Rahul Dravid: కఠిన నిర్ణయాలు తప్పవు: రాహుల్‌ ద్రవిడ్‌

ముందు ముందు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొన్ని కఠిన సెలక్షన్‌ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. అయితే ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు మధ్య మంచి అవగాహన ముఖ్యమని

Updated : 07 Dec 2021 06:41 IST

ముంబయి: ముందు ముందు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కొన్ని కఠిన సెలక్షన్‌ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భారత జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. అయితే ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు మధ్య మంచి అవగాహన ముఖ్యమని అన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ మొత్తానికి రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వగా.. కోహ్లి రెండో టెస్టుకు తిరిగొచ్చాడు. మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సిరీస్‌లో చెరో సెంచరీ కొట్టారు. అయితే రహానె, పుజారా మాత్రం ఒత్తిడిలో ఉన్నారు. జట్టులో వారి స్థానాలో ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘‘ఈ సెలక్షన్‌ సంకటం, కుర్రాళ్లు రాణిస్తుండడం మంచిదే. సత్తా చాటాలని ప్రతి ఒక్కరూ బలంగా కోరుకుంటున్నారు. మేం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పకపోవచ్చు. ఆటగాళ్లతో మంచి అవగాహనతో ఉంటే, నిర్ణయాలకు కారణాలను వివరించగలిగితే ఎలాంటి సమస్యా ఉండదు’’ అని చెప్పాడు. కివీస్‌తో సిరీస్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా ఆల్‌రౌండ్‌ సత్తా చాటాడు. జయంత్‌ యాదవ్‌ రెండో టెస్టులో అయిదు వికెట్లు పడగొట్టాడు. ఆటగాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ద్రవిడ్‌ అన్నాడు. భవిష్యత్తు పర్యటనల కోసం ఆటగాళ్లను శారీరకంగా, మానసికంగా తాజాగా ఉంచడం తన ముందున్న అతి పెద్ద సవాలని అతడు చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని