు ఏదీ కలిసి రాలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 258/4తో ఉదయం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. 400 పైచిలుకు స్కోరు సాధిస్తుందనుకుంటే టిమ్‌ సౌథీ (5/69) ధాటికి 345 పరుగులకే పరిమితమైంది. అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13×4, 2×6) శతకంతో మెరిశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ ఆట ఆఖరుకు వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్‌ యంగ్‌ (75 బ్యాటింగ్‌; 180 బంతుల్లో 12×4), టామ్‌ లేథమ్‌ (50 బ్యాటింగ్‌; 165 బంతుల్లో 4×4) తమ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. భారత బౌలర్లు వీరిపై బాగానే ఒత్తిడి తెచ్చినా వికెట్‌ మాత్రం సాధించలేకపోయారు.

కట్టడి చేశారు కానీ..: భారత్‌ 27.1 ఓవర్లలోనే మిగతా ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌటైన నేపథ్యంలో పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉన్నాయని, కివీస్‌కు బ్యాటింగ్‌ అంత తేలిక కాదని.. రెండో రోజు సగం వికెట్లయినా కోల్పోతుందని అంచనా వేస్తే.. అంతా తలకిందులైంది. 57 ఓవర్లు వేసినా భారత బౌలర్లకు ఒక్క వికెట్టూ దక్కలేదు. అలాగని బౌలర్లు మరీ పేలవంగా ఏమీ బౌలింగ్‌ చేయలేదు. కివీస్‌ ఓపెనర్ల మీద బాగానే ఒత్తిడి తెచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్‌ ఇవ్వకూడదన్న పట్టుదలతో బ్యాటింగ్‌ చేసిన యంగ్‌, లేథమ్‌.. అజేయంగా పెవిలియన్‌ చేరారు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఒక క్యాచ్‌ లేపడం తప్ప లేథమ్‌ ఇన్నింగ్స్‌లో లోపమే లేదు. అంపైర్లు మూడుసార్లు తనను ఔటిచ్చినా సమీక్షను ఉపయోగించుకుని అతను బయటపడ్డాడు. లేథమ్‌ మరీ నెమ్మదిగా ఆడగా.. క్రీజులో కుదురుకున్నాక యంగ్‌ మాత్రం చక్కటి షాట్లు ఆడాడు. అయినప్పటికీ కివీస్‌ రన్‌రేట్‌ 2.26కు మించలేదు. అందులోనూ చివరి సెషన్లో అయితే.. యంగ్‌, లేథమ్‌ 31 ఓవర్లలో 57 పరుగులే చేయగలిగారు. పరుగులు రాకున్నా వికెట్‌ ఇవ్వకూడదన్న మొండి పట్టుదలను కివీస్‌ ఓపెనర్లు ప్రదర్శించడంతో అశ్విన్‌ సహా భారత బౌలర్లెవ్వరూ ఖాతా తెరవలేదు. బంతి మరీ నెమ్మదిగా, తక్కువ ఎత్తులో రావడంతో.. కివీస్‌ ఓపెనర్లు బంతిని ఎదుర్కోవడానికి బాగా సమయం దొరికింది. దీని వల్ల పరుగులు మందకొడిగా వచ్చినప్పటికీ.. వికెట్‌ కాపాడుకోవడానికి అవకాశం లభించింది.

సౌథీ అనూహ్యంగా..: తొలి రోజు అనారోగ్య కారణాలతో మైదానం నుంచి మధ్యలో వెళ్లిపోయిన సౌథీ.. రెండో రోజు అసలు బౌలింగ్‌ చేస్తాడా అని సందేహిస్తే.. అతను సంచలన స్పెల్‌తో భారత్‌ పని పట్టాడు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ జడేజా (50).. సౌథీ బౌలింగ్‌లో బాగా ఇబ్బంది పడి.. ఒక ఇన్‌ స్వింగింగ్‌ బంతిని వికెట్ల మీదికి ఆడుకుని వెనుదిరిగాడు. అతను రెండో రోజు ఒక్క పరుగూ జోడించలేదు. తర్వాత క్రీజులోకి వచ్చిన సాహా ఎంతమాత్రం సౌకర్యంగా కనిపించలేదు. మరో ఎండ్‌లో శ్రేయస్‌ మాత్రం ధాటిగా ఆడాడు. జేమీసన్‌ 3 ఓవర్లలో 5 ఫోర్లు కొట్టి 90ల్లోకి వచ్చేశాడు. కాసేపటికే శతకం కూడా అందుకున్నాడు. అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సౌథీ.. స్వల్ప వ్యవధిలో సాహా, శ్రేయస్‌లను ఔట్‌ చేశాడు. సాహా.. ఔట్‌స్వింగర్‌ను వెంటాడి వికెట్‌కీపర్‌కు చిక్కగా.. శ్రేయస్‌ కొంచెం బద్ధకంగా ఆడిన షాట్‌కు షార్ట్‌ కవర్స్‌లో యంగ్‌కు దొరికాడు. ఈ దశలో భారత్‌ కుప్పకూలిపోతుందేమో అనిపించినా.. అశ్విన్‌ ధాటిగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అద్భుతమైన డ్రైవ్‌లు ఆడిన అశ్విన్‌.. నిఖార్సయిన బ్యాట్స్‌మన్‌లా కనిపించాడు. అజాజ్‌ బౌలింగ్‌లో ఒక స్టంపౌట్‌ తప్పి బతికిపోయిన అశ్విన్‌.. అతడి బౌలింగ్‌లోనే బౌల్డయ్యాడు. కాసేపటికే భారత ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

16వ వాడు శ్రేయస్‌

టెస్టు మ్యాచ్‌ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్‌మన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు 75 పరుగులతో అజేయంగా నిలిచిన అతను.. రెండో రోజు, శుక్రవారం తొలి సెషన్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. జేమీసన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 92వ ఓవర్లో తొలి బంతికి గల్లీ వైపు బంతిని నెట్టి రెండు పరుగులు పూర్తి చేసిన శ్రేయస్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. అతను 157 బంతుల్లో 12 ఫోర్లతో ఈ ఘనత సాధించాడు. ముంబయి తరఫున రోహిత్‌, పృథ్వీల తర్వాత అరంగేట్రంలోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌ శ్రేయసే. న్యూజిలాండ్‌పై అర్జన్‌ కృపాల్‌ సింగ్‌, (1955), సురిందర్‌ అమర్‌నాథ్‌ (1976)ల తర్వాత అరంగేట్ర టెస్టు శతకం సాధించింది అయ్యరే.

‘‘గావస్కర్‌ సర్‌ నాకు టోపీ ఇస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ‘గతం, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్తమానం గురించి ఆలోచించు’ అన్నారు. నేను అదే పని చేస్తున్నా. ఈరోజు గురించి ఆలోచించడమే నా లక్ష్యం. తర్వాతి మ్యాచ్‌ల్లో ఏం జరుగుతుందో ఆలోచిస్తే వర్తమానంలో ఉండలేను. మ్యాచ్‌లో రాణించలేను. గావస్కర్‌ సర్‌ నుంచి టోపీ అందుకోవడం అద్భుతంలా అనిపించింది. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా పరుగులు సాధించావు. కానీ టెస్టు జట్టు టోపీ అందుకున్నప్పుడే నీ అసలైన విజయం’ అని ప్రవీణ్‌ సర్‌ అనేవాడు. నేను టోపీ అందుకున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించి ఉంటాడు’’

- శ్రేయస్‌ అయ్యర్‌


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) బ్లండెల్‌ (బి) జేమీసన్‌ 13; శుభ్‌మన్‌ (బి) జేమీసన్‌ 52; పుజారా (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 26; రహానె (బి) జేమీసన్‌ 35; శ్రేయస్‌ (సి) యంగ్‌ (బి) సౌథీ 105; జడేజా (బి) సౌథీ 50; సాహా (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 1; అశ్విన్‌ (బి) అజాజ్‌ 38; అక్షర్‌ (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 3; ఉమేశ్‌ నాటౌట్‌ 10; ఇషాంత్‌ ఎల్బీ (బి) అజాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (111.1 ఓవర్లలో ఆలౌట్‌) 345
వికెట్ల పతనం: 1-21, 2-82, 3-106, 4-145, 5-266, 6-288, 7-305, 8-313, 9-339 బౌలింగ్‌: సౌథీ 27.4-6-69-5; జేమీసన్‌ 23.2-6-91-3; అజాజ్‌ 29.1-7-90-2; సోమర్‌విలీ 24-2-60-0; రచిన్‌ రవీంద్ర 7-1-28-0

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లేథమ్‌ బ్యాటింగ్‌ 50; యంగ్‌ బ్యాటింగ్‌ 75; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (57 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 129; బౌలింగ్‌: ఇషాంత్‌ 6-3-10-0; ఉమేశ్‌ యాదవ్‌ 10-3-26-0; అశ్విన్‌ 17-5-38-0; జడేజా 14-4-28-0; అక్షర్‌ పటేల్‌ 10-1-26-0


'సమీక్షతో మూడుసార్లు బతికి..

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ టామ్‌ లేథమ్‌.. మూడుసార్లు సమీక్షను ఉపయోగించుకుని నాటౌట్‌గా తేలడం విశేషం. ఇషాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే లేథమ్‌ను అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్బీగా ప్రకటించాడు. కానీ సమీక్షలో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుందని తేలింది. తర్వాత 15వ ఓవర్లో జడేజా బౌలింగ్‌లోనూ నితినే ఎల్బీ ఇవ్వగా.. లేథమ్‌ మళ్లీ సమీక్షకు వెళ్లాడు. ఈసారీ అదే ఫలితం వచ్చింది. 56వ ఓవర్లో అశ్విన్‌ బంతికి లేథమ్‌ క్యాచౌట్‌ అయినట్లు భావించి అంపైర్‌ వీకే శర్మ వేలెత్తాడు. సమీక్షలో బంతి ప్యాడ్‌ను తాకి వికెట్‌ కీపర్‌ చేతుల్లో పడిందని తేలింది. మధ్యలో అశ్విన్‌ బౌలింగ్‌లో లేథమ్‌ ఇచ్చిన స్లిప్‌ క్యాచ్‌ను రహానె అందుకోలేకపోయాడు.


అయ్యర్‌ కోసం ఖాళీ చేసేదెవరు?

కోహ్లి, రోహిత్‌, రాహుల్‌ లాంటి సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అరంగేట్ర టెస్టులోనే శతకం సాధించి టెస్టు జట్టులో పాగా వేశాడు శ్రేయస్‌. ఇప్పుడిక పై ముగ్గురూ తిరిగి జట్టులోకి వస్తే శ్రేయస్‌ పరిస్థితేంటన్నది ఆసక్తికరం. రోహిత్‌ ఆడేది ఓపెనింగ్‌లో కాబట్టి మయాంక్‌, శుభ్‌మన్‌ల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారు. రాహుల్‌కు టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏమీ లేదు కాబట్టి అతడి గురించి ఆలోచించాల్సిన పని లేదు. రోహిత్‌, రాహుల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి అందుబాటులో లేరు కూడా. అయితే రెండో టెస్టుకు కోహ్లి తిరిగి జట్టులోకి వస్తున్నాడు. మామూలుగా అయితే అతడి కోసం శ్రేయస్‌నే పక్కన పెట్టాలి. కానీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఆటగాడిని తప్పించే అవకాశమే లేదు. జట్టులో ఫామ్‌ పరంగా ఇబ్బంది పడుతోంది రహానె, పుజారాలే. రహానె జట్టు వైస్‌ కెప్టెన్‌. పైగా తొలి టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు కూడా. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గెలిపించే స్థాయి ఇన్నింగ్స్‌ ఆడితే తప్ప పుజారాపై వేటు పడక తప్పదేమో!

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని