Ashes Series :ఖవాజా.. ఖలేజా!

అప్పుడెప్పుడో 2019 ఆగస్టులో చివరగా అతను టెస్టు మ్యాచ్‌ ఆడాడు.. రెండున్నరేళ్లు కావస్తోంది.. ఇక అతను జట్టులోకి రావడం కష్టమేననిపించింది. కానీ ఓ ఆటగాడికి కరోనా సోకడం.. అతనికి

Updated : 09 Jan 2022 06:57 IST

రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ

ఆస్ట్రేలియా 265/6 డిక్లేర్డ్‌

ఇంగ్లాండ్‌ లక్ష్యం 388.. ప్రస్తుతం 30/0

సిడ్నీ

అప్పుడెప్పుడో 2019 ఆగస్టులో చివరగా అతను టెస్టు మ్యాచ్‌ ఆడాడు.. రెండున్నరేళ్లు కావస్తోంది.. ఇక అతను జట్టులోకి రావడం కష్టమేననిపించింది. కానీ ఓ ఆటగాడికి కరోనా సోకడం.. అతనికి వరంగా మారింది. మైదానంలో దిగడమే కాదు వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలతో ఇప్పుడు జట్టులో తనను కొనసాగించక తప్పని పరిస్థితి కల్పించాడు. అతనే ఆసీస్‌ ఆటగాడు ఉస్మాన్‌ ఖవాజా. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను సెంచరీ సాధించాడు. దీంతో ప్రత్యర్థి ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన కంగారూ జట్టు.. చివరి రోజు పది వికెట్లు పడగొట్టి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రోజంతా బ్యాటింగ్‌ చేసి ఓటమి తప్పించుకోవాలని రూట్‌ సేన చూస్తోంది.

సహచర ఆటగాడు హెడ్‌ కొవిడ్‌ బారిన పడడంతో అతని స్థానంలో అనుకోకుండా యాషెస్‌ సిరీస్‌లో నాలుగో టెస్టు కోసం జట్టులోకి వచ్చిన ఖవాజా (101 నాటౌట్‌; 138 బంతుల్లో 10×4, 2×6) అదరగొట్టాడు. వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలతో సత్తాచాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేసిన అతను అజేయ శతకంతో జట్టును శాసించే స్థితిలో నిలిపాడు. అతనితో పాటు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ (74; 122 బంతుల్లో 7×4, 1×6) రాణించడంతో నాలుగో రోజు, శనివారం ఆసీస్‌ 265/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ (4/84) మెరిశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రూట్‌ సేన 11 ఓవర్లలో 30/0తో ఆట ముగించింది. ఓపెనర్లు క్రాలీ (22 బ్యాటింగ్‌), హమీద్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు లక్ష్యానికి ఇంకా 358 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 258/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లిష్‌ జట్టు 294 పరుగులకు ఆలౌటైంది. తన ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో పది పరుగులు మాత్రమే జోడించిన బెయిర్‌స్టో (113; 158 బంతుల్లో 8×4, 3×6)ను బోలాండ్‌ (4/36) వెనక్కి పంపాడు. ఇప్పటివరకూ సిడ్నీ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేదించిన అత్యధిక లక్ష్యం 288 పరుగులు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ డ్రా కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందా? లేదా ఆసీస్‌ బౌలర్ల ధాటికి దాసోహమై మరో పరాజయాన్ని మూట గట్టుకుంటుందా? అన్నది ఆదివారం తేలిపోతుంది. చివరి రోజు చినుకులు పడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో వరుణుడు ఇంగ్లాండ్‌కు సాయం చేస్తాడేమో చూడాలి.

మళ్లీ అతనే..: 122 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ టాప్‌ఆర్డర్‌ను కుదురుకోనివ్వని ఇంగ్లాండ్‌ ఆధిపత్యం ప్రదర్శించేలా కనిపించింది. లీచ్‌తో పాటు మార్క్‌వుడ్‌ (2/65) ప్రత్యర్థి బ్యాటర్లకు సవాళ్లు విసిరారు. వార్నర్‌ (3)ను త్వరగానే పెవిలియన్‌ చేర్చిన మార్క్‌వుడ్‌ ప్రత్యర్థికి దెబ్బకొట్టాడు. మరో ఓపెనర్‌ హారిస్‌ (27)తో పాటు లబుషేన్‌ (29), స్మిత్‌ (23) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో ఆ జట్టు 86/4తో కష్టాల్లో పడింది. ఆ దశలో తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో ఖవాజా మరోసారి క్రీజులో నిలబడ్డాడు. గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. ప్రత్యర్థి బౌలర్లు అతణ్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరోవైపు గ్రీన్‌ కూడా అతనికి చక్కటి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ సౌకర్యవంతంగా క్రీజులో కదులుతూ పరుగులు సాధించడంతో ఆసీస్‌ మళ్లీ ఆధిపత్యం సాధించింది. ఖవాజా క్లాస్‌ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కవర్‌డ్రైవ్‌, కట్‌ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. 86 బంతుల్లో అర్ధశతకం అందుకున్న అతను.. ఆ తర్వాత గేర్‌ మార్చాడు. మరో 45 బంతుల్లోనే అతను 50 నుంచి 100కు చేరుకున్నాడు. అయితే సెంచరీ దిశగా సాగేలా కనిపించిన గ్రీన్‌తో పాటు కేరీ (0)ని లీచ్‌ వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఖవాజా, గ్రీన్‌ కలిసి అయిదో వికెట్‌కు 179 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ వికెట్‌ పడకుండా జాగ్రత్త పడింది. ఓపెనర్లు క్రాలీ, హమీద్‌.. 11 ఓవర్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 416/8 డిక్లేర్డ్‌; ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 294 (బెయిర్‌స్టో 113, బోలాండ్‌ 4/36); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌:  265/6 డిక్లేర్డ్‌ (ఖవాజా 101 నాటౌట్‌, గ్రీన్‌ 74, లీచ్‌ 4/84); ఇంగ్లాండ్‌  రెండో ఇన్నింగ్స్‌: 30/0 (క్రాలీ 22 బ్యాటింగ్‌, హమీద్‌ 8 బ్యాటింగ్‌)


3

సిడ్నీ మైదానంలో ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓ బ్యాటర్‌ శతకాలు చేయడం ఇది మూడో సారి. చివరగా మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ 2006లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని