Updated : 09 Dec 2021 04:33 IST

Virat Kohli: కోహ్లీకి షాక్‌

వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపు
కొత్త సారథిగా రోహిత్‌
టెస్టు వైస్‌ కెప్టెన్‌గానూ నియామకం
దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టు ప్రకటన
దిల్లీ

పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రికార్డు పేలవంగా ఏమీ లేకపోయినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించకపోవడంతో తన సారథ్య సమర్థతపై ఎదురవుతున్న ప్రశ్నలు.. అదే సమయంలో రోహిత్‌ నాయకత్వ పటిమపై కురుస్తున్న ప్రశంసల జల్లు..! ముప్పును ముందే గ్రహించాడేమో.. రోహిత్‌కు మార్గం సుగమం చేస్తూ  కోహ్లి కొన్ని రోజుల కింద తనంతట తానే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తద్వారా వన్డే కెప్టెన్సీనైనా కాపాడుకుందామని భావించి ఉంటాడు. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. సెలక్షన్‌ కమిటీ కోహ్లీకి షాకిచ్చింది. వన్డే జట్టు నాయకుడిగా అతణ్ని తప్పించి.. ఆ బాధ్యతలనూ రోహిత్‌కే అప్పగించింది. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు అతణ్ని కెప్టెన్‌గా నియమించింది. విరాట్‌ ఇక టెస్టు కెప్టెన్‌ మాత్రమే.

టీవలే టీ20 సారథ్యాన్ని వదులుకున్న విరాట్‌ కోహ్లి ఇప్పుడు వన్డే కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. అతణ్ని బాధ్యతల నుంచి తప్పించిన జాతీయ సెలక్షన్‌ కమిటీ టీ20 సారథి రోహిత్‌ శర్మను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించింది. దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కూడా అతడికి బాధ్యతలు అప్పగించింది. ఆ పర్యటనలోనే రోహిత్‌  వన్డే సారథిగా తన ఇన్నింగ్స్‌ మొదలెడతాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో స్థానం కోల్పోయినప్పుడే రహానె వైస్‌కెప్టెన్సీ పోవడం ఖాయమైపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో అతడు, పుజారా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

రోహిత్‌ను టెస్టుల్లో ఉపసారథిగా నియమించడం సమీప భవిష్యత్తులో అతణ్ని అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా చూసే అవకాశముందనడానికి సూచిక. రహానె స్థానంలో అతడు టెస్టు ఉపసారథయ్యే అవకాశముందని ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో టెస్టులో సెంచరీ మినహా గత రెండేళ్లుగా ప్రదర్శన పేలవంగా ఉన్న నేపథ్యంలో జట్టులో రహానె స్థానంపై ప్రశ్నలు తలెత్తిన సంగతి తెలిసిందే. 2021 సీజన్‌లో 12 టెస్టుల్లో అతడి సగటు 20 లోపే. ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టడానికి ముందు రహానేకు మరో అవకాశం ఇవ్వాలని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భావించడం కూడా ప్రస్తుతానికి అతడి స్థానం నిలవడానికి ఓ కారణం. మెరుగైన ప్రదర్శన చేయకపోతే దక్షిణాఫ్రికా సిరీసే అతడికి చివరి అవకాశం కావొచ్చు. ‘‘పుజారా, కోహ్లి కూడా చాలా కాలంగా పరుగులు చేయట్లేదు. రహానే తన స్థానం నిలబెట్టుకోవడానికి అది కూడా ఓ కారణమే. మరో ఇద్దరు కూడా విఫలమవుతున్నప్పుడు కేవలం ఒక్క ఆటగాడినే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమే అవుతుంది. రహానె, పుజారాలకు మాత్రం దక్షిణాఫ్రికా పర్యటనే చివరి అవకాశమనడంలో సందేహం లేదు’’ అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి అన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు (డిసెంబరు 26, సెంచూరియన్‌)లో రహానె తుది జట్టులో ఉంటాడన్న గ్యారెంటీ లేదని చెప్పాడు. ‘‘వైస్‌ కెప్టెన్‌కు తుది జట్టులో స్థానం ఖాయం కానప్పుడు.. ఆ హోదాలో అతడు ఉండడం సమంజసం కాదు’’ అని ఆ అధికారి అన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ కాలి గాయం తిరగబెట్టడం కూడా రహానేకు మరో అవకాశం దక్కడానికి కారణమని భావిస్తున్నారు. పాజిటివ్‌ దృక్పథంతో ఆడే గిల్‌.. శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌లో బాగా ఉపయోగపడతాడన్న భావనతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది.

విహారి పునరాగమనం: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. జడేజా, అక్షర్‌ పటేల్‌, శుభ్‌మన్‌ గిల్‌ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. రహానె, పుజారాకు మరో అవకాశం దక్కగా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు లేని హనుమ విహారి పునరాగమనం చేశాడు. అతడు ఇప్పుడు భారత్‌-ఏ జట్టుతో దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. జడేజా, అక్షర్‌ లేని నేపథ్యంలో జయంత్‌ యాదవ్‌ రెండో స్పిన్నర్‌ పాత్రను పోషించనున్నాడు. వికెట్‌కీపర్‌గా కేఎస్‌ భరత్‌ ఆకట్టుకున్నప్పటికీ రెండో వికెట్‌కీపర్‌గా సాహాపై సెలక్టర్లు మరోసారి విశ్వాసం ఉంచారు. పేలవ ఫామ్‌లో ఉన్నప్పటికీ ఇషాంత్‌కు మరో అవకాశం దక్కింది. జట్టులో బుమ్రా, షమి, సిరాజ్‌, ఉమేశ్‌ ఉన్న నేపథ్యంలో తుది జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమే. మరోవైపు ప్రస్తుతం భారత్‌-ఏ జట్టుతో దక్షిణాఫ్రికాలో ఉన్న ఫాస్ట్‌బౌలర్లు సైని, దీపక్‌ చాహర్‌, అర్జాన్‌ నగ్వాస్‌వాలా.. స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు.

టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, సాహా, అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌, షమి, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌, సిరాజ్‌
స్టాండ్‌బై ఆటగాళ్లు: సైని, సౌరభ్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, అర్జాన్‌ నగ్వాస్వాలా
.


కోహ్లికి గడువిచ్చినా..

ప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లిని వన్డే సారథిగానూ తప్పుకోవాలని సెలక్టర్లు సూచిస్తూ రెండు రోజులు గడువు ఇవ్వగా.. అతడి నుంచి స్పందన లేకపోవడంతో నిర్మొహమాటంగా వేటు వేసినట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటిస్తూ.. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను ప్రకటించడం, ఈ సందర్భంగా కోహ్లి ప్రస్తావనే తేకపోవడాన్ని బట్టి ఏదో తేడా జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని