Ravi Shastri - Virat Kohli:కెప్టెన్‌గా తప్పించడం కోహ్లీకి వరం

వన్డే కెప్టెన్‌గా కోహ్లీని సెలక్టర్లు తప్పించడం అతనితో పాటు  రోహిత్‌కు వరంగా మారే అవకాశం ఉందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేసిన కోహ్లీని ఇటీవల వన్డే జట్టు సారథిగానూ తొలగించిన సంగతి తెలిసిందే.

Updated : 27 Dec 2021 07:07 IST

దిల్లీ: వన్డే కెప్టెన్‌గా కోహ్లీని సెలక్టర్లు తప్పించడం అతనితో పాటు  రోహిత్‌కు వరంగా మారే అవకాశం ఉందని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేసిన కోహ్లీని ఇటీవల వన్డే జట్టు సారథిగానూ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఫార్మాట్లలో ఇప్పుడు రోహిత్‌ నాయకుడిగా ఉన్నాడు. టెస్టుల్లో విరాట్‌ జట్టును నడిపిస్తున్నాడు. అయితే వన్డే సారథిగా తప్పించడంపై కోహ్లి, బీసీసీఐ మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై తొలిసారి రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ముందుకు సాగేందుకు ఇది సరైన మార్గమే. విరాట్‌, రోహిత్‌లకు ఇది మరో రూపంలో వరంగా మారొచ్చు. ఈ బయో బబుల్‌ సమయంలో మూడు ఫార్మాట్లలోనూ ఒక్కరే కెప్టెన్‌గా ఉండడం అంత సులభం కాదు. ఇప్పుడు కోహ్లి టెస్టులపై పూర్తి దృష్టి పెట్టి తాను అనుకున్నంత కాలం జట్టును నడిపించొచ్చు. ఇంకో అయిదారేళ్ల పాటు ఆడతాడు కాబట్టి తన ఆట గురించి ఆలోచించుకునేందుకు ఇప్పుడు కోహ్లీకి సమయం దొరకుతుంది’’ అని చెప్పాడు. కెరీర్‌ ఆరంభంలోనే కోహ్లి ప్రతిభను తాను గుర్తించినట్లు రవిశాస్త్రి వెల్లడించాడు. ‘‘2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో కోహ్లి విఫలమయ్యాడు. అప్పుడు అక్కడే ఉండి తన ఆట చూసే అవకాశం దక్కింది. అతనో ముడి వజ్రమని నాకప్పుడే అర్థమైంది. కెప్టెన్‌గా ధోని తప్పుకోగానే ఆ బాధ్యతలు స్వీకరించి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నేను, కోహ్లి దూకుడుగా ఉంటాం. గెలుపు కోసమే ఆడాలనుకున్నాం. అందుకు టెస్టుల్లో 20 వికెట్లు తీయడం అవసరమని గ్రహించాం. ఆ దిశగా అవసరమైన బౌలర్లను గుర్తించి ప్రోత్సహించాం’’ అని అతను పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని