Harbhajan Singh:ఎందుకు తప్పించారో ఏమో?

అనామకుడిగా ఉన్న స్థాయి నుంచి తనను చేయి పట్టుకుని నడిపించిన ఘనత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీదేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్‌ అయ్యాక ‘ఎవరో’ అన్నట్లు తన  

Updated : 27 Dec 2021 07:04 IST

దిల్లీ: అనామకుడిగా ఉన్న స్థాయి నుంచి తనను చేయి పట్టుకుని నడిపించిన ఘనత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీదేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్‌ అన్నాడు. మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్‌ అయ్యాక ‘ఎవరో’ అన్నట్లు తన  పరిస్థితి మారిపోయిందని భజ్జీ తెలిపాడు.  ‘‘కెరీర్‌లో అనామకుడిగా ఉన్న సమయంలో గంగూలీ నాకు చేయి అందించాడు. ధోని సారథి అయ్యే సమయానికి నాకొక గుర్తింపు ఉంది. ఈ తేడాను మీరు అర్థం చేసుకోవాలి. నాలో నైపుణ్యాలు ఉన్నాయని దాదాకు తెలుసు. కానీ సత్తాచాటగలనో లేదో అతనికి తెలియదు. ధోని విషయానికొస్తే నేను ఎప్పట్నుంచో జట్టులో ఉన్నానని.. సత్తా చాటానని అతనికి తెలుసు. ధోని కంటే ముందు మ్యాచ్‌లు గెలిపించానని అతనికి అవగాహన ఉంది. అతని కోసం కూడా కొన్ని మ్యాచ్‌లు గెలుస్తాననీ తెలుసు. జీవితంలో, వృత్తిలో సరైన సమయంలో మార్గనిర్దేశనం చేసే వ్యక్తి కావాలి. నా విషయంలో గంగూలీ అలాంటి వ్యక్తే. గంగూలీ నా కోసం పోరాడకుండా.. జట్టులోకి ఎంపిక చేయకుండా ఉండుంటే ఈరోజు నా ఇంటర్వ్యూ తీసుకునేవారు కాదేమో. నన్ను తీర్చిదిద్దిన నాయకుడు గంగూలీ. నేను ఈస్థాయిలో ఉండటానికి దాదానే కారణం. 400 వికెట్లు తీసిన ఆటగాడికి అవకాశం లభించనప్పుడు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం తెలియనప్పుడు మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. టీమ్‌ఇండియా నుంచి నన్ను ఎందుకు తొలగించారని చాలామందిని అడిగా. కానీ నాకు సమాధానం రాలేదు. సరైన సమయంలో మద్దతు లభించి ఉండుంటే 500-550 వికెట్లు తీశాక ఇంకాస్త ముందుగానే రిటైరయ్యేవాడిని. 31 ఏళ్ల వయసులో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నా. మరో 3-4 ఏళ్లు ఆడుంటే 500 వికెట్లు తీసేవాడినే. కానీ అలా జరగలేదు. అకస్మాత్తుగా నన్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదో ఎవరూ చెప్పలేదు. 400 వికెట్లు తీసిన ఆటగాడికే ఈ పరిస్థితి ఎదురైతే 40 వికెట్ల బౌలర్‌ను ఎవరూ అడగరు. ఎంతో కొంత సాధించిన వ్యక్తితో అతనికి అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం భారత క్రికెట్లోని విషాదకర పరిస్థితికి నిదర్శనం’’ అని భజ్జీ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని