Rohit Sharma: ఆ నైపుణ్యం జట్టుకు కావాలి

భారత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీపై వన్డే కెప్టెన్‌ రోహిత్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీలోని నాణ్యమైన బ్యాటింగ్‌.. నాయకత్వ పటిమ జట్టుకు ఎంతో ముఖ్యమని తెలిపాడు.    ‘‘కోహ్లి లాంటి నాణ్యమైన బ్యాటర్‌ జట్టుకు ఎప్పటికీ అవసరమే. టీ20 ఫార్మాట్‌లో 50 కంటే ఎక్కువ సగటు ఉండటం మామూలు విషయం కాదు.

Updated : 10 Dec 2021 06:28 IST

దిల్లీ: భారత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీపై వన్డే కెప్టెన్‌ రోహిత్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీలోని నాణ్యమైన బ్యాటింగ్‌.. నాయకత్వ పటిమ జట్టుకు ఎంతో ముఖ్యమని తెలిపాడు.    ‘‘కోహ్లి లాంటి నాణ్యమైన బ్యాటర్‌ జట్టుకు ఎప్పటికీ అవసరమే. టీ20 ఫార్మాట్‌లో 50 కంటే ఎక్కువ సగటు ఉండటం మామూలు విషయం కాదు. గొప్ప ఘనత అది. తన అనుభవంతో ఎన్నోసార్లు జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించాడు’’ అని అన్నాడు.  కెప్టెన్‌గా మైదానంలో తన పాత్ర పరిమితమని.. మైదానం బయటే ఎక్కువ పని ఉంటుందని రోహిత్‌ చెప్పాడు. ‘‘సరైన ఆటగాళ్లు.. మంచి కూర్పుతో ఆడేలా కెప్టెన్‌ చూసుకోవాలి. కొన్ని వ్యూహాత్మక విషయాల్ని పర్యవేక్షించాలి. ప్రదర్శన పరంగా కెప్టెన్‌ ముందుండాలి. మిగతా అన్నింటికీ వెనుక నిలబడాలి. నా పాత్ర లోపల కంటే బయటే ఎక్కువ. సమర్థులైన ఆటగాళ్లకు సరైన పాత్రలు ఇవ్వడం  నా పని. ఇదంతా మైదానం బయట జరుగుతుంది. ఒక్కసారి మైదానంలో అడుగుపెడితే 3 గంటల సమయమే ఉంటుంది. అక్కడ మార్పులు చేసేందుకు అవకాశం చాలా తక్కువ. మైదానంలో ఆడుతున్న 11 మందినీ చూసుకోవాలి. మైదానంలో ఎక్కువగా మార్చలేం’’ అని వివరించాడు.

అందుకు సిద్ధమవుతాం:  మెగా టోర్నీల్లో కఠిన పరిస్థితులకు జట్టు ముందుగానే సిద్ధం కావడం చాలా ముఖ్యమని రోహిత్‌ తెలిపాడు. ‘‘10కే 3 వికెట్లు పడిన స్థితిలోనూ జట్టు భారీ స్కోరు చేసేందుకు అలవాటు పడాలి. అలాంటి  పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధం కావాలి. 3, 4, 5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేసేవాళ్లు అందుకు సిద్ధంగా ఉండాలి. 10/3 నుంచి 190 స్కోరు చేయడం సాధ్యం కాదని ఎక్కడా రాసిలేదు. తొలి రెండు ఓవర్లలో 10/2తో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలాంటి వ్యూహం అనుసరించాలి? అని ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితులకు తగ్గట్లుగా సిద్ధమయ్యేందుకు టీ20 ప్రపంచకప్‌కు ముందు మాకు కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి’’ అని రోహిత్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని