IND vs SA: భారత్‌ విజయానికి 6 వికెట్లే

సెంచూరియన్‌ టెస్టుపై టీమ్‌ ఇండియా గట్టిగా పట్టుబిగించింది. ఇక విజయానికి కావాల్సింది 6 వికెట్లే. నాలుగో రోజు బ్యాటుతో తడబడ్డా కఠిన లక్ష్యాన్నే నిర్దేశించిన కోహ్లీసేన.. అనంతరం బంతితో దక్షిణాఫ్రికాను దెబ్బతీసింది. ఆతిథ్య జట్టు కాస్త పోరాడింది కానీ వంద లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. బుమ్రా పదునైన పేస్‌తో ఆకట్టుకున్నాడు. భారత్‌ విజయాన్ని అడ్డుకోవాలంటే దక్షిణాఫ్రికా అసాధారణంగా పోరాడాల్సిందే. సెంచూరియన్‌లో ఓ జట్టు అత్యధికంగా ఛేదించిన లక్ష్యం 251. అయితే ఆఖరి రోజు...

Updated : 30 Dec 2021 06:42 IST

గెలుపు బాటలో కోహ్లీసేన
దక్షిణాఫ్రికా లక్ష్యం 305;  ప్రస్తుతం 94/4
రాణించిన బుమ్రా
సెంచూరియన్‌

సెంచూరియన్‌ టెస్టుపై టీమ్‌ ఇండియా గట్టిగా పట్టుబిగించింది. ఇక విజయానికి కావాల్సింది 6 వికెట్లే. నాలుగో రోజు బ్యాటుతో తడబడ్డా కఠిన లక్ష్యాన్నే నిర్దేశించిన కోహ్లీసేన.. అనంతరం బంతితో దక్షిణాఫ్రికాను దెబ్బతీసింది. ఆతిథ్య జట్టు కాస్త పోరాడింది కానీ వంద లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. బుమ్రా పదునైన పేస్‌తో ఆకట్టుకున్నాడు. భారత్‌ విజయాన్ని అడ్డుకోవాలంటే దక్షిణాఫ్రికా అసాధారణంగా పోరాడాల్సిందే. సెంచూరియన్‌లో ఓ జట్టు అత్యధికంగా ఛేదించిన లక్ష్యం 251. అయితే ఆఖరి రోజు వాతావరణం ఆటకు ఏ మేర సహకరిస్తుందన్నదే ప్రశ్న!

తొలి టెస్టులో భారత జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. 305 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు, బుధవారం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. షమి, సిరాజ్‌ చెరో వికెట్‌ చేజిక్కించుకున్నారు. ఎల్గర్‌ (52 బ్యాటింగ్‌; 122 బంతుల్లో 7×4) పోరాడుతున్నాడు. అంతకుముందు కోహ్లీసేన బ్యాటుతో తడబడింది. ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌..  రబాడ   (4/42), జాన్సన్‌ (4/55), ఎంగిడి (2/31) ధాటికి 174 పరుగులకే ఆలౌటైంది. మిడిల్‌ ఆర్డర్‌ మరోసారి నిరాశపరిచింది. పంత్‌ (34; 34 బంతుల్లో 6×4) టాప్‌ స్కోరర్‌. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో నెగ్గాలంటే దక్షిణాఫ్రికాకు 211 పరుగులు.. భారత్‌కు 6 వికెట్లు కావాలి. అయితే గురువారం వర్షం పడే అవకాశం ఉండడం టీమ్‌ ఇండియాకు ఆందోళన కలిగించే విషయమే.

ఛేదనలో..: బంతి అస్థిరంగా బౌన్స్‌ అవుతున్న పిచ్‌పై, క్లిష్లమైన ఛేదనలో దక్షిణాఫ్రికా కాస్త ప్రతిఘటించింది. మార్‌క్రమ్‌ (1)ను బౌల్డ్‌ చేయడం ద్వారా రెండో ఓవర్లోనే షమి షాకిచ్చినా.. ఆ జట్టు కాస్త పోరాడింది. కీగన్‌ పీటర్సన్‌ (17)తో కలిసి ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఎల్గర్‌ చాలా సహనంతో బ్యాటింగ్‌ చేశాడు. అయితే టీ తర్వాత కుదురుకుంటున్న దశలో పీటర్సన్‌ను సిరాజ్‌ ఓ చక్కని ఔట్‌ స్వింగర్‌తో వెనక్కి పంపాడు. ఎడ్జ్‌తో అతడు వికెట్‌కీపర్‌ పంత్‌కు చిక్కాడు. ఇక భారత పేస్‌ త్రయం దక్షిణాఫ్రికాను చుట్టేస్తుందేమో అనిపించింది. కానీ పట్టుదలగా క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్‌, డసెన్‌ (11; 65 బంతుల్లో 1×4) ఓవర్ల మీద ఓవర్లు ఆడేస్తూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేస్తూ దక్షిణాఫ్రికాను పోటీలో నిలిపారు. ఓ దశలో స్కోరు 74/2. అసలు మరో వికెట్‌ పడకుండానే ఆ జట్టు నాలుగో రోజు ఆటను ముగిస్తుందేమో అనిపించింది. కానీ ఆఖర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా అదిరే బౌలింగ్‌తో మ్యాచ్‌లో భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. ఓ కళ్లు చెదిరే బంతితో డసెన్‌ను బౌల్డ్‌ చేసిన అతడు.. బలపడుతున్న మూడో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. డసెన్‌ బంతిని వదిలేద్దామని చేతులెత్తేశాడు కానీ.. అది సర్రున లోపలికి దూసుకొచ్చి స్టంప్స్‌ను తాకడంతో షాక్‌ తిన్నాడు. ఆ తర్వాత బుమ్రా నాలుగో రోజు ఆట చివరి ఓవర్లో పదునైన యార్కర్‌తో నైట్‌వాచ్‌మన్‌ కేశవ్‌ మహారాజ్‌ (8)ను బౌల్డ్‌ చేశాడు.

పంత్‌ ఒక్కడే..: తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పుణ్యమా అని మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా మెరుగైన స్థితిలో ఉంది కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ పేలవం. ఓపెనింగ్‌ జంట రాణించకపోతే అంతే సంగతులని మరోసారి తేలిపోయింది. మిడిల్‌ ఆర్డర్‌లో అస్థిరత కొనసాగుతూనే ఉంది. ఫామ్‌ను అందుకోవడానికి తంటాలు పడుతున్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, కెప్టెన్‌ కోహ్లి, అజింక్య రహానె మరోసారి నిరాశపరిచారు. ముఖ్యంగా పుజారా..! జట్టులో స్థానం నిలబెట్టుకోవడం కష్టంగా మారిన  ఈ దశలో అతడు వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించగా, సహకరిస్తున్న పిచ్‌పై ఉదయం సెషన్లో దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగిపోయారు. నైట్‌వాచ్‌మన్‌ శార్దూల్‌ (10)ను రబాడ త్వరగానే వెనక్కి పంపాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ (23; 74 బంతుల్లో 4×4) తొలి గంటలో ఎంతో సహనాన్ని ప్రదర్శించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల అనేక బంతులను వదిలేశాడు. కానీ ఎంగిడి వేసిన ఓ బంతితో చేతికి తగలడంతో చికిత్స చేయించుకున్న రాహుల్‌.. ఆ తర్వాత ఏకాగ్రత చెదిరి, ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని వెంటాడి వెనుదిరిగాడు. కొన్ని బౌండరీలతో నియంత్రణలోనే ఉన్నట్లు కనిపించిన కోహ్లి (18; 32 బంతుల్లో 4×4) మళ్లీ ఎప్పటిలాగే ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని కెలికి నిష్క్రమించాడు. జాన్సన్‌ వేసిన ఫులర్‌ లెంగ్త్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయిన అతడు వికెట్‌కీపర్‌ డికాక్‌కు చిక్కాడు. మరోవైపు పుజారా (16; 64 బంతుల్లో 3×4) మాత్రం ఎప్పటిలానే క్రీజులో పాతుకుపోయాడు కానీ.. పరుగులు చేయలేకపోయాడు. రబాడ క్యాచ్‌ వదిలేయడంతో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బతికిపోయిన అతడు.. ఎక్కువ డాట్‌ బాల్స్‌ ఆడేశాడు. చివరికి ఎంగిడి బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ బంతిని గ్లాన్స్‌ చేయబోయి ఎడ్జ్‌తో క్యాచ్‌ ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 109/5. మరో రెండు  పరుగులకే రహానె (20; 23 బంతుల్లో 3×4, 1×6) ఓ పేలవ షాట్‌తో ఔటయ్యాడు. అతడు ఉన్నంతసేపు ధాటిగానే బ్యాటింగ్‌ చేశాడు. కానీ జాన్సన్‌ బౌలింగ్‌లో హుక్‌ షాట్‌ సరిగా ఆడలేక.. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. పంత్‌ ఎదురుదాడికి దిగకపోయుంటే.. మానసికంగా పైచేయినిచ్చే 300పై చిలుకు లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించగలిగేది కాదు. చకచకా బౌండరీలు బాదిన పంత్‌..  అశ్విన్‌ (14)తో ఏడో వికెట్‌కు 35, షమి (1)తో   ఎనిమిదో వికెట్‌కు 20 పరుగులు జోడించి వెనుదిరిగాడు.  షమి, సిరాజ్‌ (0) నిష్క్రమించడానికి ఎంతో సమయం పట్టలేదు. బుమ్రా 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 327
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 197
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ఎల్గర్‌ (బి) ఎంగిడి 23; మయాంక్‌ (సి) డికాక్‌ (బి) జాన్సన్‌ 4; శార్దూల్‌ ఠాకూర్‌ (సి) ముల్దర్‌ (బి) రబాడ 10; పుజారా (సి) డికాక్‌ (బి) ఎంగిడి 16; కోహ్లి (సి) డికాక్‌ (బి) జాన్సన్‌ 18; రహానె (సి) డసెన్‌ (బి) జాన్సన్‌ 20; పంత్‌ (సి) ఎంగిడి (బి) రబాడ 34; అశ్విన్‌ (సి) పీటర్సన్‌ (బి) రబాడ 14; షమి (సి) ముల్దర్‌ (బి) రబాడ 1; బుమ్రా నాటౌట్‌ 7; సిరాజ్‌ (బి) జాన్సన్‌ 0; ఎక్స్‌ట్రాలు 27

మొత్తం: (50.3 ఓవర్లలో ఆలౌట్‌) 174;

వికెట్ల పతనం: 1-12, 2-34, 3-54, 4-79, 5-109, 6-111, 7-146, 8-166, 9-169;

బౌలింగ్‌: రబాడ 17-4-42-4; ఎంగిడి 10-2-31-2; జాన్సన్‌ 13.3-4-55-4; ముల్దర్‌ 10-4-25-0

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (బి) షమి 1; ఎల్గర్‌ బ్యాటింగ్‌ 52; కీగన్‌ పీటర్సన్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 17; డసెన్‌ (బి) బుమ్రా 11; కేశవ్‌ మహారాజ్‌ (బి) బుమ్రా 8; ఎక్స్‌ట్రాలు 5

మొత్తం: (40.5 ఓవర్లలో) 94/4;

వికెట్ల పతనం: 1-1, 2-34, 3-74, 4-94;

బౌలింగ్‌: బుమ్రా 11.5-2-22-2; షమి 9-2-29-1; సిరాజ్‌ 11-4-25-1; శార్దూల్‌ ఠాకూర్‌ 5-0-11-0; అశ్విన్‌ 4-1-6-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని