Sourav Ganguly: బీసీసీఐకి వదిలేయండి

టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని చెప్పినప్పుడు తనను ఎవరూ ఆపలేదని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నామని ప్రకటన విడుదల చేయడానికి గంటన్నర ముందే చెప్పారన్న టీమ్‌ఇండియా టెస్టు జట్టు కెప్టెన్‌

Updated : 17 Dec 2021 03:54 IST

కోహ్లి వ్యాఖ్యలపై సౌరభ్‌ గంగూలీ

కోల్‌కతా

టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతానని చెప్పినప్పుడు తనను ఎవరూ ఆపలేదని, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నామని ప్రకటన విడుదల చేయడానికి గంటన్నర ముందే చెప్పారన్న టీమ్‌ఇండియా టెస్టు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యలపై స్పందించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నిరాకరించాడు. ఈ అంశాన్ని బీసీసీఐ చూసుకుంటుందని అన్నాడు. ‘‘ఎలాంటి ప్రకటనలు, విలేకర్ల సమావేశాలు ఉండవు. మేం ఆ విషయాన్ని చూసుకుంటాం. దీన్ని బీసీసీఐకి వదిలేయండి’’ అని గురువారం గంగూలీ చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా బయల్దేరే ముందు టెస్టు కెప్టెన్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్‌గా కొనసాగాలని చెప్పామని గంగూలీ ఇంతకుముందు చెప్పగా.. అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు కోహ్లి చేశాడు.

తొందరపడకుండా..: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. కోహ్లీకి వ్యతిరేకంగా స్పందిస్తే అది జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. విరాట్‌ వ్యాఖ్యలపై బీసీసీఐ గుర్రుగా ఉన్నప్పటికీ వాటిపై బయట ఎవరూ స్పందించవద్దని గంగూలీ, కార్యదర్శి జై షాతో సహా బీసీసీఐ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ‘‘బీసీసీఐ అధ్యక్ష కార్యాలయ పరువు కూడా ముడిపడి ఉన్న ఈ సునిశిత అంశంలో ఎలా వ్యవహరించాలి అనే విషయంపై నిపుణుల సలహాలు తీసుకున్నారు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఆరంభం కాబోతుందని బీసీసీఐకి తెలుసు. ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా లేదా ప్రకటన జారీ చేసినా అది జట్టు స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది’’ అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. మరోవైపు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్లు బోర్డుపై, అధికారులపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకూడదు. కానీ కోహ్లి కేవలం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చాడు కానీ బోర్డుకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. దీంతో అతను నిబంధనలను ఉల్లంఘించాడా? లేదా? అన్నది కూడా ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై బీసీసీఐ వేచి చూసే ధోరణి అవలంబించనుంది.

దాదా మాట్లాడాలి: గంగూలీ వ్యాఖ్యలను కోహ్లి విభేదించిన నేపథ్యంలో ఈ విషయంలో సౌరభ్‌ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ విషయంలో ఈ భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో దాదాను కచ్చితంగా అడగాలని సన్నీ అన్నాడు. ‘‘కోహ్లి వ్యాఖ్యలు బీసీసీఐని వివాదంలోకి లాగేలా లేవని అనుకుంటున్నా. టీ20 కెప్టెన్‌గా కొనసాగమని కోహ్లికి చెప్పామని గంగూలీ చెప్పాడు. అది నిజమైతే.. కోహ్లి అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు ఎందుకు చేశాడనన్నది బీసీసీఐ అధ్యక్షుడినే ప్రశ్నించాలి’’ అని గావస్కర్‌ తెలిపాడు.

ఇది మంచిది కాదు: కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లి, బీసీసీఐకి మధ్య విభేదాలు ఉన్నట్లు అనవసరమైన వివాదం రేగడం మంచిది కాదని మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నాడు. ‘‘ఈ సమయంలో ఒకరిపై వేలెత్తి చూపడం సరికాదు. దక్షిణాఫ్రికా పర్యటన ఆరంభం కానుంది. కాబట్టి కేవలం ఆ సిరీస్‌పైనే ధ్యాస పెట్టాలి. బీసీసీఐ అధ్యక్ష పదవి గొప్పదే. కానీ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ స్థానం కూడా అత్యున్నతమైందే. కోహ్లి లేదా సౌరవ్‌ ఎవరైనా కావొచ్చు కానీ ఇలా బహిరంగంగా ఒకరిపై ఒకరు చెడుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితులను నియంత్రించి దేశం కోసం ఆలోచించడం ముఖ్యం. ఒకవేళ తప్పు జరిగితే అది తర్వాతైనా బయటపడుతుంది. కానీ ఇప్పుడు కీలకమైన పర్యటనకు ముందు ఇలా వివాదం రాజేయడం సరికాదు’’ అని కపిల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని