Team India:క్రికెట్టే.. క్రికెట్టు

ఎన్నో జ్ఞాపకాలతో ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. సరికొత్త ఆశలతో 2022 వచ్చేసింది. ఈ కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు క్రికెట్‌ ఎప్పటిలాగే సిద్ధమైంది. 2022లో టీమ్‌ఇండియా తీరిక లేని

Updated : 02 Jan 2022 07:24 IST

దిల్లీ

న్నో జ్ఞాపకాలతో ఓ ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది. సరికొత్త ఆశలతో 2022 వచ్చేసింది. ఈ కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు క్రికెట్‌ ఎప్పటిలాగే సిద్ధమైంది. 2022లో టీమ్‌ఇండియా తీరిక లేని క్రికెట్‌ ఆడనుంది. ఇక ఆ మజాలో మునిగిపోతూ.. ఆటను ఆస్వాదించడమే అభిమానుల పని. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో భారత జట్టు ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుంది. ఇప్పటికే నిరుడు డిసెంబర్‌ చివర్లో దక్షిణాఫ్రికాతో ఆరంభమైన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి పోరులో అద్భుత విజయం సాధించిన కోహ్లి సేన.. సోమవారం మొదలయ్యే రెండో మ్యాచ్‌తో ఈ ఏడాది క్రికెట్‌ను ఆరంభిస్తుంది. ఈ నెల 11న మూడో టెస్టు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అదే దేశంలో టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌ ఆడుతుంది. 2022లో సొంతగడ్డపై భారత్‌ ఆడే మొదటి సిరీస్‌ (మూడేసి వన్డేలు, టీ20లు) వెస్టిండీస్‌తో ఫిబ్రవరిలో జరుగుతుంది. అనంతరం శ్రీలంకకు ఆతిథ్యమిస్తుంది. ఆ జట్టుతో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడుతుంది. ఎప్పటిలాగే ధనాధన్‌ ఆటతో అలరించే ఐపీఎల్‌ కూడా ఈ ఏడాది టీ20ల కిక్కును అందించేందుకు సిద్ధం కానుంది. ఏప్రిల్‌, మే నెలల్లో స్వదేశంలోనే లీగ్‌ జరిగే అవకాశాలున్నాయి. ఈ సారి కొత్తగా మరో రెండు ఫ్రాంఛైజీలు లీగ్‌లో చేరుతుండడంతో మజా మరింతగా పెరగనుంది. ఆ తర్వాత జూన్‌లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడే భారత్‌.. జులైలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్తుంది. అనంతరం వెస్టిండీస్‌కు పయనమయ్యే అవకాశాలున్నాయి. సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ రూపంలో మరోసారి దాయాది దేశాలు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పోరు చూసే ఛాన్స్‌ దొరకుతుంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన టీమ్‌ఇండియాకు.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను అందుకునేందుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ఈ ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. ఇక చివరగా బంగ్లాదేశ్‌ పర్యటనతో భారత్‌ ఈ ఏడాదిని ముగించే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని