Team India U19: సెమీస్‌లో యువ భారత్‌

అండర్‌-19 ఆసియా కప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ భారత్‌ గట్టెక్కింది. పాకిస్థాన్‌ చేతిలో 52 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్థాన్‌పై సులువుగా నెగ్గేస్తుందనుకున్న భారత్‌కు కష్టాలు తప్పలేదు. ప్రత్యర్థి జట్టు ఏకంగా 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి భారత కుర్రాళ్లకు సవాలు  విసిరింది.

Updated : 28 Dec 2021 06:56 IST

అఫ్గాన్‌పై కష్టంగా విజయం
దుబాయ్‌

అండర్‌-19 ఆసియా కప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ భారత్‌ గట్టెక్కింది. పాకిస్థాన్‌ చేతిలో 52 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్థాన్‌పై సులువుగా నెగ్గేస్తుందనుకున్న భారత్‌కు కష్టాలు తప్పలేదు. ప్రత్యర్థి జట్టు ఏకంగా 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి భారత కుర్రాళ్లకు సవాలు  విసిరింది. 197 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో భారత్‌కు ఓటమి తప్పదేమో అనిపించింది. కానీ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు రాజ్‌ బవా (43 నాటౌట్‌; 55 బంతుల్లో 2×4), కౌశల్‌ తంబె (35 నాటౌట్‌; 29 బంతుల్లో 4×4) ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. అంతకుముందు ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌ (65; 74 బంతుల్లో 9×4), రఘువంశీ (35; 47 బంతుల్లో 5×4) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించి జట్టుకు మంచి ఆరంభాన్నివ్వగా.. నూర్‌ అహ్మద్‌ (4/43) 12 పరుగుల తేడాలో వీళ్లిద్దరినీ ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ (6) ఎక్కువ సేపు నిలవలేదు. ఈ స్థితిలో కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (26), నిషాంత్‌ (19) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీళ్లిద్దరితో పాటు ఆరాధ్య యాదవ్‌ (12) కూడా తక్కువ వ్యవధిలో ఔటవడంతో భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. అయితే రాజ్‌, కౌశల్‌ ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా పోరాడి మరో వికెట్‌ పడకుండానే జట్టును గెలిపించారు. భారత్‌ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు అఫ్గాన్‌ 4 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఆ జట్టులో ఇజాజ్‌ అహ్మద్‌ (86 నాటౌట్‌; 68 బంతుల్లో 1×4, 7×6) సులేమాన్‌ సఫి (73; 86 బంతుల్లో 7×4, 1×6) సత్తా చాటారు. కౌశల్‌ తంబె (1/25), రాజ్‌ బవా   (1/66) బౌలింగ్‌లోనూ రాణించారు.

అఫ్గానిస్థాన్‌: 259/4 (ఇజాజ్‌ అహ్మద్‌ 86 నాటౌట్‌, సులేమాన్‌ సఫి 73; కౌశల్‌ తంబె 1/25, విక్కీ ఒస్త్‌వాల్‌ 1/35)
భారత్‌: 48.2 ఓవర్లలో 262/6 (హర్నూర్‌ సింగ్‌ 65, రఘువంశీ 35, యశ్‌ ధూల్‌ 26, రాజ్‌ బవా 43 నాటౌట్‌, కౌశల్‌ తంబె 35 నాటౌట్‌; నూర్‌ అహ్మద్‌ 4/43)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని