Ashes Series:కంగారూల గుప్పిట్లో యాషెస్‌

యాషెస్‌ సిరీస్‌లో మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం చలాయిస్తూ విజయానికి బాట వేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 61/1తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు 267 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ హారిస్‌ (76; 189 బంతుల్లో 7×4) ఫామ్‌ అందుకున్నాడు.

Updated : 28 Dec 2021 06:54 IST

ఆస్ట్రేలియాకు 82 పరుగుల ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 31/4
మెల్‌బోర్న్‌

సొంతగడ్డపై కంగారూ జట్టు దూసుకెళ్తోంది. ప్రతిష్ఠాత్మక యాషెస్‌ ట్రోఫీని తన దగ్గరే అట్టిపెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన ఆసీస్‌.. మూడో పోరులోనూ ఇంగ్లాండ్‌ను చిత్తుచేసే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. ఆ తర్వాత 31కే నాలుగు వికెట్లు పడగొట్టి రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టింది. ఆ జట్టు జోరు చూస్తుంటే మూడో రోజే మ్యాచ్‌ ముగిసేలా కనిపిస్తోంది.

యాషెస్‌ సిరీస్‌లో మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం చలాయిస్తూ విజయానికి బాట వేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 61/1తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు 267 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ హారిస్‌ (76; 189 బంతుల్లో 7×4) ఫామ్‌ అందుకున్నాడు. ఇంగ్లిష్‌ సీనియర్‌ పేసర్‌ అండర్సన్‌ (4/33) సత్తాచాటగా.. రాబిన్సన్‌ (2/64), మార్క్‌వుడ్‌ (2/71) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 82 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో 31/4తో నిలిచింది. స్టార్క్‌ (2/11)తో పాటు అరంగేట్ర పేసర్‌ బోలాండ్‌ (2/1) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. కెప్టెన్‌ రూట్‌ (12 బ్యాటింగ్‌), స్టోక్స్‌ (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ఇంకా 51 పరుగులు వెనకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం ఖాయంగా కనిపిస్తోన్న నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరగాలంటే రూట్‌, స్టోక్స్‌తో పాటు బ్యాటింగ్‌కు రావాల్సి ఉన్న బట్లర్‌, బెయిర్‌స్టో గొప్పగా పోరాడాల్సిందే.

హారిస్‌ ఎట్టకేలకు..: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ హారిస్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు. కొంత కాలంగా ఫామ్‌ లేమితో సతమతవుతున్న అతను.. ఎట్టకేలకు అర్ధసెంచరీతో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట ఆరంభమైన తర్వాత నాలుగో ఓవర్లోనే నైట్‌ వాచ్‌మన్‌ లైయన్‌ (10)ను వెనక్కిపంపి రాబిన్సన్‌ దాడి మొదలెట్టాడు. ఫామ్‌లో ఉన్న లబుషేన్‌ (1)ను పెవిలియన్‌ చేర్చి మార్క్‌వుడ్‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో బ్యాటింగ్‌ చేసిన హారిస్‌.. స్మిత్‌ (16)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడినపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అండర్సన్‌ ఓ చక్కటి బంతితో స్మిత్‌ను బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ తిరిగి పోటీలోకి వచ్చినట్లు కనిపించింది. మంచి లైన్‌, లెంగ్త్‌తో సరైన ప్రదేశాల్లో బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను అండర్సన్‌ పరీక్షించాడు. కానీ హారిస్‌ మాత్రం పట్టుదలగా క్రీజులో పాతుకుపోయాడు. క్లిష్ట పరిస్థితుల్లో గొప్ప ప్రదర్శనతో జట్టు స్కోరుబోర్డును నడిపించాడు. అతనికి హెడ్‌ (27) సహకరించడంతో 131/4తో ఆసీస్‌ తొలి సెషన్‌ను ముగించింది. రెండో సెషన్లో హారిస్‌, హెడ్‌ జోడీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. ముఖ్యంగా అర్ధసెంచరీ అందుకున్న తర్వాత హారిస్‌ చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతున్న దశలో హెడ్‌ను రాబిన్సన్‌ ఔట్‌ చేయడం.. ఆ కొద్దిసేపటికే హారిస్‌ను అండర్సన్‌ వెనక్కి పంపడంతో ఆసీస్‌ కష్టాల్లో పడింది. గ్రీన్‌ (17), కేరీ (19) కూడా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. కానీ కెప్టెన్‌ కమిన్స్‌ (21),  స్టార్క్‌ (24 నాటౌట్‌) కొన్ని కీలక పరుగులు చేయడంతో ఆధిక్యం 80 దాటింది.

ఆనందం ఆవిరి..: తొలి ఇన్నింగ్స్‌లో  ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశామనే ఇంగ్లాండ్‌ ఆనందం ఆవిరి కావడానికి ఎక్కువ సేపు పట్టలేదు. రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోసారి టాప్‌ఆర్డర్‌ దారుణంగా విఫలమైంది. ప్రత్యర్థి పేసర్ల ధాటికి నిలవలేకపోయింది. స్టార్క్‌ తన మూడో ఓవర్లో వరుస బంతుల్లో ఓపెనర్‌ క్రాలీ (5)తో పాటు ఫామ్‌లో ఉన్న మలన్‌ (0)ను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఆ దశలో మరో ఓపెనర్‌ హమీద్‌ (7) జతగా రూట్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ బౌలింగ్‌కు వస్తూనే బోలాండ్‌ తన తొలి ఓవర్లోనే హమీద్‌తో పాటు నైట్‌ వాచ్‌మన్‌ లీచ్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆసీస్‌ ఆనందంలో మునిగిపోగా.. ఇంగ్లాండ్‌ నిరాశలో కూరుకుపోయింది.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 185 ఆలౌట్‌; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 76; వార్నర్‌ (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 38; లైయన్‌ (సి) బట్లర్‌ (బి) రాబిన్సన్‌ 10; లబుషేన్‌ (సి) రూట్‌ (బి) మార్క్‌వుడ్‌ 1; స్మిత్‌ (బి) అండర్సన్‌ 16; హెడ్‌ (సి) రూట్‌ (బి) రాబిన్సన్‌ 27; గ్రీన్‌ ఎల్బీ (బి) లీచ్‌ 17; కేరీ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 19; కమిన్స్‌ (సి) హమీద్‌ (బి) అండర్సన్‌ 21; స్టార్క్‌ నాటౌట్‌ 24; బోలాండ్‌ (సి) క్రాలీ (బి) మార్క్‌వుడ్‌ 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (87.5 ఓవర్లలో ఆలౌట్‌) 267; వికెట్ల పతనం: 1-57, 2-76, 3-84, 4-110, 5-171, 6-180, 7-207, 8-219, 9-253; బౌలింగ్‌: అండర్సన్‌ 23-10-33-4; రాబిన్సన్‌ 19.2-4-64-2; మార్క్‌వుడ్‌ 19.5-2-71-2; స్టోక్స్‌ 10.4-1-27-1; లీచ్‌ 15-0-46-1
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: హమీద్‌ (సి) కేరీ (బి) బోలాండ్‌ 7; క్రాలీ (సి) కేరీ (బి) స్టార్క్‌ 5; మలన్‌ ఎల్బీ (బి) స్టార్క్‌ 0; రూట్‌ బ్యాటింగ్‌ 12; లీచ్‌ (బి) బోలాండ్‌ 0; స్టోక్స్‌ బ్యాటింగ్‌ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (12 ఓవర్లలో 4 వికెట్లకు) 31; వికెట్ల పతనం: 1-7,   2-7, 3-22, 4-22; బౌలింగ్‌: స్టార్క్‌ 5-2-11-2; కమిన్స్‌ 6-3-14-0; బోలాండ్‌ 1-0-1-2


మళ్లీ కరోనా కలకలం

యాషెస్‌ సిరీస్‌లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఓ దశలో మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభవుతుందో లేదో అనే సందేహాలు కలిగాయి. ఇంగ్లాండ్‌ శిబిరంలోని ఇద్దరు సహాయక సిబ్బందితో పాటు వాళ్ల కుటుంబాల్లోని ఇద్దరు సభ్యులకు ర్యాపిడ్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ కోసం స్టేడియానికి వెళ్లేందుకు హోటల్‌ దగ్గర బస్సెక్కిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను కిందికి దించి మరీ అందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో సోమవారం ఆట 30 నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైంది. ఆటగాళ్ల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ అందులో ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే మ్యాచ్‌ను అర్ధంతరంగా నిలిపేసే అవకాశముంది. ఇప్పటికే వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందుకు ఆసీస్‌ సారథి కమిన్స్‌ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
‘‘మ్యాచ్‌ కోసం స్టేడియానికి వెళ్లేందుకు బస్సెక్కిన తర్వాత మమ్మల్ని దించి పరీక్షలు నిర్వహించారు. ఆ  ఫలితాలు ఎలా వస్తాయోనని ఎదురు చూస్తున్నాం. సోమవారం మైదానంలో ఉన్న ఎవరికీ కరోనా సోకలేదు. అలాంటప్పుడు మ్యాచ్‌ కొనసాగించడంలో సమస్య లేదు’’ అని ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్‌ తెలిపాడు. మరోవైపు వచ్చే నెల 5న సిడ్నీలో ఆరంభం కావాల్సిన నాలుగో టెస్టును మెల్‌బోర్న్‌లోనే  నిర్వహించాలని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ పేర్కొన్నాడు. కానీ సీఏ సీఈవో నిక్‌ హాక్లీ మాత్రం నాలుగు, అయిదో టెస్టులు షెడ్యూల్‌ ప్రకారం వరుసగా సిడ్నీ, హోబర్ట్‌లోనే జరుగుతాయని స్పష్టం చేశాడు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని