
Virat Kohli - Ajinkya Rahane: రహానేకే తెలుస్తుంది
ముంబయి: రహానె ఫామ్‌ను తాను అంచనా వేయబోనని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. తన పరిస్థితేంటో అతడికి తెలుసని చెప్పాడు. ‘‘రహానె ఫామ్‌ను నేను అంచనా వేయను. ఎవరూ అంచనా వేయకూడదు. ఒక వ్యక్తి పరిస్థితి గురించి అతడికే తెలుస్తుంది’’ అని కివీస్‌పై రెండో టెస్టులో విజయం అనంతరం కోహ్లి అన్నాడు. రహానె పేలవ ఫామ్ గురించి అడిగినప్పుడు అతడిలా స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము రహానేకు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని చెప్పాడు. బయటి వ్యక్తుల వ్యాఖ్యలు తమను ప్రభావితం చేయవని కోహ్లి అన్నాడు. ‘‘జట్టులో, మా బుర్రల్లో ఏం జరుగుతుందో ఆటగాళ్లకు తెలుసు. మేం జట్టులో ప్రతి ఒక్కరికీ మద్దతునిస్తాం. అది అజింక్య కావొచ్చు లేదా ఇంకెవరైనా కావొచ్చు. బయటి జరుగుతున్న వాటి ఆధారంగా మేం నిర్ణయాలు తీసుకోం’’ అని చెప్పాడు. కివీస్‌తో సిరీస్‌లో మయాంక్ ప్రదర్శన అతడికి ఎంతో విశ్వాన్నిస్తుందని కోహ్లి తెలిపాడు. పేసర్ సిరాజ్ పరిస్థితులపై ఆధారపడి బౌలింగ్ చేసే బౌలర్ కాదని అన్నాడు. ‘‘సిరాజ్ చాలా పురోగతి సాధించాడు. అతడిలో ఎంతో నైపుణ్యం, ప్రతిభ ఉన్నాయి. అతడు బౌలింగ్ చేసే తీరు చూస్తుంటే ఎప్పుడూ వికెట్లు తీసేలాగే కనిపిస్తాడు. అతడు పరిస్థితులపై ఆధారపడడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టగలడు’’ అని కోహ్లి చెప్పాడు.