IND vs SA:చరిత్ర సృష్టిస్తారా..!

సెంచూరియన్‌ గెలుపు ఉత్సాహాన్నిస్తుంటే.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయం ఊరిస్తుంటే.. కొత్త సంవత్సరంలో తొలి సమరానికి సిద్ధమైంది టీమ్‌ ఇండియా. అచ్చొచ్చిన వాండరర్స్‌లో నేటి నుంచే రెండో టెస్టు. ఎప్పుడూలేని విధంగా భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటే.. ఫామ్‌లో లేని దక్షిణాఫ్రికా కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.

Updated : 03 Jan 2022 06:38 IST

ఉత్సాహంగా టీమ్‌ఇండియా

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు నేటి నుంచే

మధ్యాహ్నం 1.30 నుంచి

జొహానెస్‌బర్గ్‌

సెంచూరియన్‌ గెలుపు ఉత్సాహాన్నిస్తుంటే.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయం ఊరిస్తుంటే.. కొత్త సంవత్సరంలో తొలి సమరానికి సిద్ధమైంది టీమ్‌ ఇండియా. అచ్చొచ్చిన వాండరర్స్‌లో నేటి నుంచే రెండో టెస్టు. ఎప్పుడూలేని విధంగా భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటే.. ఫామ్‌లో లేని దక్షిణాఫ్రికా కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.

దక్షిణాఫ్రికాపై తొలిసారి సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్న టీమ్‌ఇండియా.. సోమవారం ఆరంభమయ్యే రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. సెంచూరియన్‌ (తొలి టెస్టు)లో దక్షిణాఫ్రికా కంచుకోటను బద్దలు కొట్టి రెట్టించిన విశ్వాసంతో ఉన్న కోహ్లీసేనను నిలువరించడం ఆతిథ్య జట్టుకు పెను సవాలే. కలిసొచ్చిన మైదానంలో ఆడుతుండడం భారత్‌కు సానుకూలాంశం. అయితే ఎంత బలహీన పడ్డా.. స్వదేశంలో ఆడుతున్న  దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసేయలేం.

ఇదే మంచి తరుణం: తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన కోహ్లీసేనపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ కలను నెరవేర్చుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ ఆతిథ్య జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఒకప్పటి గ్రేమ్‌ స్మిత్‌ పట్టుదల, హషీమ్‌ ఆమ్లా క్లాస్‌, కలిస్‌ నిలకడ, డేల్‌ స్టెయిన్‌, మోర్నీ మోర్కెల్‌లోని పదును ఆ జట్టులో లోపించాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా. ఆ జట్టులో రబాడ లాంటి మేటి ఫాస్ట్‌బౌలర్‌ ఉన్న మాట నిజమే. ఎంగిడి కూడా బాగానే రాణిస్తున్నాడు. కానీ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ అకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌కావడం కఠినమైన సంధికాలాన్ని దక్షిణాఫ్రికాకు మరోసారి గుర్తు చేసినట్లయింది. ఆ సంధికాలం ఇప్పట్లో పూర్తయ్యేలా కూడా లేదు. కొత్త వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కైల్‌ వెరీన్‌ అరంగేట్రానికి సిద్ధమైనా, కాస్త ఆసక్తిరేపుతున్నా.. బుమ్రా, షమి లాంటి పేసర్లను ఎదుర్కొని పరుగులు చేయడం అతడికి కష్టమైన పనే. ఇక ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. మరోసారి అయిదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశముంది. బుమ్రా, షమి, సిరాజ్‌లతో కూడిన పదునైన పేస్‌ దళం మరోసారి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించడానికి సిద్ధమవుతోంది. తొలి టెస్టులో పేసర్లు 18 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. శార్దూల్‌లో అంత పదును లేకున్నా.. బ్యాటింగ్‌ కూడా చేయగల సామర్థ్యం వల్ల అతడు తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశముంది.   పేస్‌ అనుకూల వాండరర్స్‌ పిచ్‌పై ఉమేశ్‌ యాదవ్‌ కూడా బాగానే ఉపయోగపడతాడు. కానీ శార్దూల్‌ను కాదని అతణ్ని తీసుకునే అవకాశాలు తక్కువే. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు రాహుల్‌, మయాంక్‌ల ఫామ్‌ భారత్‌కు గొప్ప సానుకూలంశం. మిడిల్‌ ఆర్డర్‌లో తడబాటు పోని నేపథ్యంలో వాళ్లు మరోసారి శుభారంభాన్నివ్వడం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం. అందరి దృష్టీ తనపైనే ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌తోనైనా ఫామ్‌ను అందుకుని కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అన్నది ఆసక్తికరం. జట్టులో తమ స్థానాలు సందిగ్ధంలో పడ్డ ఈ పరిస్థితుల్లో సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానె పరుగుల బాట పట్టాల్సిన అవసరముంది. శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారి నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఫామ్‌ అందుకోకుంటే ఈ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌కు మరిన్ని అవకాశాలు లభించకపోవచ్చు.

దక్షిణాఫ్రికాకు పరీక్ష: దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్‌ పెద్ద పరీక్షే. బ్యాట్స్‌మెన్‌ పేలవ ఫామ్‌ ఆ జట్టుకు పెద్ద ప్రతికూలాంశం. అయితే భారత్‌ మెరుగ్గా కనిపిస్తున్నా.. పేస్‌ అనుకూల పిచ్‌పై ఆ జట్టు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమైన ఒలివర్‌ జట్టులోకి రావడం ఆతిథ్య జట్టుకు సానుకూలాంశమే. రబాడ, ఎంగిడిలతో కలిసి అతడు    భారత్‌ను పరీక్షిస్తాడని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఒలివర్‌ వాండరర్స్‌లో తన గత మూడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. డికాక్‌   హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ మరింత బలహీన పడింది. ఆ జట్టు ఆశలన్నీ కెప్టెన్‌ ఎల్గర్‌ మీదే ఉన్నాయి. అతడికి తోడు అనుభవజ్ఞులు బవుమా, వాండర్‌డసెన్‌ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ముల్దర్‌ నుంచి జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఆశిస్తోంది.

తుది జట్లు: భారత్‌ (అంచనా): రాహుల్‌, మయాంక్‌, పుజారా, కోహ్లి, రహానె, పంత్‌, అశ్విన్‌ శార్దూల్‌ ఠాకూర్‌, షమి, బుమ్రా, సిరాజ్‌

దక్షిణాఫ్రికా (అంచనా): ఎల్గర్‌, మార్‌క్రమ్‌, కీగన్‌ పీటర్సన్‌, వాండర్‌డసెన్‌, బవుమా, వెరీన్‌ (వికెట్‌కీపర్‌), ముల్దర్‌, రబాడ, కేశవ్‌ మహారాజ్‌, ఒలివర్‌, ఎంగిడి


పిచ్‌ ఎలా ఉందంటే..

వాండరర్స్‌లో పిచ్‌ ఎప్పుడైనా పేస్‌, బౌన్స్‌కు సహకరిస్తుంది. వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. వర్షంతో అంతరాయాలు తప్పకపోవచ్చు. మ్యాచ్‌ జరిగే అయిదు రోజుల్లో నాలుగు రోజుల ఆట.. వర్షం వల్ల ప్రభావితమయ్యే అవకాశముంది.


కలిసొచ్చిన మైదానం..

మ్యాచ్‌ వేదిక వాండరర్స్‌ మైదానం టీమ్‌ఇండియాకు కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఇంతకుముందు ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లోనూ భారత్‌  ఓడిపోలేదు. రెండింటిలో గెలిచి మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. చివరికి ఇక్కడ 2018లో ఆడిన టెస్టులో 63 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆఖరి రోజు వర్షం అడ్డుతగలకపోతే డ్రా అయిన  ఆ మూడింట్లో ఒక మ్యాచ్‌ (జనవరి 1997)లో టీమ్‌ఇండియా గెలిచేదే.


6

కపిల్‌దేవ్‌ను అధిగమించి, భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలవడానికి అశ్విన్‌కు కావాల్సిన వికెట్లు. కుంబ్లే (619)ది అగ్రస్థానం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని