Virat Kohli: విరాట్‌ త్వరలో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడతాడు : ద్రవిడ్‌

విరాట్‌ కోహ్లి త్వరలోనే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడతాడని భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. విరాట్‌ సెంచరీ చేసి రెండేళ్లు అయిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. 

Updated : 03 Jan 2022 07:35 IST

జొహానెస్‌బర్గ్‌

విరాట్‌ కోహ్లి త్వరలోనే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడతాడని భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. విరాట్‌ సెంచరీ చేసి రెండేళ్లు అయిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘గత కొంత కాలంగా ఫామ్‌ గురించి.. కెప్టెన్సీ గురించి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నా విరాట్‌ మాత్రం స్థిరంగా ఉన్నాడు. అతడు త్వరలోనే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడతాడు. విరాట్‌ బ్యాటింగ్‌లో మరీ లోపాలు లేవు. జోరుగానే ఆడుతున్నాడు కానీ శుభారంభాలను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో అతడు జట్టును గొప్పగా నడిపించాడు. అతడు ప్రాక్టీస్‌ చేసే తీరు.. జట్టుతో అనుసంధానమయ్యే విధానం బాగుంటాయి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లందరిలోకెళ్లా కోహ్లినే ప్రశాంతంగా ఉన్నాడు’’ అని ద్రవిడ్‌ అన్నాడు.

ఓవర్‌ రేట్‌లో మెరుగుపడాలి:  నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయడానికి ప్రయత్నించాలని ఈ విషయంలో తమ బౌలర్లు మెరుగుపడాల్సి ఉందని ద్రవిడ్‌ అన్నాడు. ‘‘ఓవర్‌రేట్‌ మెరుగుపరచడం కోసం ఐసీసీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. జరిమానాలు, పాయింట్ల కోతలు కోచ్‌గా మాలాంటి వారికి ఇవి కష్టంగా అనిపించొచ్చు. కానీ తప్పదు. ఐసీసీ   జరిమానాలు విధించడం ఇదేం కొత్త కాదు. అయితే ఫలితాల్లో మార్పులు ఉండట్లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు తొలి టెస్టులో బుమ్రా కాలు మడతపడిప్పుడు అతడికి సేవలందించడానికి ఫిజియోలు ఎక్కువ సమయం తీసుకున్నారు. అయితే పరిణామాలు ఎలా ఉన్నా వీలైనంత వేగంగా ఓవర్లు వేయడం కీలకం’’ అని ద్రవిడ్‌ అన్నాడు. సెంచూరియన్‌ టెస్టులో స్లో ఓవర్‌ రేటు కారణంగా మ్యాచ్‌ ఫీజులో భారత్‌కు 20 శాతం కోత పడింది. అంతేకాదు ఓవర్‌ తక్కువ వేసినందుకు భారత్‌ ఒక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ కూడా కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని