Rohit Sharma: గాయంతో రోహిత్‌ ఔట్‌

దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభానికి ముందే టీమ్‌ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా సఫారీలతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

Updated : 14 Dec 2021 06:43 IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరం

జట్టులోకి ప్రియాంక్‌ పాంచాల్‌

దిల్లీ

దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభానికి ముందే టీమ్‌ ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా సఫారీలతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో భారత్‌-ఏ ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టు ముంబయిలో క్వారంటైన్‌లో అడుగుపెట్టకముందు నెట్‌ సెషన్లో సాధన చేస్తుండగా రోహిత్‌ తొడకండరాల గాయం తిరగబెట్టింది. ‘‘ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమ్‌ ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తొడకండరాల గాయమైంది. దీంతో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రియాంక్‌ పాంచాల్‌ జట్టుకు ఎంపికయ్యాడు’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రోహిత్‌ స్థానంలో ఎవరు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారో బోర్డు ప్రకటించలేదు. కానీ కేఎల్‌ రాహుల్‌ రేసులో ముందున్నాడు. రిషబ్‌ పంత్‌, అశ్విన్‌ కూడా పోటీలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ జనవరి 15న ముగుస్తుంది. 19న వన్డే సిరీస్‌ మొదలవుతుంది. ప్రాక్టీస్‌ సందర్భంగా రోహిత్‌ చేతికి కూడా గాయమైంది. ‘‘రోహిత్‌ చేతికి గాయమైన మాట నిజమే. కానీ ఆ తర్వాత కూడా అతడు బ్యాటింగ్‌ చేశాడు. కాబట్టి ఆ గాయం అంత తీవ్రమైంది కాదని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత అతడి పాత తొడకండరాల గాయం తిరగబెట్టినట్లుంది. రోహిత్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి కాస్త సమయం పడుతుంది. సాధారణంగా తొడకండరాల గాయం నాలుగు వారాల్లో తగ్గుతుంది’’ అని ఓ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించాడు. రోహిత్‌ గాయం తీవ్రత ఎంతో మాత్రం ఇంకా తెలియలేదు. ‘‘వన్డే సిరీస్‌ సమయానికి రోహిత్‌ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాం. ముంబయిలోని జట్టు హోటల్‌కు రావాలని ప్రియాంక్‌తో చెప్పారు. ఇటీవల అతడు భారత్‌-ఎ తరఫున దక్షిణాఫ్రికాలో ఆడాడు. పరుగులు సాధించాడు’’ అని బీసీసీఐ అధికారి చెప్పాడు. 31 ఏళ్ల పాంచాల్‌ 100 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 7011 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు ఉన్నాయి. రోహిత్‌ తొడకండరాల గాయం వల్ల 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు టెస్టుల్లో ఆడలేకపోయాడు. భారత్‌ తరఫున 2021లో అత్యధిక టెస్టు స్కోరర్‌ రోహితే. అతడు లేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని