IND vs SA:కల నెరవేరేనా!

రెండు జట్లకూ బలమైన బౌలింగ్‌ దళాలు ఉన్నాయి. రెండు జట్లకూ బ్యాటింగ్‌లోనే అసలైన సవాల్‌. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బలమైన జట్టయితే.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి, ఇంగ్లాండ్‌లోనూ

Updated : 26 Dec 2021 06:58 IST

దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్‌ కోసం భారత్‌ ఆరాటం

సెంచూరియన్‌లో మొదటి టెస్టు నేటి నుంచే

మధ్యాహ్నం 1.30 నుంచి

రెండు జట్లకూ బలమైన బౌలింగ్‌ దళాలు ఉన్నాయి. రెండు జట్లకూ బ్యాటింగ్‌లోనే అసలైన సవాల్‌. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బలమైన జట్టయితే.. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి, ఇంగ్లాండ్‌లోనూ పైచేయి సాధించిన విశ్వాసంతో భారత్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరానికి వేళైంది. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి పోరు నేటి నుంచే. మరి సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతుందా? సఫారీ గడ్డపై తొలి సిరీస్‌ కోసం నిరీక్షణకు భారత్‌ తెరదించుతుందా?

సెంచూరియన్‌

దక్షిణాఫ్రికాలో మొట్ట మొదటిసారి టెస్టు సిరీస్‌ నెగ్గడానికి ఇదే సరైన సమయమని భావిస్తోన్న కోహ్లీసేన సత్తా చాటేందుకు సిద్ధమైపోయింది. ఆతిథ్య జట్టుతో ఆదివారం నుంచే తొలి టెస్టు. ప్రస్తుతానికి రెండు జట్లూ సమంగా కనిపిస్తున్నాయి. ఎవరిది పైచేయో చెప్పలేం. 2014 నుంచి దక్షిణాఫ్రికా సెంచూరియన్‌లో ఓడిపోని నేపథ్యంలో భారత జట్టుకు గట్టి సవాలు తప్పదు. ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

ఎంపిక సవాలే..

సిరీస్‌ విజయం కోసం తహతహలాడుతున్న టీమ్‌ఇండియాకు అసలు బరిలోకి దిగడానికి ముందే జట్టు కూర్పే పెద్ద సమస్యగా మారింది. భారత్‌ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ బరిలోకి దిగే అవకాశముందని కేల్‌ రాహుల్‌ ఇప్పటికే చెప్పాడు. రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా. ఆ తర్వాత పుజారా, కోహ్లి రావడం లాంఛనమే. ఆరో స్థానంలో వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు వస్తాడు. అయిదో స్థానంలో ఎవరిని దించాలన్నదే కోహ్లీకి పరీక్ష. భారత్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రహానె, హనుమ విహారి పోటీలో ఉన్నారు. ఇక జట్టు సమతూకం కోసం బ్యాటింగ్‌ కూడా వచ్చిన శార్దూల్‌ను తీసుకునే అవకాశం మెండుగా ఉన్న నేపథ్యంలో నాలుగో పేసర్‌గా సిరాజ్‌, ఇషాంత్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సివుంటుంది. ఇటీవల కాలంలో శార్దూల్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఇషాంత్‌ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. తుది జట్టు ఎంపిక జట్టు మేనేజ్‌మెంట్‌కు అంత తేలికేమీ కాదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ముంబయి టెస్టు కోసం.. చిన్న చిన్న గాయాలను కారణంగా చూపి రహానె, ఇషాంత్‌కు విశ్రాంతినిచ్చారు. ఆదివారం తుది జట్టులో లేకుంటే మాత్రం వారిని తప్పించినట్లే లెక్క. భారత్‌లో వారిని అనధికారికంగా పక్కన పెట్టారు కానీ.. ఇప్పుడు తీసుకోకపోతే అధికారికంగా పక్కనపెట్టినట్లవుతుంది. తుది జట్టులో ఎవరున్నా.. బుమ్రా, షమి నాయకత్వంలో భారత బౌలింగ్‌ బలంగా ఉందనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో సత్తా చాటిన ఈ బౌలర్లు దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో మరింత విజృంభిస్తారనే అంచనాలు ఉన్నాయి. జట్టు వారిపై భారీ ఆశలే పెట్టుకుంది. మన బ్యాట్స్‌మెన్‌కే పరీక్ష. పేస్‌ పిచ్‌లపై ఆతిథ్య జట్టు పేస్‌ బౌలర్లను ఎదుర్కోవడం తేలిక కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. మిడిల్‌ ఆర్డర్‌తోనే ప్రధాన సమస్య. ముఖ్యంగా పేలవ ఫామ్‌, బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో దృష్టంతా కెప్టెన్‌ కోహ్లీపైనే. అతడు శతకం చేసిన రెండేళ్లు దాటిపోయింది. ఈ ఏడాది సగటు 28.41. కోహ్లి రాణించడం భారత్‌ అవకాశాలకు చాలా కీలకం. కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేయడం, ఒత్తిడిని అధిగమించి పూర్వపు ఫామ్‌ను అందుకోవడం అతడికి సవాలే. కెరీర్‌ డోలాయమానంలో ఉన్న నేపథ్యంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారాపై కూడా రాణించాలనే ఒత్తిడి ఉంది.

వారితో ప్రమాదమే

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడైన అన్రిచ్‌ నార్జ్‌ గాయంతో మ్యాచ్‌కు దూరం కావడం ఎదురుదెబ్బే అయినా.. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ సమస్యలు సృష్టించే సత్తా రబాడ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా బౌలింగ్‌ విభాగానికి ఉంది. ఒలివర్‌, ఎంగిడిలతో కలిసి రబాడ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించనున్నాడు. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తే కేశవ్‌ మహరాజ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే నిలకడలేని బ్యాటింగ్‌ ఆతిథ్య జట్టుకు ప్రతికూలాంశం. ఓపెనర్లు కెప్టెన్‌ ఎల్గర్‌, మార్‌క్రమ్‌లపై దక్షిణాఫ్రికా చాలా ఆశలే పెట్టుకుంది. జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన వీరిపైనే బ్యాటింగ్‌ భారం ప్రధానంగా నిలవనుంది. వీరిని త్వరగా ఔట్‌ చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను గట్టి దెబ్బ తీసినట్లే. వికెట్‌కీపర్‌ డికాక్‌ రాణించడం కూడా ఆ జట్టుకు కీలకం. ఆల్‌రౌండర్‌ వివాన్‌ ముల్దర్‌ను దక్షిణాఫ్రికా నాలుగో సీమర్‌గా ఆడించే అవకాశం ఉంది. అతడు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. కీగన్‌ పీటర్సన్‌కు భారత బౌలింగ్‌ కొత్త. అతను బుమ్రా బృందాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

తుది జట్లు

భారత్‌ (అంచనా): కేల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, కోహ్లి, విహారి/రహానె/శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమి, బుమ్రా, సిరాజ్‌/ఇషాంత్‌

దక్షిణాఫ్రికా (అంచనా): ఎల్గర్‌, మార్‌క్రమ్‌, కీగన్‌ పీటర్సన్‌, వాండర్‌ డసెన్‌, బవుమా, డికాక్‌, వియాన్‌ ముల్డర్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ, ఎంగిడి, ఒలివర్‌


పిచ్‌.. వాతవరణం

పిచ్‌పై ప్రస్తుతం చాలా పచ్చిక ఉంది. మ్యాచ్‌ సమయానికి దాన్ని కత్తిరించవచ్చు. పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలించనుంది. తొలి రెండు రోజుల్లో వర్షం వల్ల ఆటకు అంతరాయాలు కలగొచ్చు. కానీ ఆ తర్వాత అయిదో రోజు వరకు వాతావరణం బాగుంటుంది. ఎండ కాస్తుంది.


2

ప్రస్తుత మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్‌లో భారత్‌ ఆడిన టెస్టులు. 2010లో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఓటమి పాలైన భారత్‌.. 2018లో 135 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.


7

సఫారీ గడ్డపై భారత్‌ ఆడిన టెస్టు సిరీస్‌లు. 2010-11 సిరీస్‌ 1-1తో డ్రా కాగా.. మిగతా ఆరు సిరీస్‌లనూ దక్షిణాఫ్రికానే గెలిచింది.


20

దక్షిణాఫ్రికాలో భారత్‌ ఆడిన టెస్టులు. మూడు మాత్రమే నెగ్గి, 10 ఓడింది. ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


21

సెంచూరియన్‌లో జరిగిన 26 టెస్టుల్లో దక్షిణాఫ్రికా గెలిచిన మ్యాచ్‌లు. 2 టెస్టులు ఓడగా.. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.


* ప్రస్తుత దక్షిణాఫ్రికా జట్టులోని బ్యాట్స్‌మెన్‌లో డికాక్‌, ఎల్గర్‌ మాత్రమే గత మూడేళ్లలో సొంతగడ్డపై శతకాలు సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని