Updated : 07/12/2021 14:12 IST

IND vs NZ: రికార్డు అజాజ్‌ది.. ఆధిపత్యం భారత్‌ది

పటేల్‌ 10/10 వృథా..

62కే కుప్పకూలిన కివీస్‌

రెండో టెస్టుపై పట్టుబిగించిన కోహ్లీసేన

విజృంభించిన సిరాజ్‌, అశ్విన్‌

ముంబయి

ఎప్పుడో 1956లో జిమ్‌లేకర్‌ నాలుగు దశాబ్దాల తర్వాత అనిల్‌ కుంబ్లే!

మళ్లీ ఇన్నాళ్లకు అజాజ్‌ పటేల్‌... 10/10 అద్భుతాన్ని సాధించి చరిత్రలో నిలిచిపోయాడు.

శనివారం మధ్యాహ్నం.. అతడెప్పుడూ మరిచిపోలేనిది..! స్పిన్‌ మాయాజాలంతో ఒక్కడే టీమ్‌ఇండియాను ఆలౌట్‌ చేశాడు.

.. కానీ భారత బౌలర్ల వల్ల అజాజ్‌కు ఆ సాయంత్రం మరిచిపోవాల్సిన సాయంత్రమైపోయింది. ఆతిథ్య జట్టును కట్టడి చేశామన్న సంతృప్తి కివీస్‌కు కొద్దిసేపయినా లేకుండా చేసిన టీమ్‌ఇండియా ముంబయి టెస్టుపై పట్టుబిగించింది. అజాజ్‌ శ్రమను వృథాగా మారుస్తూ న్యూజిలాండ్‌ను 62 పరుగులకే కుప్పకూల్చి.. మ్యాచ్‌లో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఫాలో ఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్‌.. ఇప్పుడు 332 పరుగుల భారీ ఆధిక్యంతో ఉంది. కివీస్‌ ఓటమి తప్పించుకుంటే అద్భుతమే!

చివరిదైన రెండో టెస్టులో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. విజయం దాదాపుగా ఖాయం. మ్యాచ్‌ను ఎంత త్వరగా ముగిస్తుందన్నదే ప్రశ్న! ఓవర్‌నైట్‌ స్కోరు 221/4తో రెండో రోజు, శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌.. లంచ్‌ తర్వాత 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17×4, 4×6) టాప్‌ స్కోరర్‌. అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5×4, 1×6) విలువైన అర్ధశతకం సాధించాడు. తొలి రోజు 4 వికెట్లు పడగొట్టిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌.. రెండో రోజు మిగతా 6 వికెట్లనూ పడగొట్టి టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే బ్యాటుతో కివీస్‌ దారుణంగా విఫలమైంది. సిరాజ్‌ (3/19), అశ్విన్‌ (4/8), అక్షర్‌ పటేల్‌ (2/14) విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలింది. జేమీసన్‌ (17), లేథమ్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 263 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్‌.. కివీస్‌కు ఫాలో ఆన్‌ ఇవ్వలేదు. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. మయాంక్‌ (38 బ్యాటింగ్‌) ఫామ్‌ను   కొనసాగించాడు. ఫీల్డింగ్‌లో శుభ్‌మన్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన పుజారా (29 బ్యాటింగ్‌) కూడా క్రీజులో సౌకర్యంగానే కనిపించాడు.

అన్నీ అజాజ్‌కే..: చక్కని బ్యాటింగ్‌ కొనసాగించిన సెంచరీ హీరో మయాంక్‌ (ఓవర్‌నైట్‌ 120) రెండో రోజు మరిన్ని విలువైన పరుగులు జోడించాడు. అక్షర్‌ పటేల్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ శనివారం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో హైలైట్‌ మాత్రం స్పిన్నర్‌ అజాజ్‌ బౌలింగే. మిగతా బౌలర్ల నుంచి ఎలాంటి సహకారం అందకున్నా చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఒంటరిగానే భారత్‌ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. జోరుమీదున్న మయాంక్‌ వికెట్‌ సహా అన్ని వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకున్నాడు. 47.5-12-119-10.. అజాజ్‌ మాయాజాలమిది. ఉదయం సాహా (27)తో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించగా.. భారత్‌ను దెబ్బతీయడానికి అజాజ్‌కు ఎంతో సమయం పట్టలేదు. తన మొదటి ఓవర్లోనే వరుస బంతుల్లో సాహా, అశ్విన్‌లను ఔట్‌ చేశాడు. సాహాను వికెట్లముందు దొరకబుచ్చుకున్న అజాజ్‌.. అశ్విన్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు. అయితే చక్కని సహకారాన్నిచ్చిన అక్షర్‌ పటేల్‌తో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మయాంక్‌లాగే సహనంతో ఆడిన అక్షర్‌.. వీలైనప్పుడు బౌండరీలు కొట్టాడు. లంచ్‌ సమయానికి భారత్‌ 285/6తో నిలిచింది. అయితే లంచ్‌ తర్వాత అజాజ్‌ మళ్లీ విజృంభించాడు. క్రీజులో కుదురుకున్న మయాంక్‌ను అతడు ఔట్‌ చేయడంతో 67 పరుగుల ఎడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. టెయిలెండర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. అందరూ అజాజ్‌కే దొరికిపోయారు. గిర్రున తిరిగిన బంతికి అక్షర్‌ వికెట్ల ముందు దొరికిపోగా.. భారీ షాట్‌కు యత్నించిన జయంత్‌ యాదవ్‌ (12) లాంగాఫ్‌లో చిక్కాడు. సిరాజ్‌ కూడా ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో చిక్కడంతో పదో వికెట్‌ అజాజ్‌ సొంతమైంది. అతడు తాను పుట్టిన నగరంలోనే ఈ గొప్ప ఘనత సాధించడం విశేషం. విదేశాల్లో 10 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా కూడా అతడు నిలిచాడు. అతడితో పాటు కివీస్‌ ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు.

కివీస్‌ విలవిల: భారత్‌ను పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నామన్న ఆనందం న్యూజిలాండ్‌కు ఎంతో సేపు నిలువలేదు. భారత బౌలర్ల ధాటికి ఉక్కిరిబిక్కిరైన ఆ జట్టు టపటపా వికెట్లు కోల్పోయింది. 28.1 ఓవర్లలోనే కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. సిరాజ్‌ పదునైన పేస్‌తో ఆరంభంలో కివీస్‌ను దెబ్బతీస్తే.. ఆ తర్వాత స్పిన్నర్లు మాయ చేశారు. భారత బౌలింగ్‌ దాడిని ఆరంభించిన సిరాజ్‌ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ప్రత్యర్థిని చావు దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో మొదలైంది న్యూజిలాండ్‌ పతనం.  ఆ ఒక్క ఓవర్లోనే సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (4) ఎడ్జ్‌తో కోహ్లీకి చిక్కగా.. షార్ట్‌ బంతిని హుక్‌ చేసిన లేథమ్‌ శ్రేయస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సిరాజ్‌ తన తర్వాతి ఓవర్లోనే టేలర్‌ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత పిచ్‌పై లభిస్తున్న టర్న్‌, బౌన్స్‌ను సద్వినియోగం   చేసుకుంటూ స్పిన్నర్లు కివీస్‌ను తిప్పేశారు. మిచెల్‌ (8) అక్షర్‌ ఎల్బీగా వెనక్కి పంపగా.. అశ్విన్‌ ఓ చక్కని బంతితో నికోల్స్‌ (7)ను బౌల్డ్‌ చేశాడు. కివీస్‌ 31/5తో పీకల్లోతు కష్టాల్లో   చిక్కుకోగా.. కాసేపటికే రచిన్‌ (4)ను జయంత్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత బ్లండెల్‌ (8), సౌథీ (0)ను అశ్విన్‌ ఒకే ఓవర్లో  వెనక్కి పంపాడు. జేమీసన్‌ (17) మాత్రమే కాసేపు నిలిచాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) బ్లండెల్‌ (బి) అజాజ్‌ 150; శుభ్‌మన్‌ గిల్‌ (సి) టేలర్‌ (బి) అజాజ్‌ 44; పుజారా (బి) అజాజ్‌ 0; కోహ్లి ఎల్బీ (బి) అజాజ్‌ 0; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) బ్లండెల్‌ (బి) అజాజ్‌ 18; సాహా ఎల్బీ (బి) అజాజ్‌ 27; అశ్విన్‌ (బి) అజాజ్‌ 0; అక్షర్‌ ఎల్బీ (బి) అజాజ్‌ 52; జయంత్‌ యాదవ్‌ (సి) రచిన్‌ (బి) అజాజ్‌ 12; ఉమేశ్‌ యాదవ్‌ నాటౌట్‌ 0; సిరాజ్‌ (సి) రచిన్‌ (బి) అజాజ్‌ 4; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (109.5 ఓవర్లలో ఆలౌట్‌) 325; వికెట్ల పతనం: 1-80, 2-80, 3-80, 4-160, 5-224, 6-224, 7-291, 8-316, 9-321; బౌలింగ్‌: సౌథీ 22-6-43-0; జేమీసన్‌ 12-3-36-0; అజాజ్‌ పటేల్‌ 47.5-12-119-10; సోమర్‌విలే 19-0-80-0; రచిన్‌ రవీంద్ర 4-0-20-0; మిచెల్‌ 5-3-9-0

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లేథమ్‌ (సి) శ్రేయస్‌ (బి) సిరాజ్‌ 10; విల్‌ యంగ్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 4; మిచెల్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 8; రాస్‌ టేలర్‌ (బి) సిరాజ్‌ 1; నికోల్స్‌ (బి) అశ్విన్‌ 7; బ్లండెల్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 8; రచిన్‌ (సి) కోహ్లి (బి) జయంత్‌ 4; జేమీసన్‌ (సి) శ్రేయస్‌ (బి) అక్షర్‌ 17; సౌథీ (సి) జయంత్‌ (బి) అశ్విన్‌ 0; సోమర్‌విలే (సి) సిరాజ్‌ (బి) అశ్విన్‌ 0; అజాజ్‌ పటేల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (28.1 ఓవర్లలో ఆలౌట్‌) 62; వికెట్ల పతనం: 1-10, 2-15, 3-17, 4-27, 5-31, 6-38, 7-53, 8-53, 9-62; బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 5-2-7-0; సిరాజ్‌ 4-0-19-3; అక్షర్‌ పటేల్‌ 9.1-3-14-2; అశ్విన్‌ 8-2-8-4; జయంత్‌ యాదవ్‌ 2-0-13-1

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ బ్యాటింగ్‌ 38; పుజారా బ్యాటింగ్‌ 29; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (21 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 69; బౌలింగ్‌: సౌథీ 5-0-14-0; అజాజ్‌ పటేల్‌ 9-1-35-0; జేమీసన్‌ 4-2-5-0; సోమర్‌విలే 2-0-9-0; రచిన్‌ 1-0-4-0


పుట్టిన చోటే..

ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు! క్రికెట్లో ఒక బౌలర్‌ ఈ ఘనత   సాధించడం అత్యంత అరుదు. దేశవాళీ క్రికెట్లో సైతం సాధ్యం కాని ఫీట్‌ ఇది. అందుకే 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో కేవలం ఇప్పటిదాకా ఇద్దరు మాత్రమే ఈ ఘనత అందుకోగలిగారు. ఒకరు ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ అయితే మరొకరు మన అనిల్‌ కుంబ్లే! ఇంతటి అరుదైన జాబితాలో చేరాడు న్యూజిలాండ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌. విశేషం ఏమిటంటే అజాజ్‌ భారత సంతతికి చెందినవాడే. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతంలో అజాజ్‌ పుట్టాడు. అతడి తల్లి ఉపాధ్యాయురాలు కాగా.. తండ్రి వ్యాపారం చేసేవాడు. 1996లో అజాజ్‌కు 8 ఏళ్ల వయసున్నప్పుడు అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. 5 అడుగుల 6 అంగుళాల అజాజ్‌ మొదట పేసర్‌గా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత బంతిని తిప్పడం మొదలుపెట్టాడు. కివీస్‌ మాజీ స్పిన్నర్‌ దీపక్‌ పటేల్‌ స్ఫూర్తితో స్పిన్‌లో బాగా మెరుగయ్యాడు. ఆక్లాండ్‌ జట్టుకు ఆడడం మొదలుపెట్టిన అతడు దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి 2018లో పాకిస్థాన్‌తో సిరీస్‌తో అరంగేట్రం చేశాడు. తన స్లో లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్‌తో స్థిరంగా బౌలింగ్‌ చేసే అజాజ్‌.. బంతిని ఫ్లయిట్‌ చేస్తూ ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌లో కాన్పూర్‌ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అతడు.. తన స్వస్థలం ముంబయిలో ఏకంగా ఒక ఇన్నింగ్స్‌లోనే పది వికెట్లు తీసేశాడు. పిచ్‌ ఎంత స్పిన్‌కు అనుకూలించినా.. కివీస్‌ జట్టులో ఇంకో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా కూడా అన్ని వికెట్లూ అతడే తీయగలిగాడంటే అజాజ్‌ ఎంత గొప్పగా బంతులేశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అజాజ్‌ ఇప్పటిదాకా న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఉత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన రిచర్డ్‌ హ్యాడ్లీ (9/52, ఆస్ట్రేలియాపై, 1985లో) రికార్డును బద్దలు కొట్టాడు.


పర్‌ఫెక్ట్‌ 10 క్లబ్‌లోకి స్వాగతం. అజాజ్‌ గొప్పగా బౌలింగ్‌ చేశావు. ఒకటి లేదా రెండో రోజు ఈ ఘనత సాధించడం గొప్ప విషయం. ఇకపై నీపై అంచనాలు ఇంకా పెరుగుతాయి. జనం నీ నుంచి ఇక పదులే ఆశిస్తారు.

- అనిల్‌ కుంబ్లే


నా క్రికెట్‌ కెరీర్లో ఇదో గొప్ప రోజు. బహుశా ఎప్పటికీ ఇదే గొప్ప రోజుగా ఉంటుందేమో. ఈ ఘనతను ఇంకా నమ్మలేకపోతున్నా.

- అజాజ్‌ పటేల్‌


10/10 వీరులు వీళ్లే..

1956  జిమ్‌ లేకర్‌ 10/53 ఆస్ట్రేలియాపై
1999  అనిల్‌ కుంబ్లే 10/74  పాకిస్థాన్‌పై
2021  అజాజ్‌ పటేల్‌ 10/119 భారత్‌పై

 


62

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు. భారత్‌లో ఓఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరిదే. భారత్‌పై ఓ జట్టు అత్యల్ప స్కోరు కూడా ఇదే.


28.1

తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఎదుర్కొన్న ఓవర్లు. దక్షిణాఫ్రికా (19.2), ఇంగ్లాండ్‌ (22.3) మాత్రమే ఆ జట్టు ఇంతకన్నా ఓవర్లకు ఆలౌట్‌ చేశాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని