IND vs SA:రెండో రోజు ఆట వర్షార్పణం

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టుకు వర్షం దెబ్బ. ఎడతెరపిలేని వర్షం కారణంగా రెండో రోజు, సోమవారం ఆట ఒక్క బంతీ పడకుండానే రద్దయింది. ఉదయం జల్లులుగా మొదలైన వాన.. మధ్యాహ్నానికి కుండపోతగా మారింది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో  272/3తో పటిష్ట స్థితిలో నిలిచిన కోహ్లీ సేనకు ఒక రోజు

Updated : 28 Dec 2021 06:53 IST

భారత్‌ ×  దక్షిణాఫ్రికా తొలి టెస్టు
సెంచూరియన్‌

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టుకు వర్షం దెబ్బ. ఎడతెరపిలేని వర్షం కారణంగా రెండో రోజు, సోమవారం ఆట ఒక్క బంతీ పడకుండానే రద్దయింది. ఉదయం జల్లులుగా మొదలైన వాన.. మధ్యాహ్నానికి కుండపోతగా మారింది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో  272/3తో పటిష్ట స్థితిలో నిలిచిన కోహ్లీ సేనకు ఒక రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం నిరాశ కలిగించే విషయమే.. సోమవారం రెండు సార్లు వర్షం తగ్గింది. అంపైర్లు మైదానాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించారు. కానీ రెండు సార్లు అంపైర్లు మైదానంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతుండగా వర్షం తిరిగి మొదలైంది. ‘‘దురదృష్టవశాత్తు భారీ వర్షం  కారణంగా సెంచూరియన్‌లో రెండో రోజు ఆట రద్దయింది’’ అని ట్విట్టర్లో బీసీసీఐ పేర్కొంది. పూర్తిగా తడిసిపోయిన మైదానం చిత్రాలను పెట్టింది. చివరికి వర్షం తగ్గినా.. కవర్లపై నీళ్లు చాలా ఎక్కువగా ఉండడం, ఎండ లేని కారణంగా మైదానం ఆరే అవకాశం లేకపోవడంతో కొన్ని ఓవర్ల ఆటయినా ఆడించడం సాధ్యం కాలేదు. ఆటను రద్దు చేయక తప్పలేదు. రెండో రోజు ఆట ముగిసేనాటికి కేఎల్‌ రాహుల్‌ (122 బ్యాటింగ్‌; 248 బంతుల్లో 17×4, 1×6), రహానె (40 బ్యాటింగ్‌; 81 బంతుల్లో 8×4) అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. విలువైన భాగస్వామ్యాలతో జట్టును భారీ స్కోరు దిశగా నడిపించిన రాహుల్‌.. టెస్టుల్లో ఏడో శతకం సాధించాడు. ఓపెనర్‌ మయాంక్‌ 60, కోహ్లి 35 పరుగులు చేశారు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ పుజారా డకౌటయ్యాడు. ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టాడు. మూడు, నాలుగో రోజు ఆటకు వర్షం వల్ల ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. కానీ అయిదో రోజు మళ్లీ వర్షం ముప్పు పొంచి ఉంది. కాబట్టి ఫలితం రాబట్టే అవకాశాలు మరింత తగ్గుతాయన్నమాట. మ్యాచ్‌లో మెరుగైన స్థితిలో ఉన్న టీమ్‌ఇండియా ఫలితం కోసం ఏం చేస్తుందో చూడాలి. మరోసారి బ్యాటింగ్‌ దిగాల్సిన అవసరం లేనంత స్కోరు చేయాలని జట్టు భావిస్తుందనడంలో సందేహం లేదు.

సన్నీ తర్వాత రాహులే
టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.. ఆసియా అవతల అత్యధిక టెస్టు శతకాలు సాధించిన భారత ఓపెనర్లలో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తర్వాతి స్థానానికి చేరుకున్నాడు. ఉపఖండం బయట గావస్కర్‌ అత్యధికంగా 15 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్‌ అయిదో శతకంతో రెండో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రాహుల్‌ తొలి రోజు ఆటలో 122 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తంగా అతడికిది ఏడో సెంచరీ కాగా.. ఆసియా అవతల అయిదోది. ఉపఖండం బయట అత్యధిక శతకాలు సాధించిన భారత ఓపెనర్లలో ఇన్నాళ్లూ సన్నీ తర్వాతి స్థానం సెహ్వాగ్‌ (4)దే. ఇప్పుడు రాహుల్‌ అతణ్ని అధిగమించాడు. టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తయిన రోజే రాహుల్‌ తన ఏడో శతకాన్ని అందుకోవడం మరో విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని