Updated : 06 Dec 2021 06:42 IST

IND vs NZ: 5 వికెట్ల దూరంలో..

గెలుపు ముంగిట టీమ్‌ ఇండియా

కివీస్‌ లక్ష్యం 540; ప్రస్తుతం 140/5

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 276/7 డిక్లేర్డ్‌

మెరిసిన మయాంక్‌, అక్షర్‌, అశ్విన్‌

ముంబయి

మరో అయిదు.. కివీస్‌తో రెండో టెస్టులో ఘన విజయంతో సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకునేందుకు భారత్‌కు కావాల్సిన వికెట్లు! గరిష్టంగా ఇంకో రోజు.. కివీస్‌పై నెగ్గేందుకు టీమ్‌ఇండియాకు కావాల్సిన సమయం! సోమవారం లంచ్‌లోపే మ్యాచ్‌ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత్‌ విజయమిక దాదాపు లాంఛనమే. అన్ని రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కోహ్లీసేన గెలుపు ముంగిట నిలిచింది. ప్రత్యర్థికి 540 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించిన ఆతిథ్య జట్టు.. మూడో రోజు ముగిసే సరికి సగం వికెట్లు పడగొట్టింది. మిచెల్‌, నికోల్స్‌ పోరాడకుంటే కివీస్‌ కథ ఇప్పటికే ముగిసేది. జోరు మీదున్న భారత స్పిన్నర్లు నాలుగో రోజు ఎంత త్వరగా కివీస్‌ను చుట్టేస్తారన్నదే మ్యాచ్‌లో మిగిలి ఉన్న ఆసక్తి.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి చేరువైంది. ఆదివారం, మూడో రోజు 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఆట ముగిసే సమయానికి 140 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మిచెల్‌ (60; 92 బంతుల్లో 7×4, 2×6), నికోల్స్‌ (36 బ్యాటింగ్‌; 86 బంతుల్లో 7×4) రాణించారు. అశ్విన్‌ (3/27) తన స్పిన్‌ మాయాజాలంతో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. నికోల్స్‌కు తోడుగా రచిన్‌ రవీంద్ర (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 69/0తో బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌ 276/7 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9×4, 1×6) ఫామ్‌ కొనసాగించాడు. పుజారా (47; 97 బంతుల్లో 6×4, 1×6), శుభ్‌మన్‌ గిల్‌ (47; 75 బంతుల్లో 4×4, 1×6), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌; 26 బంతుల్లో 3×4, 4×6) రాణించారు. మరో నాలుగు వికెట్లు పడగొట్టిన అజాజ్‌ (4/106) మ్యాచ్‌లో మొత్తం 14 వికెట్లు తీశాడు. రచిన్‌ రవీంద్ర (3/56) కూడా బంతితో రాణించాడు.

అశ్విన్‌ మళ్లీ..: ఛేదించ సాధ్యం కాని భారీ లక్ష్యం.. ఓటమి తప్పించుకోవాలంటే దాదాపు రెండున్నర రోజులు బ్యాటింగ్‌ చేయాలి. మరోవైపు చుట్టేసేందుకు సిద్ధమైన భారత బౌలర్లు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌ కంటే మెరుగ్గా ఆడారు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ముఖ్యంగా ప్రమాదకర అశ్విన్‌ను ఎదుర్కొంటూ మ్యాచ్‌ను నాలుగో రోజుకు మళ్లించారు. రెండో సెషన్‌ చివర్లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ను అశ్విన్‌ ఆరంభంలోనే దెబ్బ తీశాడు. తన రెండో ఓవర్లోనే తాత్కాలిక కెప్టెన్‌ లేథమ్‌ (6)ను ఎల్బీగా బలిగొన్నాడు. ఈ వికెట్‌ ఇచ్చిన ఉత్సాహంతో మూడో సెషన్లోనే ప్రత్యర్థిని చుట్టేయాలని భారత్‌ అనుకుంది. యంగ్‌ (20)తో కలిసి మిచెల్‌ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ పిచ్‌ నుంచి స్పిన్‌, బౌన్స్‌ను ఉపయోగించుకుంటూ అశ్విన్‌ తన వరుస ఓవర్లలో యంగ్‌తో పాటు టేలర్‌ (6)నూ వెనక్కిపంపాడు. అతని జోరు చూస్తుంటే మూడో రోజే మ్యాచ్‌ ముగిసేలా కనిపించింది.  కానీ మన బౌలర్ల ప్రయత్నానికి మిచెల్‌, నికోల్స్‌ అడ్డుపడ్డారు. స్పిన్‌ త్రయాన్ని తట్టుకుని నిలబడ్డ ఈ జోడీ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసింది. పూర్తిగా రక్షణాత్మక ధోరణికే పరిమితం కాకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు రాబట్టింది. ముఖ్యంగా క్రీజులో కుదురుకున్నాక మిచెల్‌ స్వేచ్ఛగా పరుగులు చేశాడు. స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌తో స్పిన్నర్లపై ఆధిపత్యం చలాయించాడు. ఫోర్‌తో అర్ధశతకాన్ని అందుకున్నాడు. కానీ కొద్దిసేపటికే అక్షర్‌ (1/42) అతణ్ని ఔట్‌ చేసి 73 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ వెంటనే లేని పరుగుకు ప్రయత్నించి బ్లండెల్‌ (0) రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ ముగించేందుకు భారత్‌కు మళ్లీ అవకాశాలు కనిపించాయి. కానీ తొలి టెస్టులో భారత్‌కు విజయాన్ని దూరం చేసిన రచిన్‌ రవీంద్ర.. నికోల్స్‌తో కలిసి మరో వికెట్‌ పడనివ్వలేదు.

సమష్టిగా..: అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత బ్యాటర్లు సమష్టిగా రాణించారు. మయాంక్‌ (ఓవర్‌ నైట్‌ స్కోరు 38) మళ్లీ మెరిశాడు. పుజారా (ఓవర్‌నైట్‌ స్కోరు 29) లయ అందుకున్నట్లు కనిపించడం శుభ పరిణామం. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించారు. అజాజ్‌ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాదిన పుజారా జోరు ప్రదర్శించాడు. మరోవైపు దూకుడు మీదున్న మయాంక్‌ అజాజ్‌ బౌలింగ్‌లోనే సిక్సర్‌తో అర్ధసెంచరీ చేరుకోవడం విశేషం. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న దశలో అజాజ్‌.. భారత్‌ను దెబ్బతీశాడు. ఎడమ మణికట్టు నొప్పితోనే బ్యాటింగ్‌ చేసిన మయాంక్‌ అతడి బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ కొద్దిసేపటికే అర్ధశతకం దిశగా సాగుతున్న పుజారాను కూడా అజాజే వెనక్కి పంపాడు. మరో వైపు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌, తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన కోహ్లి (36) కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. గిల్‌ ఫామ్‌ కొనసాగించగా.. కోహ్లి ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. దీంతో భారత్‌ 142/2తో తొలి సెషన్‌ ముగించింది. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రెండో సెషన్‌లో రచిన్‌ రవీంద్ర విడగొట్టాడు. గిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా తన తొలి టెస్టు వికెట్‌ సాధించిన అతను.. తన తర్వాతి ఓవర్లో కోహ్లీని బౌల్డ్‌ చేశాడు. ఈ మధ్యలో.. వచ్చి రాగానే వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్‌ (14)ను అజాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. సాహా (13) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోవడంతో భారత్‌ ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం చేసిన అక్షర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. రచిన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. టెస్టును   ఒక్కసారిగా టీ20లా మార్చేశాడు. అతని బాదుడు కొనసాగుతుండగా.. మరో  ఎండ్‌లో జయంత్‌ (6) ఔట్‌ కాగానే భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 325;

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 62

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) యంగ్‌ (బి) అజాజ్‌ 62; పుజారా (సి) టేలర్‌ (బి) అజాజ్‌ 47; శుభ్‌మన్‌ (సి) లేథమ్‌ (బి) రవీంద్ర 47; కోహ్లి (బి) రవీంద్ర 36; శ్రేయస్‌ స్టంప్డ్‌ బ్లండెల్‌ (బి) అజాజ్‌ 14; సాహా (సి) జేమీసన్‌ (బి) రచిన్‌ 13; అక్షర్‌ నాటౌట్‌ 41; జయంత్‌ (సి) అండ్‌ (బి) అజాజ్‌ 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (70 ఓవర్లలో) 276/7 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-107, 2-115, 3-197, 4-211, 5-217, 6-238, 7-276;   బౌలింగ్‌: సౌథీ 13-1-31-0; అజాజ్‌ 26-3-106-4; జేమీసన్‌ 8-2-15-0; సోమర్‌విల్లె 10-0-59-0; రచిన్‌ 13-2-56-3

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లేథమ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 6; యంగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 20; మిచెల్‌ (సి) జయంత్‌ (బి) అక్షర్‌ 60; టేలర్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 6; నికోల్స్‌ బ్యాటింగ్‌ 36; బ్లండెల్‌ రనౌట్‌ 0; రచిన్‌ బ్యాటింగ్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (45 ఓవర్లలో 5 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-13, 2-45, 3-55, 4-128, 5-129; బౌలింగ్‌: సిరాజ్‌ 5-2-13-0; అశ్విన్‌ 17-7-27-3; అక్షర్‌ 10-2-42-1; జయంత్‌ 8-2-30-0; ఉమేశ్‌ 5-1-19-0


గాయాలతో వాళ్లిద్దరు..

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఫీల్డింగ్‌ చేసేందుకు మైదానంలోకి రాలేదు. అందుకు గాయాలే కారణం. ‘‘రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే సమయంలో మయాంక్‌ కుడి ముంజేతికి బంతి బలంగా తాకింది. ముందు జాగ్రత్త చర్యగా అతణ్ని  ఫీల్డింగ్‌కు పంపకూడదని నిర్ణయించారు. శనివారం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ క్యాచ్‌ అందుకునే క్రమంలో గిల్‌ కుడిచేతి మధ్య వేలికి గాయమైంది. అందుకే అతను కూడా ఫీల్డింగ్‌కు వెళ్లలేదు’’ అని బీసీసీఐ మీడియా బృందం తెలిపింది. మయాంక్‌, గిల్‌ స్థానాల్లో సూర్యకుమార్‌, కేఎస్‌ భరత్‌ సబ్‌స్టిట్యూట్‌లుగా ఆడారు.


4

ఈ ఏడాది అశ్విన్‌ పడగొట్టిన వికెట్ల సంఖ్య 51కి చేరుకుంది. టెస్టుల్లో ఓ క్యాలెండర్‌ ఏడాదిలో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కిది నాలుగో సారి. 2015, 2016, 2017, 2021లో ఈ ప్రదర్శన చేసిన అశ్విన్‌.. అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన భారత బౌలర్‌గా హార్భజన్‌, కుంబ్లేను వెనక్కినెట్టాడు. వాళ్లు చెరో మూడు సార్లు ఏడాదికి 50కి పైగా వికెట్లు సాధించారు.


65

న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఇప్పటివరకు అశ్విన్‌ తీసిన వికెట్లు. రెండు జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న కివీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీని అతను సమం చేశాడు.


14/225

ఈ మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ బౌలింగ్‌ గణాంకాలివి. ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా అతను  నిలిచాడు. కివీస్‌ తరపున టెస్టుల్లో అతనిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్‌ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని