Updated : 07 Dec 2021 06:37 IST

IND vs NZ: నం.1 విజయం

న్యూజిలాండ్‌ చిత్తు చిత్తు

372 పరుగులతో భారత్‌ రికార్డు గెలుపు

ముంబయి

లాంఛనం ముగిసింది. కివీస్‌తో రెండో టెస్టులో అనుకున్నట్లే టీమ్‌ఇండియా భారీ విజయాన్నందుకుంది. అది అలాంటిలాంటి గెలుపు కాదు. పరుగుల పరంగా భారత టెస్టు చరిత్రలోనే అతి పెద్దది. కొన్ని నెలల కిందటే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తమకు పరాజయాన్ని మిగిల్చిన కివీస్‌ను ఏకంగా 372 పరుగుల తేడాతో చిత్తు చేయడమే కాదు.. ఆ జట్టును వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా తిరిగి దక్కించుకుంది కోహ్లీసేన. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో మిగిలిన అయిదు వికెట్లను నాలుగో రోజు గంటలోపే పడగొట్టిన టీమ్‌ఇండియా.. సిరీస్‌ విజయాన్ని పూర్తి చేసింది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్వీన్‌ స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా.. టెస్టు సిరీస్‌నూ చేజిక్కించుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో నెగ్గింది. తొలి టెస్టులో విజయానికి వికెట్‌ దూరంలో ఆగిపోయిన భారత్‌.. రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 372 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌ను చేజిక్కించుకుంది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 140/5తో నాలుగో రోజు, సోమవారం బ్యాటింగ్‌ కొనసాగించిన ఆ జట్టు కేవలం 27 పరుగుల తేడాలో మిగతా అయిదు వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లను జయంత్‌ యాదవ్‌ (4/34) సొంతం చేసుకోవడం విశేషం. మరో వికెట్‌ను అశ్విన్‌ (4/49) సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 325 పరుగులు చేయగా.. కివీస్‌ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా 276/7 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సాధించిన భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసి, 70 పరుగులు చేసిన అశ్విన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

జయంత్‌ చకచకా..: రెండో టెస్టులో భారత్‌ ఘనవిజయంపై ఎవరికీ సందేహాలు లేవు. కాకపోతే నాలుగో రోజు కివీస్‌ కథ ఎప్పట్లోపు ముగుస్తుందా అనే అంతా చూశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలిన కివీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు కాస్త గట్టిగానే పోరాడిన నేపథ్యంలో ఆట రెండో సెషన్‌ వరకు వెళ్తుందేమో అనిపించింది. అందుకు తగ్గట్లే తొలి అరగంటలో వికెట్‌ పడలేదు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర కుదురుగా ఆడారు. రచిన్‌.. స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని అతడి రెండు ఓవర్లలో నాలుగు ఫోర్లు సాధించాడు. జయంత్‌ ప్రభావవంతంగా బౌలింగ్‌ చేస్తుండటంతో కోహ్లి అతణ్ని, అలాగే అశ్విన్‌ను కొనసాగించాడు. రెండు వైపులా ఒత్తిడి పెంచాడు. దీంతో బ్యాట్స్‌మెన్‌ తలొంచక తప్పలేదు. జయంత్‌ బౌలింగ్‌లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి రచిన్‌ (18) వెనుదిరగడంతో పతనం మొదలైంది. తన తర్వాతి ఓవర్లో జయంత్‌.. మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టాడు. జేమీసన్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను.. సౌథీ (0)ని బౌల్డ్‌ చేశాడు. జయంత్‌ తర్వాతి ఓవర్లో సోమర్‌విలీ (1) ఔటయ్యాడు. 11 బంతుల వ్యవధిలో జయంత్‌ నాలుగు వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో నికోల్స్‌ (44) స్టంపౌట్‌ కావడంతో మ్యాచ్‌ పూర్తయింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 325

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 62

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 276/7 డిక్లేర్డ్‌

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లేథమ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 6; యంగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 20; మిచెల్‌ (సి) జయంత్‌ (బి) అక్షర్‌ 60; టేలర్‌ (సి) పుజారా (బి) అశ్విన్‌ 6; నికోల్స్‌ (స్టంప్డ్‌) సాహా (బి) అశ్విన్‌ 44; బ్లండెల్‌ రనౌట్‌ 0; రచిన్‌ (సి) పుజారా (బి) జయంత్‌ 18; జేమీసన్‌ ఎల్బీ (బి) జయంత్‌ 0; సౌథీ (బి) జయంత్‌ 0; సోమర్‌విలీ (సి) మయాంక్‌ (బి) జయంత్‌ 1; అజాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12

మొత్తం: (56.3 ఓవర్లలో ఆలౌట్‌) 167

వికెట్ల పతనం: 1-13, 2-45, 3-55, 4-128, 5-129, 6-162, 7-165, 8-165, 9-167

బౌలింగ్‌: సిరాజ్‌ 5-2-13-0; అశ్విన్‌ 22.3-9-34-4; అక్షర్‌ 10-2-42-1; జయంత్‌  14-4-49-4; ఉమేశ్‌ 5-1-19-0


372

భారత్‌ గెలుపు తేడా. పరుగుల పరంగా భారత్‌కిదే టెస్టుల్లో అతి పెద్ద విజయం. 2015లో దక్షిణాఫ్రికాపై సాధించిన 337 పరుగుల గెలుపు రికార్డును అధిగమించింది. న్యూజిలాండ్‌కు పరుగుల పరంగా టెస్టుల్లో ఇదే అతి పెద్ద ఓటమి.


300

సొంతగడ్డపై అశ్విన్‌ టెస్టు వికెట్ల సంఖ్య. కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న భారత బౌలర్‌ అతనే. అశ్విన్‌కిది 81వ టెస్టు. కుంబ్లే, అశ్విన్‌ కాకుండా సొంతగడ్డపై 300 వికెట్లు పడగొట్టింది మురళీధరన్‌, అండర్సన్‌, బ్రాడ్‌, వార్న్‌ మాత్రమే.


9

అశ్విన్‌ గెలిచిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు. మురళీధరన్‌ అత్యధికంగా 11 అవార్డులు గెలవగా.. రెండో స్థానంలో ఉన్న కలిస్‌ను అశ్విన్‌ సమం చేశాడు.


52

ఈ ఏడాది అశ్విన్‌ టెస్టు వికెట్లు. 2021లో 50 వికెట్లు తీసింది అతనొక్కడే. 2015, 16, 17ల్లోనూ అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని