IND vs NZ: మయాంక్‌ నిలిచాడు.. నిలబెట్టాడు

క్రీజులో కుదురుకున్న గిల్‌ ఔటైపోయాడు. ఆ వెనకే కనీసం ఖాతా కూడా తెరవకుండానే పుజారా, కెప్టెన్‌ కోహ్లి పెవిలియన్‌ చేరిపోయారు. అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన శ్రేయస్‌.. ఈ ఇన్నింగ్స్‌లో ఆ ప్రదర్శన పునరావృతం చేయలేకపోయాడు. ఓ వైపు విజృంభిస్తున్న ప్రత్యర్థి స్పిన్నర్‌.. మరోవైపు కష్టాల్లో జట్టు.. అయినా తొలి రోజు ఆట ముగిసే సరికి స్కోరు 221/4. కివీస్‌తో రెండో టెస్టులో ప్రస్తుతానికి మెరుగైన స్థితిలోనే భారత్‌. అందుకు కారణం.. మయాంక్‌ అగర్వాల్‌. ఈ మ్యాచ్‌ ముందు వరకూ

Updated : 04 Dec 2021 06:48 IST

సెంచరీతో ఆదుకున్న ఓపె
భారత్‌ 221/4
అజాజ్‌ స్పిన్‌ మాయాజాలం
తొలి రోజు రెండు సెషన్లే
కివీస్‌తో రెండో టెస్టు
ముంబయి

క్రీజులో కుదురుకున్న గిల్‌ ఔటైపోయాడు. ఆ వెనకే కనీసం ఖాతా కూడా తెరవకుండానే పుజారా, కెప్టెన్‌ కోహ్లి పెవిలియన్‌ చేరిపోయారు. అరంగేట్ర టెస్టులో అదరగొట్టిన శ్రేయస్‌.. ఈ ఇన్నింగ్స్‌లో ఆ ప్రదర్శన పునరావృతం చేయలేకపోయాడు. ఓ వైపు విజృంభిస్తున్న ప్రత్యర్థి స్పిన్నర్‌.. మరోవైపు కష్టాల్లో జట్టు.. అయినా తొలి రోజు ఆట ముగిసే సరికి స్కోరు 221/4. కివీస్‌తో రెండో టెస్టులో ప్రస్తుతానికి మెరుగైన స్థితిలోనే భారత్‌. అందుకు కారణం.. మయాంక్‌ అగర్వాల్‌. ఈ మ్యాచ్‌ ముందు వరకూ జట్టులో తన స్థానాన్ని ప్రశ్నించిన వాళ్లకు అద్భుత శతకంతో సమాధానమిచ్చాడు. తాను క్రీజులో నిలబడి.. జట్టునూ నిలబెట్టాడు. మరోవైపు తడి ఔట్‌ఫీల్డ్‌ కారణంగా మొదటి రోజు ఆటలో తొలి సెషన్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

న్యూజిలాండ్‌తో చివరిదైన రెండో టెస్టులో భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. శుక్రవారం ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తడబడ్డా.. మయాంక్‌ (120 బ్యాటింగ్‌; 246 బంతుల్లో 14×4, 4×6) సెంచరీతో తిరిగి నిలబడింది. 70 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (44) రాణించాడు. జట్టు ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచిన మయాంక్‌తో పాటు సాహా (25 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ముంబయిలోనే పుట్టి ఇప్పుడు కివీస్‌కు ఆడుతున్న స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ (4/73) అదే గడ్డపై భారత్‌ను దెబ్బకొట్టాడు. నాలుగు వికెట్లూ అతనే తీశాడు. కానీ మయాంక్‌ పోరాటంతో కోలుకున్న జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసినా మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం ఉంది. తొలి రోజు నుంచే బంతి తిరుగుతున్న పిచ్‌పై మన స్పిన్నర్లు కివీస్‌ పతనాన్ని శాసిస్తారన్న అంచనాలే అందుకు కారణం. వాంఖడేలో మ్యాచ్‌ రోజు ఉదయమే వర్షం నిలిచిపోయినప్పటికీ.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఔట్‌ఫీల్డ్‌, పిచ్‌ పరిసర ప్రాంతాలు తడిగా మారాయి. అందుకే మ్యాచ్‌ను ఆలస్యంగా 12 గంటలకు మొదలెట్టారు. దీంతో రెండు సెషన్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

ఆరంభం అదిరె..: తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు మయాంక్‌, గిల్‌ జట్టుకు శుభారంభాన్ని అందించారు. వర్షం ప్రభావంతో బౌలర్లకు అనుకూలంగా మారిన పిచ్‌పై ఈ జోడీ ఏ మాత్రం బెదరకుండా బ్యాటింగ్‌ చేసింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో రాణించిన సౌథీ (0/29) ప్రమాదకరంగా కనిపించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ఓపెనర్లను పరీక్షించాడు. కానీ ఆ సవాలుకు నిలబడ్డ మయాంక్‌, గిల్‌ ఆత్మవిశ్వాసంతో ఆడారు. ముఖ్యంగా గిల్‌ మొదటి నుంచే దూకుడు ప్రదర్శించాడు. జేమీసన్‌ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదాడు. మయాంక్‌ కూడా నెమ్మదిగా జోరు అందుకున్నాడు. ఓ వైపు సౌథీని జాగ్రత్తగా కాచుకుంటూనే.. మరోవైపు జేమీసన్‌ బౌలింగ్‌లో ఈ జోడీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. దీంతో ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లోనే అజాజ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. పిచ్‌ను గొప్పగా ఉపయోగించుకుంటూ స్పిన్‌, బౌన్స్‌ రాబట్టిన అతని బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు రాబట్టింది. క్రీజు వదిలి ముందుకు వచ్చి అతని బౌలింగ్‌లో మయాంక్‌ కళ్లు చెదిరే సిక్సర్‌ బాదాడు. మరోవైపు గిల్‌ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేయడంతో భారత్‌కు ఇబ్బంది లేదనిపించింది.

పది బంతుల తేడాలో..: తొలి వికెట్‌కు ఓపెనర్లు 80 పరుగులు జోడించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుందనిపించింది. కానీ ఆ దశలో అజాజ్‌ తన పది బంతుల్లోనే కథ మొత్తం మార్చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బ కొట్టాడు. మొదట అర్ధశతకం దిశగా సాగుతున్న గిల్‌ను ఔట్‌ చేసిన అతను.. తన తర్వాతి ఓవర్లో పుజారా (0), కోహ్లీ (0)లను వెనక్కిపంపాడు. స్టంపౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి గిల్‌ తప్పించుకున్నాడని ఆనందించేలోపే.. తర్వాతి బంతికే అతను స్లిప్‌లో టేలర్‌ చేతికి చిక్కాడు. ఇక అజాజ్‌ తర్వాతి ఓవర్లో తొలి బంతికే పుజారా ఎల్బీ కోసం కివీస్‌ సమీక్ష కోరి విఫలమైంది. హమ్మయ్యా.. అనుకునేలోపే రెండో బంతికే అతను బౌల్డయ్యాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో అరుదుగా క్రీజు బయటకు వచ్చే పుజారా.. ఈ ఇన్నింగ్స్‌లో అలాగే ముందుకు వచ్చి బంతిని అంచనా వేయడంలో విఫలమై పెవిలియన్‌ చేరాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి కోహ్లి వివాదాస్పద ఎల్బీగా వెనుదిరగడంతో 80/0తో ఉన్న జట్టు ఒక్కసారిగా 80/3తో కష్టాల్లో పడింది. ఆ దశలో మయాంక్‌ ఆపద్బాంధవుడిలా నిలిచాడు. అజాజ్‌పైనే ఎదురు దాడికి దిగాడు. అతనికి తొలి మ్యాచ్‌ హీరో శ్రేయస్‌ జత కలవడంతో జట్టు కోలుకునేలా కనిపించింది. ఫోర్‌తో మయాంక్‌ అర్ధసెంచరీ అందుకోవడంతో జట్టు 111/3తో రెండో సెషన్‌ను ముగించింది.

అంతా తానై..: చివరి సెషన్‌లో మయాంక్‌ గేర్‌ మార్చాడు. బౌండరీలతో చెలరేగాడు. సిక్సర్లతో అలరించాడు. పుల్‌ షాట్లు, కట్‌ షాట్లు, లాఫ్టెడ్‌ షాట్లతో పరుగుల వేటలో దూసుకెళ్లాడు. అజాజ్‌తో సహా ఏ బౌలర్‌నూ అతను లక్ష్య పెట్టలేదు. అలా అనీ గుడ్డిగా ఆడలేదు. కొలిచినట్లు షాట్లు కొట్టాడు. కచ్చితమైన టైమింగ్‌తో, కళాత్మక బ్యాటింగ్‌తో అబ్బురపరిచాడు. ఫ్రంట్‌ఫుట్‌పై కవర్‌డ్రైవ్‌లు ఆడిన అతను.. బ్యాక్‌ఫుట్‌పై పుల్‌షాట్లు, కట్‌ షాట్లతో బౌండరీలు సాధించాడు. శ్రేయస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 106 బంతుల్లోనే 80 పరుగులు జోడిస్తే అందులో అతడివే 53 పరుగులు. అవి కూడా కేవలం 65 బంతుల్లోనే చేశాడంటే అతనెంత దూకుడుగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. కానీ శ్రేయస్‌ను ఔట్‌ చేసిన అజాజ్‌ భారత జోరుకు మళ్లీ కళ్లెం వేశాడు. తొలి వికెట్‌ మాదిరే నాలుగో వికెట్‌కు కూడా 80 పరుగుల వద్దే భాగస్వామ్యం విడిపోవడం గమనార్హం. అక్కడి నుంచి మయాంక్‌ వేగం తగ్గింది. మరోవైపు తాను ఎదుర్కొన్న 18వ బంతికి సిక్సర్‌తో ఖాతా తెరిచిన సాహా కూడా జాగ్రత్త పడ్డాడు. వీళ్లిద్దరూ కలిసి పట్టుదలతో క్రీజులో నిలబడ్డారు. బౌలర్లకు వికెట్లు ఇవ్వకూడదనే ధ్యేయంతో బ్యాటింగ్‌ కొనసాగించారు. ఆ వెంటనే చూడముచ్చటైన కవర్‌డ్రైవ్‌తో ఫోర్‌ కొట్టిన మయాంక్‌ 196 బంతుల్లో శతకాన్ని చేరుకున్నాడు. ఫామ్‌ కోల్పోయి జట్టులో తన చోటుపై సందేహాలు నెలకొన్న సమయంలో ఈ సెంచరీ అతనికెంతో ప్రత్యేకమైంది. మూడంకెల స్కోరు అందుకున్నాక అతను చేసిన సింహనాదమే అందుకు నిదర్శనం. మరోవైపు సాహా కూడా కుదురుకోవడంతో భారత్‌ మరో వికెట్‌ కోల్పోకుండా తొలి రోజు ఆట ముగించింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ బ్యాటింగ్‌ 120; శుభ్‌మన్‌ గిల్‌ (సి) టేలర్‌ (బి) అజాజ్‌ 44; పుజారా (బి) అజాజ్‌ 0; కోహ్లి ఎల్బీ (బి) అజాజ్‌ 0; శ్రేయస్‌ (సి) బ్లండెల్‌ (బి) అజాజ్‌ 18; సాహా బ్యాటింగ్‌ 25; ఎక్స్‌ట్రాలు 14;

మొత్తం: (70 ఓవర్లలో 4 వికెట్లకు) 221
వికెట్ల పతనం: 1-80, 2-80, 3-80, 4-160
బౌలింగ్‌: సౌథీ 15-5-29-0; జేమీసన్‌ 9-2-30-0; అజాజ్‌ పటేల్‌ 29-10-73-4; సోమర్‌విల్లె 8-0-46-0; రచిన్‌ 4-0-20-0; మిచెల్‌ 5-3-9-0


* జయంత్‌ యాదవ్‌ నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. చివరగా అతను 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడాడు.

* మయాంక్‌కిది నాలుగో టెస్టు సెంచరీ. అతను చివరగా 2019 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాపై శతకం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని